పసిడి గుర్రాలు!

Green horses!– 41 ఏండ్ల తర్వాత గుర్రపుస్వారీలో గోల్డ్‌
– సెయిలర్‌ ఎబాడ్‌ అలీకి కాంస్యం
– ఈక్వెస్ట్రియన్‌లో చారిత్రక పసిడి
– సెయింగ్‌లో నేహా ఠాకూర్‌కు సిల్వర్‌
నవతెలంగాణ-హాంగ్జౌ
భారత రేసు గుర్రాలు పసిడి పట్టాయి. ఈక్వెస్ట్రియన్‌ (గుర్రపుస్వారీ)లో భారత జట్టు చారిత్రక విజయం సాధించింది. చివరగా 1982 ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌ గోల్డ్‌ మెడల్‌ నెగ్గగా.. తాజాగా హాంగ్జౌలోనే మళ్లీ పసిడి దక్కింది. డ్రెస్సేజ్‌ ఈవెంట్‌లో అదరగొట్టిన మనోళ్లు.. మూడో రోజు హైలైట్‌గా నిలిచారు. సెయిలింగ్‌లో నేహా ఠాకూర్‌ సిల్వర్‌ సాధించగా, ఎబాడ్‌ అలీ కాంస్య పతకం నెగ్గాడు. తొలి రోజు ఐదు, రెండో రోజు ఆరు పతకాలు సాధించిన టీమ్‌ ఇండియా.. హాంగ్జౌలో మూడో రోజు మూడు పతకాలతో సరిపెట్టుకుంది.
‘2018లో భారత్‌కు డ్రెస్సేజ్‌ జట్టే లేదు. పోటీపడేందుకు కనీసం మగ్గురు రైడర్లూ లేరు. కానీ ఈసారి పోటీలకు రావటమే కాదు చారిత్రక స్వర్ణం సాధించటం ఎంతో గర్వంగా ఉంది. ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌లో పెద్ద సదుపాయాలు లేవు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎక్కువగా విదేశాల్లోనే సాధన చేశాం. పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడేందుకు సైతం భారత్‌కు ఇప్పుడో జట్టు ఉందని చెప్పగలను. 23 ఏండ్ల వయసులో స్వర్ణం సాధించటం మాటల్లో చెప్పలేని అనుభూతి’
– అనుశ్‌ అగర్‌వాల,
ఈక్వెస్ట్రియన్‌ రైడర్‌
ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌ క్రీడను తొలుత 1982 ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టగా.. ఆతిథ్య భారత్‌ ఏకంగా మూడు పసిడి పతకాలు కొల్లగొట్టింది. కానీ ఆ తర్వాత 41 ఏండ్ల పాటు ఈ విభాగంలో టీమ్‌ ఇండియాకు బంగారం దక్కలేదు. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో భారత యువ జట్టు గుర్రపుస్వారీలో పసిడి దాహం తీర్చారు. డ్రెస్సేజ్‌ విభాగంలో స్వర్ణం సాధించిన సుదీప్తి హజెల, దివ్య కృతి సింగ్‌, అనుశ్‌ అగర్‌వాల, హృదరు విపుల్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. 1982లో ఈక్వెస్ట్రియన్‌ ఈవెంటింగ్‌లో పసిడి పతకాలు సాధించగా.. ఇప్పుడు డ్రెస్సేజ్‌ విభాగంలో గోల్డ్‌ దక్కింది.
