నవతెలంగాణ-ధర్మసాగర్ : పెద్ద పెండ్యాల గ్రామంలోని పెద్దమ్మ తల్లి నగలు దొంగతనం అయిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.స్థానిక సీఐ మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామ పెద్దమ్మ తల్లి ఉత్సవ కమిటీ అధ్యక్షుడైన పిట్టల అశోక్ తన రోజువారిలో భాగంగా మంగళవారం గుడిని శుభ్రం చేసి పూజలు చేసిన అనంతరం రాత్రి 8:30 గంటలకు తాళం వేసి ఇంటికి వెళ్ళిరని తెలిపారు. మరుసటి రోజు ఉత్సవ కమిటీ సభ్యుడైన పిట్టల వెంకటేశ్వర్లు బుధవారం రోజున పిట్టల అశోక్ వద్ద నుండి గుడికి సంబంధించిన తాళం చెవి తీసుకొని సుమారు ఉదయం 6 గంటలకు గుడి వద్దకు వెళ్లేసరికి గుడి ఇనుప గేటు కి వేసిన తాళం పగలగొట్టబడి ఉండగా, వెంటనే పిట్టల అశోక్ కి సమాచారం అందించగా వెంటనే పిట్టల అశోక్ గుడి వద్దకు వెళ్లి చూసేసరికి గుడిలోని అమ్మవారి మెడలో గల బంగారపు రెండు పుస్తెలు,బంగారపు ముక్కుపుడక,నాలుగు వెండి మట్టెలు వీటి విలువ మొత్తం 67,400/-రూపాయల ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినారని తెలిపారు. బాధితులు ఘటనకు సంబంధించిన వివరాలను దరఖాస్తుగా ఇవ్వగా కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.