– రాష్ట్రం నుంచి హాజరైన మంత్రులు డాక్టర్ సీతక్క, కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ‘మహా’ ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. పూర్వవైభవాన్ని రాబట్టుకునేందుకు, పట్టు సాధించేందుకు సీనియర్లతో కసరత్తు చేయిస్తున్నది. అందులో భాగంగానే సీనియర్ పరిశీలకులను నియమించింది. ఆ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి రమేశ్ చెన్నితల నేతృత్వంలో ముంబయిలో శనివారం అర్ధరాత్రి వరకూ ఏఐసీసీ నియమించిన బృందం భేటీ అయ్యింది. రమేశ్ చెన్నితల, ఆయా రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భుపేష్ బఘేల్, చరణ్ జిత్ చన్నీ, మాజీ ఉప ముఖ్యమంత్రులు టి.యస్.సింగ్ దేవ్ ,పరమేశ్వరన్, తెలంగాణ మంత్రులు డాక్టర్ సీతక్క, కెప్టెన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కర్నాటక మంత్రి ఎంబీ.పాటిల్‌లతో పాటు మహారాష్ట్ర సీనియర్ నాయకులు సుధీర్ఘంగా సమాలోచనలు జరిపారు. నవంబర్‌లో జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు గానూ వ్యూహరచన మొదలుపెట్టారు. ఎన్నికల ప్రచార వ్యూహానికి ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం 37 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారు. అక్కడ ప్రస్తుతం శివసేన(షిండే)- ఎన్సీపీ(అజిత్‌పవార్)-బీజేపీ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన విషయం విదితమే. శివసేన, ఎన్సీపీలను చీల్చి బీజేపీ అక్కడ అధికారంలోకి వచ్చిందనే అపవాదు బలంగా ఉంది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో దాని ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ప్రజలు తీవ్ర అసంతృప్తితో శివసేన(యూబీటీ)-కాంగ్రెస్-ఎన్సీపీ(శరద్‌పవార్) వైపు మొగ్గుచూపారు. ఆ కూటమి 30 స్థానాల్లో జయకేతనం ఎగురవేయగా..బీజేపీ కూటమి 18 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీలో ఎన్నికల్లో ఈ ఫలితాలను సానుకూలంగా మలుచుకుని అక్కడ ఈసారి పాగా వేయాలని కాంగ్రెస్ గట్టి నిర్ణయంతో రంగంలోకి దిగింది.