గ్రేటర్‌ నోయిడా అథారిటీపై రైతుల ఘనవిజయం- దిగొచ్చిన అధికార యంత్రాంగం

– ఏఐకేఎస్‌ అభినందనలు
న్యూఢిల్లీ : గ్రేటర్‌ నోయిడా అథారిటీపై రైతు ఉద్యమం ఘనవిజయం సాధించింది. రైతుల పోరాటానికి అధికార యంత్రాంగం దిగొచ్చింది. గత 60 రోజులుగా ఏఐకేఎస్‌ ఆధ్వర్యంలో రైతులు తమ డిమాండ్ల సాధన కోసం గ్రేటర్‌ నోయిడా అథారిటీ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ఆందోళన చేస్తున్నారు. రైతులపై పోలీసుల అణచివేత ప్రదర్శించారు. 35 మంది రైతు నాయకులను అరెస్టు చేసి జైళ్లో పెట్టారు. నిర్బంధాలను లెక్కచేయకుండా పోరాటం కొనసాగించారు. గ్రేటర్‌ నోయిడా డెవలప్‌మెంట్‌ అథారిటీ, అలాగే బీజేపీ ప్రభుత్వం రైతులతో ఒక ఒప్పందానికి రావాల్సి వచ్చింది. ఇది స్ఫూర్తిదాయక విజయమని ఏఐకేఎస్‌ పేర్కొంది. పోరాడిన వారందరికీ, ముఖ్యంగా పెద్ద సంఖ్యలో మహిళలకు ఎఐకెఎస్‌ అభినందనలు తెలిపింది. ఇది ఐక్య పోరాట బలాన్ని రుజువు చేసిందని పేర్కొంది. అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయడంతో రైతుల సమస్యలు పరిష్కారించేందుకు అంగీకరించింది. అన్ని సమస్యలపై చర్చకు అంగీకరించిన ప్రభుత్వం జూన్‌ 30న చర్చించి తుది నిర్ణయం తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. రాజ్యసభ సభ్యుడు సురందర్‌ నగర్‌ రైతులకు ఒప్పంద పత్రాన్ని అందజేశారు.
”సమస్యలపై హై పవర్‌ కమిటీని ఏర్పాటు చేయాలి, దీనిలో స్థానిక పార్లమెంటు సభ్యులు (రాజ్యసభ, లోక్‌సభ), శాసనసభ సభ్యులు (జేవార్‌, దాద్రీ), అలాగే చైర్మెన్‌ గ్రేటర్‌ నోయిడా అథారిటీ, పారిశ్రామిక అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, గ్రేటర్‌ నోయిడా అథారిటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, రైతు ప్రతినిధులను కూడా సభ్యులుగా నామినేట్‌ చేయాలి. ప్రధానంగా సేకరించిన భూమికి సంబంధించి 10 శాతం అబాదీ ప్లాట్లు ఇవ్వాలి. అబాదీ నిబంధనలలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం షిఫ్టింగ్‌ పాలసీ జారీ చేయాలి. కనీసం 120 చదరపు మీటర్ల అబదీ ప్లాట్‌ ప్రతిపాదన స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి, అథారిటీకి చెందిన హౌసింగ్‌ స్కీమ్‌లలో రైతుల 17.5 శాతం కోటా పునరుద్ధరణ, సిట్‌ దర్యాప్తులో కవర్‌ చేయబడిన లీజు బ్యాంకు ప్రభుత్వ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న కేసులు, ప్రభావితమైన భూమిని తరలించిన కేసులపై చర్చ జరుగుతుంది. ప్రాజెక్ట్‌, మొదలైనవి ఈ కమిటీ రైతుల డిమాండ్లను కూలంకషంగా చర్చించేందుకు జూలై 15 లోపు సమావేశం నిర్వహించి నిబంధనల ప్రకారం సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు” అని అదనపు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ వర్ధన్‌ ఒప్పంద పత్రాన్ని విడుదల చేశారు.