70వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. 2022 సంవత్సరానికిగానూ ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీనటులు, సాంకేతిక నిపుణులుగా కేంద్రం ఎంపిక చేసిన విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలను అందజేశారు.
జాతీయ ఉత్తమ నటుడిగా రిషబ్‌శెట్టి (కాంతార), జాతీయ నటిగా నిత్యామీనన్ (తిరుచిత్రంబలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్) అవార్డులను అందుకోగా, ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా నిలిచిన ‘కార్తికేయ 2’ దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత అభిషేక్ అగర్వాల్ పురస్కారాలను రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకున్నారు. ‘దాదాపు 15 ఏళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇది. చాలా ఆనందంగా ఉంది. నా సహ నటులు, ‘తిరుచిత్రంబలం’ బృందానికి ఈ అవార్డుని అంకితం ఇస్తున్నా’ అని నిత్యామీనన్ అన్నారు. ఇదిలా ఉంటే, దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని బాలీవుడ్ సీనియర్ నటుడు మిధున్ చక్రవర్తి అందుకున్నారు. ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా పొన్నియన్ సెల్వన్ 1 చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఇది ఆయన అందుకున్న 7వ జాతీయ అవార్డు కావడం విశేషం. అవార్డుల్లో అత్యధిక విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్న ‘పొన్నియల్ సెల్వన్ 1’ చిత్రానికి దర్శకుడు మణిరత్నం సైతం ఈ ప్రతిష్టాత్మక అవార్డును పొందారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు పాలైన జానీమాస్టర్‌కు ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డుని ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే.