గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రాథమిక కీ విడుదల

– జులై 5 వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ
– టీఎస్‌పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) విడుదల చేసింది. అభ్యర్థుల ఓఎంఆర్‌ రెస్పాన్స్‌ షీట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వాటితోపాటు గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష మాస్టర్‌ ప్రశ్నాపత్రాలను అందుబాటులో ఉంచింది. 503 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్‌ 26న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 11న రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించామని తెలిపారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు హాజరైన 2,33,506 (ప్రాథమిక వివరాల ప్రకారం 2,33,248 హాజరు) మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను స్కాన్‌ చేశామని వివరించారు. ప్రాథమిక కీకి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను వచ్చేనెల ఒకటి నుంచి ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఇంగ్లీష్‌లోనే సమర్పించాలని సూచించారు. వాటికి సంబంధించిన ఆధారాలను జతపరచాలని కోరారు. ఈమెయిల్‌ లేదా నేరుగా అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఓఎంఆర్