– టీఎస్పీఎస్సీ చైర్మెన్‌ను తొలగించాలి : డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగి నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని వారిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డీవైఎఫ్‌ఐ) హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని అశోక జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి మాట్లాడుతూ.. ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ బోర్డు నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, పరీక్ష నిర్వహించే శక్తి లేనివారిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన అభ్యర్థులకు రూ.1 లక్ష చొప్పున పరిహారం అందించాలని కోరారు. ఒకసారి పేపర్ లీకేజీతో మరోసారి పరీక్ష రాయాల్సిన పరిస్థితి దాపురించిందని, అయినా ఆ పరీక్షలోనూ 2,33,248 అభ్యర్ధులకు గాను అదనంగా 254 ఓఎంఆర్ షీట్స్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణ పట్ల, నిబంధనలు పాటించకపోవడం వల్లే హైకోర్టు పరీక్షను రద్దు చేసిందన్నారు. ప్రతి పరీక్ష హాల్ టికెట్ బయోమెట్రిక్ విధానాన్ని పాటించినప్పుడు, ఇలాంటి లోపాలు ఎందుకు జరిగాయని, మొదటిసారి పేపర్ లీకేజ్ అయినా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. పదేండ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను అనేక అవకతవకలతో పదేపదే నిర్వహించడం వల్ల చాలామంది నిరుద్యోగులు సమయం, డబ్బులు వృధా అయ్యాయని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీని వెంటనే ప్రక్షాళన చేయాలని, ప్రస్తుతం కేసులో ఉన్న వారిని తొలగించాలని తెలిపారు. పరీక్ష రద్దుకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్, సహాయ కార్యదర్శి ఓర్సు చిరంజీవి, జిల్లా కమిటీ సభ్యులు శివరాత్రి కరుణాకర్, సముద్రాల అనిల్, మాదాసి రాజు, అనంతగిరి దేవేందర్, లింగాల ప్రణరు, నోముల అరవింద్ తదితరులు పాల్గొన్నారు.