బ్రిటన్‌లో ‘లేబర్‌’ ఘన విజయం

'Labour' is a great victory in Britain– కొత్త ప్రధానిగా కీర్‌ స్టార్మర్‌
– 14 ఏండ్ల టోరీల పాలనకు తెర
లండన్‌: బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ అఖండ విజయం సాధించింది. బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌లో రాజు చార్లెస్‌-3తో శుక్రవారం భేటీ అనంతరం నూతన ప్రధానిగా స్టార్మర్‌ను అధికారికంగా ప్రకటించారు. ఆ వెంటనే ఆయన ప్రధాని అధికారిక నివాసమైన టెన్‌ డౌన్‌ స్ట్రీట్‌లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన తొలి ప్రసంగం చేస్తూ, ‘మన దేశం నిర్ణయాత్మక మార్పుకు ఓటేసింది. రాజకీయాల నుంచి ప్రజా సేవకు తిరిగొద్దాం’ అని పిలుపునిచ్చారు. మార్పు అంటే ఒకరి చేతిలోంచి అధికారం మరొకరి చేతికి మారడం కాదని స్టార్మర్‌ అన్నారు. ప్రపంచం అంతకంతకూ అస్థిరంగా మారుతోంది. మార్పు కోసం ఇప్పటి నుంచే కృషి ప్రారంభిద్దామని తెలిపారు.తనలాంటి కార్మికవర్గ కుటుంబాలు తమ జీవితాలను తీర్చిదిద్దుకోగలిగే పరిస్థితిని తీసుకు రావడంపై దృష్టి కేంద్రీకరిస్తానన్నారు. అస్తవ్యస్తమైన జాతీయ ఆరోగ్య వ్యవస్థను తిరిగి పట్టాలపైకి ఎక్కిస్తానని, దేశ సరిహద్దులను పదిలంగా కాపాడతానని, పాఠశాలల అవసరాలు తీర్చుతానని, అందరికీ అందుబాటులో ఇండ్ల ధరలు ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు. ‘మీ పిల్లలకు బ్రిటన్‌ మెరుగైన భవిష్యత్‌ ఇస్తుందని నమ్ముతున్నారా అని మిమ్మల్ని నేనడిగితే మీలో చాలా మంది లేదు అని చెబుతారు. ఆ విషయం నాకు తెలుసు. మీరు తిరిగి నమ్మేంతవరకు మా ప్రభుత్వం పోరాడుతుంది’ అని ఆయన చెప్పారు.ఈ ఎన్నికల్లో కన్సర్వేటివ్‌ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ రిషి సునాక్‌ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అలాగే కన్సర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానం నుంచి కూడా తప్పుకున్నారు.650 స్థానాలున్న బ్రిటన్‌ పార్లమెంటు దిగువ సభ (హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కావడానికి ఇంకా కొంత వ్యవధి పట్టవచ్చు. అయితే, ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలు, ఆధిక్యతలను బట్టి చూస్తే, లేబర్‌ పార్టీ 412 సీట్లు గెలుచుకుంది. కన్సర్వేటివ్స్‌కు 121 స్థానాలు దక్కాయి. మొత్తం మీద కన్సర్వేటివ్స్‌ పద్నాలుగేండ్ల పాలనకు బ్రిటన్‌ ప్రజలు చరమగీతం పాడారు.