
– సామాన్యుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న తహసీల్దార్ కార్యాలయం ఉద్యోగులు.
– దరఖాస్తులు మాయం కావడం తో గుట్టు చప్పుడు కాకుండా మళ్ళీ తీసుకుంటున్న దరఖాస్తులు…
నవతెలంగాణ -చివ్వేంల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి పథకాన్ని అధికారులు నీరు కారుస్తున్నారు.. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న చివ్వేంల మండల తహసీల్దార్ కార్యాలయం లో గృహ లక్ష్మీ పథకం దరఖాస్తులు మాయం రావడం పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మండల వ్యాప్తంగా ఆగస్టు 8 నుండి12 తారీఖు వరకు మండల వ్యాప్తంగా గృహలక్ష్మి పథకానికి 2287 దరఖాస్తులు రావడం జరిగింది.. కులాల వారిగా ఎస్సీలు 593, ఎస్టి1053, బీసీలు 529, మైనార్టీస్ 63, వికలాంగులు9,ఇతరులు 36 దరఖాస్తులు వచ్చాయని తహసీల్దార్ రంగారావు పేపర్ ప్రకటన యివ్వడం జరిగింది. గృహలక్ష్మి దరఖాస్తుల మాయం కావడంతో ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహలక్ష్మి దరఖాస్తులు తహసీల్దార్ కార్యాలయంలో మాయమవడం పట్ల దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు. దరఖాస్తులు స్వీకరించినట్లు తహసీల్దార్ కార్యాలయం లో దరఖాస్తు నమోదు రిజిస్టర్ లో పేరు ఉన్నప్పటికీ దరఖాస్తులు ఎలా మాయమవుతాయో అధికారులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని దరఖాస్తుదారులు డిమాండ్ చేస్తున్నారు . దరఖాస్తులు మాయం కావడంతో గుట్టు చప్పుడు కాకుండా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది చేసిన పొరపాటును బయటకు తెలియకుండా మళ్ళీ దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నట్లు సమాచారం. తహసీల్దార్ కార్యాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద పీట. మండలం జిల్లా కేంద్రానికి సమీపం లో ఉండడం నూతన కలెక్టరేట్ కార్యాలయం మండల పరిధిలో ఉండడం భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో అధికారులు తహసీల్దార్ కార్యాలయం లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు పెద్ద పీట వేస్తు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా రికార్డులు మారుస్తూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంగా ఉండడంతో తహసీల్దార్ కార్యాలయం లో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు రాస మర్యాదలు చేస్తూ నిమిషాలలో వారి పనులను చక్కబేడుతున్నారని కార్యాలయానికి వచ్చిన సామాన్య ప్రజలను రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిప్పు కుంటున్నారని సామాన్యులు ఎవరైనా అధికారులను సమాధానం అడిగితె కార్యాలయంలోని ఉద్యోగులు, దురుసుగా మాట్లాడడం, వారిని భయభ్రాంతులకు గురి చేస్తు పనులు చెయ్యకుండా ఇబ్బందుల పాలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులు తహసీల్దార్ కార్యాలయం పట్ల దృష్టి సారించి కార్యాలయంలో యిచ్చిన దరఖాస్తులు జాగ్రత్తగా భద్రపరిచే విధంగా చూడాలని గృహలక్ష్మి దరఖాస్తులు మాయమైన దరఖాస్తు దారులకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.