నవతెలంగాణ-గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా సంక్రాంతి, కనుము పండగ వేడుకలను మండల ప్రజలు మంగళ, బుధవారాల్లో రెండు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. సంక్రాంతి రోజు మహిళలు పోటీలు పడి ముంగిళ్ళలో రంగురంగుల ముగ్గులను వేసి అలరించారు. పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన యువతులకు బహుమతి ప్రధానం చేశారు. మండల కేంద్రంలో వాలీబాల్ పోటీలను నిర్వహించి యువకులకు నూతన ఉత్సాహాన్ని కలిగించారు. పిల్లలు గాలిపతంగులను మైదాన ప్రాంతాల్లో ముమ్మరంగా ఎగురవేశారు. పోటీలు పడి మరి పతంగులను ఎగురవేయడం ప్రతి గ్రామం పొలిమేరలో కనిపించింది. అదే విధంగా ఎప్పటినుంచో తమ నైపుణ్యంతో పెంచిన కోళ్లను కొందరు విక్రయించుకోగా మరికొందరు చాటుమాటుగా పందాలు వేశారు. కనుమ పండుగ రోజు మహిళలు గోమాతలను పూజించి వాటికి నైవేద్యాన్ని ఆహారంగా అందించారు. రాజకీయ నాయకులు పలు వర్తక సంఘాల వారు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లను ప్లెక్సీలను గ్రామ సెంటర్లలో వెలిసే విధంగా ఏర్పాట్లు చేసుకునీ శుభాకాంక్షలు తెలిపారు.