– జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు
నవతెలంగాణ-సంగారెడ్డి
జూన్ 9న గ్రూప్- 1 ప్రిలిమినరీ పరీక్షను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకనుగుణంగా చాలా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు . ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మొదటి సారిగా బయో మెట్రిక్ పద్దతిన పరిక్ష నిర్వహిస్తున్నరని అన్నారు. మొత్తం సెంటర్లు 16 సెంటర్లలో, 9672 మంది గ్రూప్-1 పరీక్షలకు హాజరవుతున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, మాల్ ప్రాక్టీస్ నిరోధానికి మొబైల్ టీములు ఏర్పాటుచేస్తున్నామన్నారు . పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఓఎంఆర్ షీట్స్ కలెక్ట్ చేసేటప్పుడు 100 శాతం బయోమెట్రిక్ హాజరుతో సరిపోవాలని సూచించారు . ప్రతి పరీక్ష హాలులో 360 డిగ్రీల వెబ్ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. టాయిలెట్స్, త్రాగునీరు, ఫాన్స్, లైట్స్, మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ క్షుణ్ణంగా పరిశీలించాలని ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా అధికారులు చూసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. ఎగ్జామ్ క్యాంపస్ లోకి చీఫ్ సూపరింటెండెంట్ కు తప్ప ఎవరికి సెల్ ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతించవద్దని తెలిపారు. డిపార్ట్మెంటల్ అధికారులు పరీక్ష రోజున ఉదయం 8.00 గంటలకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ప్రతి సెంటర్‌లో ఉదయం 10 గంటలకు గేట్లు బంద్ చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా అభ్యర్థులకు ప్రత్యేకంగా తనిఖీ చేయడానికి మహిళా సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రం నుండి ఎవరు కూడా బయటకు వెళ్లడానికి వీలు లేదన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి రూంలో 24మంది అభ్యర్థులు సీటింగ్ ఏర్పాటు చేయాలని , ఒక్కొక్క అభ్యర్థికి ఒక మీటరు దూరం పాటించేలా చూడాలని అన్నారు . పరీక్షకు హాజరయ్యే వికలాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లో పరీక్షా రాయడానికి ఏర్పాటు చేయాలన్నారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ , డి ఆర్ ఓ పద్మజారాణి, రీజినల్ కోఆర్డినేటర్లు డిపార్ట్మెంటల్ అధికారులు, ఫ్లైయింగ్ స్క్వాడ్, సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.