గ్రూప్‌-1 మళ్లీ రద్దు

Group-1 re-cancellation– తిరిగి నిర్వహించాలన్న హైకోర్టు
– ఆందోళనలో 2.33 లక్షల మంది అభ్యర్థులు
ప్రశ్నాపత్రం లీకేజీ కారణంగా గతేడాది అక్టోబర్‌ 16న నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. రెండుసార్లు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు కావడంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు తీర్పుతో ముచ్చటగా మూడోసారి పరీక్షను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ వైఫల్యాలపై ప్రతిపక్షాలు, విద్యార్థి యువజన సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ మళ్లీ రద్దయ్యింది. ఆ పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ నియామక సంస్థ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. ఈ ఏడాది జూన్‌ 11న గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీ కోసం జూన్‌ 11న నిర్వహించిన ప్రిలిమ్స్‌ పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా, 2,33,506 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే పరీక్షలో బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోలేదనీ, హాల్‌ టికెట్‌ నెంబర్‌ లేకుండానే ఓఎంఆర్‌ పత్రం ఇచ్చారని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.పరీక్షను రద్దు చేయాలని కోర్టును కోరారు. 2,33,248 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యారని జూన్‌ 12న టీఎస్‌పీఎస్సీ వెల్లడించిందని అభ్యర్థులు కోర్టుకు వివరించారు. అయితే 2,33,506 మంది పరీక్ష రాశారంటూ జూన్‌ 28న వెబ్‌నోట్‌లో ప్రకటించిందని పేర్కొన్నారు. అభ్యర్థుల పిటిషన్లను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దుచేస్తూ శనివారం తీర్పు వెలువరించింది. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నియామక సంస్థను ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పుపై టీఎస్‌పీఎస్సీ సమాలోచన చేస్తున్నది. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నది. ఆ తీర్పును సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌కు వెళ్లనున్నట్టు తెలిసింది. దిగజారుతున్న టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట ఒకవైపు ప్రశ్నాపత్రాల లీకేజీ, ఇంకోవైపు పరీక్షల రద్దుతో టీఎస్‌పీఎస్సీ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారుతున్నది. దీంతో పరీక్షల నిర్వహణ ప్రక్రియ సమర్థవంతంగా చేయకపోవడం వల్ల నిరుద్యోగుల విశ్వాసాన్ని కోల్పోతున్నది. ఇంకోవైపు నియామకాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన టీఎస్‌పీఎస్సీ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. అందుకే టీఎస్‌పీఎస్సీ పనితీరును రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజీ వాస్తవమే అయినా, టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ జనార్ధన్‌రెడ్డి బహిరంగంగా అంగీకరించినా రాష్ట్ర ప్రభుత్వం అందుకనుగుణంగా తగు చర్యలు తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ పీఏ ప్రవీణ్‌ లీకేజీకి ప్రధాన సూత్రధారిగా ఉన్న విషయం తెలిసిందే. ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నది. అరెస్టుల పర్వం ఆగడం లేదు. అయినప్పటికీ టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, కార్యదర్శి, పాలక మండలి సభ్యులు ఇలా ఎవరిపైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. దీంతో రాజకీయ పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు, నిరుద్యోగులు ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.
అటకెక్కిన 80,039 కొలువుల భర్తీ
రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా గతేడాది మార్చిలో ప్రకటించారు. అందులో ఒక్క పోస్టునూ భర్తీ చేయలేదంటే అతిశయోక్తి కాదు. దీన్ని బట్టి రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతున్నది. ఆ పోస్టుల్లో ఇప్పటి వరకు సుమారు 40 వేల కొలువుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. అవి వివిధ దశల్లో ఉన్నాయి. రాతపరీక్షలను సమర్థవంతంగా నిర్వహించి మెరిట్‌ జాబితా ప్రకటించి ఉద్యోగాలు మాత్రం ఇంకా ఇవ్వకపోవడం గమనార్హం. అంటే 80,039 పోస్టుల భర్తీ ప్రక్రియ అటకెక్కినట్టేనని తెలుస్తున్నది. దీంతో ప్రభుత్వ తీరు పట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సభ్యులను తొలగించాలి : సీపీఐ
టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సభ్యులను వెంటనే తొలగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీఎస్‌పీఎస్సీలో నమోదైన వారందరికీ అక్టోబర్‌ నుంచి రూ.3,016 నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. టీఎస్‌పీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అసమర్థత కారణంగానే రెండోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దయ్యిందని విమర్శించారు. యువజన, విద్యార్థి సంఘాలు, విద్యావేత్తలు, రాజకీయ పార్టీలతో అఖిలపక్షం నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.
టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి : విద్యార్థి, యువజన సంఘాలు
గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దులో ప్రభుత్వ, టీఎస్‌పీఎస్సీ నిర్లక్ష్యాన్ని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, పీడీఎస్‌యూ, పీవైఎల్‌ విమర్శించాయి. నిరుద్యోగులకు రూ.లక్ష నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్‌ మూర్తి, కోట రమేష్‌, కసిరెడ్డి మణికంఠరెడ్డి, వలీ ఉల్లా ఖాద్రీ, పెద్దింటి రామకృష్ణ, కె కాశీనాథ్‌, టి నాగరాజు, ఆనగంటి వెంకటేశ్‌, పుట్ట లక్ష్మణ్‌, కె ధర్మేంద్ర, నామాల ఆజాద్‌, కెఎస్‌ ప్రదీప్‌ వేర్వేరుగా ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. గ్రూప్‌-1 అభ్యర్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడిందని తెలిపారు. టీఎస్‌పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్‌ చేశారు. చైర్మెన్‌ జనార్ధన్‌రెడ్డిని బర్తరఫ్‌ చేయాలని కోరారు. నియామకాల ప్రక్రి యను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
గ్రూప్‌-1 వివరాలు
నోటిఫికేషన్‌ విడుదల : 2022, అక్టోబర్‌ 26
మొత్తం పోస్టులు : 503
దరఖాస్తు చేసిన అభ్యర్థులు : 3,80,081
రాతపరీక్షల వివరాలు
పరీక్ష తేదీ అభ్యర్థుల హాజరు
2022, అక్టోబర్‌ 16 2,85,916
2023, జూన్‌ 11 2,33,506
హైకోర్టు తీర్పు బీఆర్‌ఎస్‌ సర్కారుకు చెంపపెట్టు
– ఇప్పటికైనా తీరు మార్చుకోండి
– సీఎం కేసీఆర్‌కు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ
గ్రూప్‌-1 (ప్రిలిమినరీ) పరీక్షను మరోసారి నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్‌ఎస్‌ సర్కారుకు చెంపపెట్టు అని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటి కైనా తీరు మార్చుకోవాలంటూ సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈమేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు ఆయన ఫలితంగానే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయమైన, దుర్మార్గమైన పాలనకు విద్యార్ధులు, నిరుద్యోగుల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి యూనివర్సిటీ విద్యార్ధులు, యువత తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా నిలిచారనీ, ఆ ఉద్యమం చల్లారకుండా సజీవంగా ఉండేలా చేశారని పేర్కొన్నారు. 2014 తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్ధులకు అడుగడునా పరాభవం ఎదురవుతూనే ఉందని తెలిపారు. ఇంటర్‌ పేపర్ల ముల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. 2015లో సింగరేణి మొదలు…ఎంసెట్‌ పేపర్‌ లీకేజీ, విద్యుత్‌ సంస్థ నియామక పరీక్ష పేపర్‌ లీక్‌, పదోవ తరగతి పేపర్‌ లీక్‌, అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీతో మీ మోసం పరాకాష్టకు చేరిందని వివరించారు. యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన మీరు గడిచిన తొమ్మిదేండ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు దిద్దుకుని గత అనుభవం నుంచి ఈ సారైనా పడక్బందీగా పరీక్ష నిర్వహిస్తారనుకుంటే…మీ వక్రబుద్ధితో పరీక్ష నిర్వహణలో డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. ఈనేపథ్యంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కారుకు చెంపపెట్టులాంటిందని పేర్కొన్నారు. గ్రూప్‌-1 పరీక్ష నిర్వహణలో మీ ప్రభుత్వం విఫలం చెందినట్టు కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైందని తెలిపారు. తెలంగాణలో న్యాయంగా ఉద్యోగ నియామకాలు జరగాలంటే, కేసీఆర్‌ సర్కారును రద్దు చేసి కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమని ప్రజలకు పిలుపునిచ్చారు.
టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం : సీపీఐ(ఎం)
గ్రూపు-1 ప్రిలిమ్స్‌ రద్దుకు టీఎస్‌పీఎస్సీ, ప్రభు త్వ నిర్లక్ష్యమే ప్రధాన కార ణమనీ, తక్షణమే సమర్ధ వంతమైన బోర్డును ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్‌ చేశారు. గ్రూపు-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో జరిగిన నష్టానికి టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ కేటగిరీ పరీక్ష పేపర్లు లీక్‌ కావడం, దీనిలో సిబ్బంది పాత్ర ఉండటంతో టీఎస్‌పీఎస్సీ అప్రతిష్ట మూటగట్టుకుందని విమర్శించారు. ఇది జరిగిన టీఎస్‌పీఎస్సీ, ప్రభుత్వ నిర్లక్ష్యమే తర్వాతైనా టీఎస్‌పీఎస్సీపై రాష్ట్ర ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదని తెలిపారు. నిర్వహణా లోపాలు కొనసాగడంతో హైకోర్టు ఈ తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. లక్షల మంది అభ్యర్థులు సమయంతోపాటు, ఆర్థికంగా కూడా చాలా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బోర్డును సరిదిద్దే ప్రయత్నం చేయకుండా, సమర్థించే ధోరణి కూడా ఇందుకు దోహదపడిందని తెలిపారు. వరుస ఘటనలతో ప్రస్తుత బోర్డు పరీక్షల నిర్వహణ సమర్ధవంతంగా నిర్వహించలేదని తేలిపోయిందని పేర్కొన్నారు. తక్షణమే దీని స్థానంలో సమర్ధవంతమైన బోర్డును ఏర్పాటు చేసి నిరుద్యోగులు, యువత విశ్వాసం పొందేవిధంగా, పారదర్శకంగా బోర్డు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు.