– మూడు పశువులకు తీవ్రంగా గాయాలు
– రూ.50 వేల ఆస్తి నష్టం
– కన్నీరుమున్నీరవుతున్న బాధిత రైతు ఈడ్గీ నర్సింహులు గౌడ్
నవతెలంగాణ-కొడంగల్
ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైన ఘటన దౌల్తాబాద్ మండలం గుండేపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గుండెపల్లికి చెందిన ఈడ్గీ నర్సింహులుకు వ్యవసాయంతో పాటు పశువులు కూడా ఉన్నాయి. పశువుల మేత కోసం తన పొలంలోనే దొడ్డి ఏర్పాటు చేసి గడ్డివాము అక్కడే ఉంచాడు. దొడ్డిలోనే పశువులకు గుడిసె ఏర్పాటు చేసి పశువులను కూడా అక్కడే ఉంచేవాడు. గుర్తు తెలియని ఆకతాయిలు గడ్డివాముకు నిప్పు పెట్ట డంతో కాలి బూడిదయింది. అక్కడే ఉన్న మూడు పశువులకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు చూసి పశువులను విడవడంతో గాయాలతో బయటపడ్డాయని రైతు ఈడ్గీ నర్సింహులు గౌడ్ కన్నీరు మున్నీరవుతూ తెలిపారు. రూ.50 వేల గడ్డి వాము దగ్ధమైందని, మూడు పశువులకు తీవ్రంగా గాయాలయ్యాయనీ, తన పశువులు ఆకలితో అలమటిస్తాయనీ, తిరిగి పశుగ్రాసం కొనడానికి తన వద్ద ఆర్థిక స్తోమత లేదని బోరున విలపించాడు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతు, గ్రామస్తులు కోరారు.