– త్వరలో నోటిఫికేషన్
– పోలీస్‌శాఖలో 15వేల ఖాళీలు భర్తీ
– యూనివర్సిటీ వీసీల నియామకం కోసం సెర్చ్ కమిటీ
– మైనార్టీలకు అన్నింటా ప్రాధాన్యత
– మనింటి అమ్మలాగే తెలంగాణ తల్లి విగ్రహం
– 12న ప్రాజెక్టులపై చర్చ
– 13న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మేడిగడ్డ సందర్శన
– కేసీఆర్ సహా ప్రతిపక్షసభ్యులూ రావాలి : అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
పలుమార్లు వాయిదా పడిన గ్రూప్-1 పరీక్షలను త్వరలో పగడ్బందీగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ పదేండ్ల నిర్లక్ష్యం వల్ల నష్టపోయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పిస్తూ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచి నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. కచ్చితంగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. తాము జిరాక్స్ సెంటర్లలో ప్రశ్నాపత్రాలు విక్రయించి ఉద్యోగాలు భర్తీ చేసే వాళ్లం కాదనీ, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకొని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్లం అంతకంటే కాదని ప్రతిపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. పోలీసు శాఖలో 15వేల ఉద్యోగ నియామకాలు చేపడతామనీ, 15 రోజుల్లో ఆ నోటిఫికేషన్ వస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వైస్‌ఛాన్సలర్ల నియామకం మే నెలలో జరుగుతుందనీ, దానికి సన్నాహకంగా ఇప్పటికే సెర్చ్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. తమ నిర్ణయాన్ని న్యాయస్థానం కూడా సమర్ధించిందన్నారు. కచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట విధానాన్ని రూపొందిస్తామని చెప్పారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన మాట్లాడారు.
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
” తెలంగాణ ఆడబిడ్డలు పౌరుషానికి ప్రతీకలు. మన ఇండ్లలో అమ్మలాగానే ప్రేమను పంచుతూ, చూపుల్లో కరుణ చూపుతూ, శత్రువులపై చురకత్తులు విసిరే రూపంతో చాకలి ఐలమ్మ లాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని భావించాం. కానీ రాచరిక పోకడలతో కిరీటాలు, వడ్డాణాలు పెట్టుకున్న వాళ్లని దొరల గడీల్లో మాత్రమే చూశాం” అని అసెంబ్లీలో
సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అందువల్లే తెలంగాణ తల్లి విగ్రహంలో సమూలు మార్పులు చేస్తున్నామన్నారు. అలాగే ప్రభుత్వ చిహ్నంలో రాచరిక పోకడలకు ప్రతీకలుగా ఉన్న కాకతీయ తోరణం, చార్మినార్ గుర్తులు ఉందొద్దని నిర్ణయం తీసుకున్నామనీ, ప్రజలందరి సూచనలు, సలహాలు స్వీకరించి దాన్ని రూపొందిస్తామని తెలిపారు. ఉద్యమ సమయంలో అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతం ప్రజల్లో ఉత్తేజాన్ని నింపిందనీ, అందువల్లే దాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించామని చెప్పారు. మైనార్టీలకు ప్రభుత్వంలో, చట్టసభల్లో కీలక స్థానాల్లో నియమిస్తున్నామంటూ ముఖ్యమంత్రి కార్యాలయం సహా పలు శాఖల్లో నియమితులైన పలువురు అధికారులు వివరాలను వెల్లడించారు. ప్రజావాణిలో ధరణి, హౌసింగ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయనీ, ఐఏఎస్ అధికారులు అక్కడ దరఖాస్తులు స్వీకరిస్తున్నారనీ, మంత్రులు కూడా ప్రజల్ని కలిసి సమస్యలు తెలుసుకుంటున్నారని వివరించారు. తెలంగాణ అనేది ప్రజల భావోద్వేగమనీ, రాష్ట్రం సిద్ధించిన తొమ్మిదిన్నరేండ్ల తర్వాత విధ్వంసమైన స్వరాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాల్సి వస్తున్నదని అన్నారు.
