గ్రూప్స్‌-1 దరఖాస్తు గడువు రేపటి వరకు పొడిగింపు…

గ్రూప్స్‌-1 దరఖాస్తు గడువు రేపటి వరకు పొడిగింపు...– సాంకేతిక సమస్యలతో అభ్యర్థులకు ఇబ్బందులు : టీఎస్‌పీఎస్సీ నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌-1కు దరఖాస్తు గడువును మరో రెండు రోజులపాటు (శనివారం వరకు) రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. షెడ్యూల్‌ ప్రకారం బుధవారం సాయంత్రం ఐదు గంటలతో గ్రూప్‌-1 దరఖాస్తుల సమర్పణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే చివరి రోజు కావడంతో గ్రూప్‌-1 పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసేందుకు వెబ్‌సైట్‌లో అభ్యర్థులకు సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సమర్పణ ప్రక్రియ చేపట్టేందుకు వీలు కాకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ఈ సమాచారాన్ని టీఎస్‌పీఎస్సీ అధికారుల దృష్టికి అభ్యర్థులు తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన తర్వాత శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తుల సమర్పణ గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ ప్రకటించారు. ఆ తర్వాత పొడిగించబోమని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సకాలంలో దరఖాస్తు చేయాలని కోరారు. 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతనెల 19న గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన విషయం తెలిసిందే. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి 2022, ఏప్రిల్‌ 26న ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. అయితే పాత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందేననీ, అయితే ఫీజు మాత్రం మినహాయింపునిస్తున్నట్టు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షను జూన్‌ తొమ్మిదిన, మెయిన్స్‌ రాతపరీక్షను అక్టోబర్‌ 21న నిర్వహించనుంది. బుధవారం నాటికి గ్రూప్‌-1కు 2.7 లక్షల దరఖాస్తులొచ్చాయి.