రేసు అదిరింది
ఈక్వెస్ట్రియన్‌ డ్రెస్సేజ్‌ పోటీలో భారత రేసర్లు, గుర్రాలు అద్భుతం చేశాయి. సుదీప్తి, దివ్యకృతి, హృదరు, అనుశ్‌లు వరుసగా చిన్‌స్కి, ఫిర్‌ఫోడ్‌, చెమ్‌ప్రో ఎమరాల్డ్‌, ఎట్రో గుర్రాలను రైడ్‌ చేశారు. ఈ విభాగంలో డిఫెండింగ్‌ జపాన్‌, మల్టీపుల్‌ మెడలిస్ట్‌ దక్షిణ కొరియాలు బరిలో నిలిచినా.. భారత జట్టు అదరగొట్టింది. డ్రెస్సేజ్‌ ఈవెంట్‌లో నలుగురు రైడర్లు, గుర్రాలకు ముందుగానే నిర్ణయించిన మూమెంట్స్‌ను ప్రదర్వించాలి. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్‌కు వినిపిస్తుండగా.. గుర్రం నడుస్తూ, లయబద్దంగా పరుగెడుతూ, ఒక కాలు మాత్రమే భూమిపై ఉంచి చేసే విన్యాసాలను ప్రదర్శించాలి. ఈ పోటీలను 20 (60) మీటర్ల ప్యాచ్‌ ఆఫ్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. ప్రత్యేకించి ఈ పోటీల్లో గుర్రానికి, రేసర్‌కు గొప్ప సమన్యయం అవసరం. భారత రేసర్లు, గుర్రాలు 209.205 పాయింట్లతో అగ్రస్థానంలో నిలువగా.. చైనా 204.882 పాయిం ట్లతో రెండో స్థానంలో నిలిచి సిల్వర్‌ మెడల్‌ సాధించింది. హాంగ్‌కాంగ్‌ 204.852 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. ఇక ఈక్వెస్ట్రియన్‌ డ్రెస్సేజ్‌ వ్యక్తిగత విభాగంలోనూ మనోళ్లు పతక రేసులో ఉన్నారు. ఇప్పటికే పలు రౌండ్ల పోటీలు ముగియగా.. నేడు పతక పోటీలు ఉండనున్నాయి.
నేహా ఠాకూర్‌కు సిల్వర్‌
రోయింగ్‌లో ఐదు పతకాలతో సత్తా చాటిన టీమ్‌ ఇండియా.. మంగళవారం సెయిలింగ్‌లో పతకాల వేట మొదలెట్టింది. మహిళల ఐఎల్‌సీఏ4 విభాగంలో నేహా ఠాకూర్‌ రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించింది. 17 ఏండ్ల నేహా ఠాకూర్‌..11 రేసుల్లో 27 పాయింట్లు సాధించింది. థారులాండ్‌ సెయిలర్‌ 16 పాయింట్లతో పసిడి నెగ్గగా, సింగపూర్‌ సెయిలర్‌ 28 పాయింట్లతో కాంస్యం సాధించింది. ఐఎల్‌సీఏ4 విభాగంలో ఓవరాల్‌గా 11 రేసులు ఉంటాయి. ప్రతి రేసు అనంతరం పాయింట్లు కేటాయిస్తారు. రేసులో అగ్రస్థానంలో నిలిచిన సెయిలర్‌కు ఒక పాయింట్‌, ఎనిమిదో స్థానంలో నిలిచిన సెయిలర్‌కు 8 పాయింట్లు ఇస్తారు. ఇలా 11 రేసుల అనంతరం ఎవరైతే తక్కువ పాయింట్లు సాధిస్తారో వారే విజేతలుగా నిలుస్తారు. 11 రేసులలో ఒక చెత్త రేసును గణాంకాల్లోకి తీసుకోకుండా.. ఫైనల్‌ జాబితా సిద్ధం చేస్తారు. ‘ నేను సముద్రం చూడలేదు. కానీ నా కూతురు ఈ రోజు యావత్‌ భారత దేశం గర్వపడే ప్రదర్శన చేసింది. దేశానికి సిల్వర్‌ మెడల్‌ సాధించింది’ అని నేహా ఠాకూర్‌ తల్లి సంతోషం వ్యక్తం చేసింది. సెయిలింగ్‌లోనే మరో పతకం లభించింది. ఎబాడ్‌ అలీ కాంస్య పతకం అందుకున్నాడు. మెన్స్‌ విండ్‌సర్ఫర్‌ ఆర్‌ఎస్‌:ఎక్స్‌ విభాగంలో అలీ నెట్‌ స్కోరు 52 సాధించాడు. దక్షిణ కొరియా (13), థారులాండ్‌ (29) సెయిలర్లు వరుసగా పసిడి, రజత పతకాలు దక్కించుకున్నారు.