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష నేత రాకపోవడం విచారకరమనీ, 80 వేల పుస్తకాలు చదివిన మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చి తన జ్ఞానాన్ని సలహాలు, సూచనల రూపంలో ఇస్తారని అశించామన్నారు. ఆయన రాకపోవడం శాసనసభను అవమానిండమేననీ, గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిచేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక వాహనాలకు ‘టీజీ’ అనే ఆంగ్ల అక్షరాలు ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబితే, తమపార్టీ అక్షరాలు కనిపించేలా ‘టీఎస్’ అని పెట్టి నిబంధనలు ఉల్లంఘించారని తెలిపారు. ప్రగతిభవన్, వాస్తుకోసం నూతన సచివాలయంను ఆగమేఘాల మీద నిర్మించుకున్నారనీ, తొమ్మిదిన్నరేండ్ల పాలనలో వరంగల్ కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని మాత్రం ఎందుకు పూర్తిచేయలేకపోయారని ప్రశ్నించారు. ప్రజాగాయకుడు గద్దర్‌ను ప్రగతి భవన్ గేటు బయట రోజంతా ఎండలో నిలబెట్టారని మండిపడ్డారు. ఆయన మరణిస్తే చివరిచూపు చూసేందుకు రాజసౌధం నుంచి కేసీఆర్ బయటకు రాలేదని నిష్ఠూరమాడారు. ప్రజల ఆస్తితో కట్టిన ప్రగతి భవన్‌లోకి ప్రజలను రానివ్వలేదనీ, ఉద్యమకారుల్ని చిన్నచూపు చూశారనీ, ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను కనీసం రెవెన్యూ గ్రామంగా కూడా చేయలేదనీ, తాము అధికారంలోకి వచ్చిన రోజు ఆ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా మారుస్తూ జీవోలు ఇచ్చామని వివరించారు. మరో ప్రజాకవి గూడ అంజయ్య చివరికోరికగా అప్పటి సీఎం కేసీఆర్‌ను చూడాలని కోరుకుంటే, ఆయన చనిపోయాక నివాళులు అర్పించేందుకు కూడా మనసురాలేదని విమర్శించారు. నియోజకవర్గ సమస్యలపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా తనను కలిసేందుకు వస్తే, వారిని అనుమానించి అవమానిస్తున్నారనీ, ప్రెస్ మీట్లు పెట్టి వారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. తన వద్దకు వచ్చే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్ని బీఆర్‌ఎస్ అధిష్టానం అనుమానించాల్సిన అవసరం లేదనీ, ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఎవరు వచ్చినా తాము ఆహ్వానిస్తామని చెప్పారు. రూ.97,500 కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 90వేల ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్నది వాస్తవమనీ, కృష్ణా ప్రాజెక్టులను తాము కేంద్రానికి అప్పగించలేదనీ, దీనిపై ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో కేంద్రమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో అభ్యంతరం చెప్పకుండా, ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ హక్కులను కాపాడేందుకు తాము కొట్లాడుతుంటే కాళ్ల మధ్య కట్టెలు పెడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ ధర్నాలు చేయాల్సింది నల్లగొండలో కాదనీ, ప్రాజెక్టులు గుంజుకుంటానన్న ప్రధాని నరేంద్రమోడీ ఉండే ఢిల్లీ జంతర్‌మంతర్‌లో చేయాలని సూచించారు. ఈ విషయంలో కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ అక్కడ ఆమరణ దీక్షలు చేస్తే, పోలీసులు దౌర్జన్యంగా వారిని తరలించకుండా తాము కాపలా ఉంటామనీ, ప్రాణాలు పోవుడో, ప్రాజెక్టులు వచ్చుడో అక్కడే తేల్చుకుందామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై ఈనెల 12న అసెంబ్లీలో పూర్తిస్థాయి చర్చ ఉంటుందనీ, అది పూర్తయ్యాక 13వ తేదీ 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలను ప్రభుత్వ ఖర్చుతో మేడిగడ్డకు తీసుకెళ్తామని చెప్పారు. చర్చకు, పర్యటనకు ప్రతిపక్షనేత కేసీఆర్ తప్పకుండా రావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కేసీఆర్ ఇంటికి పిలిచి పులుసు తినిపిస్తే, దాన్ని అలుసుగా తీసుకొని సరిగ్గా పోలింగ్ రోజు ఆయన నాగార్జునసాగర్‌ను ఏకే 47 తుపాకులతో ఆక్రమించుకుంటుంటే అప్పటి సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరెత్తినప్పుడల్లా కృష్ణా జలాలు ముందుకు తెస్తున్నారనీ, ఈ డ్రామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏపీ సీఎంతో రాసుకు పూసుకు తిరిగి, పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఎందుకు చోద్యం చూశారని అడిగారు. ఇంద్రవెల్లి పోరాట యోధులకు నివాళిగా స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామనీ, అమరుల కుటుంబాలను వెతికి వారికి సొంతిండ్లు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. ప్రతిపక్షం ప్రజల కోసం పనిచేయాలనీ, కుయుక్తులు పన్నితే ఈ సారి అక్కడ కూడా ఉండకుండా నాంపల్లి దర్గా దగ్గర కూర్చోవాల్సి వస్తుందని వ్యంగ్యంగా అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమనీ, కేటీఆర్‌ను సీఎం చేయాలని తనని కేసీఆర్ అడిగారని తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారనీ, మీ పార్టీ అంతర్గత విషయాలకు కూడా మోదీని అనుమతి అడిగారంటే అర్థం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ప్రసంగానికి బీఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి, తన్నీరు హరీశ్‌రావు పలుమార్లు అడ్డుతగిలారు. ఈ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం జరిగింది.