
నవతెలంగాణ – నసురుల్లాబాద్
బాన్సువాడ పట్టణంలో సీపీఐ(ఎం), సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నేడు బీర్కూర్, నసురుల్లాబాద్, నెమ్లి గ్రామాల్లో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కలిల్ మాట్లాడుతూ.. మే డేకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. వేలాది మంది కార్మికులు 1886 మే 1న చికాగో నగరంలో హే మార్కెట్ వద్ద పని గంటలు తగ్గించాలని పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అమెరికా పెట్టుబడిదారీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారని, ఆయా రంగాల్లో పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కార్మికులకు సరిపడే విధంగా జీతాలు ఇవ్వాలని, 8 గంటలే పని కల్పించాలని, పని ప్రదేశాల్లో కార్మికులకు ప్రమాదాలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించి తగిన న్యాయం చేసి కుటుంబాలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులకు ఎర్రజెండా ఎల్లప్పుడూ తోడు ఉంటుందని పిలుపునిచ్చారు. మేడే ఉత్సవాల్లో బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి , ఇతర పార్టీల నాయకులు పాల్గొన్నారు.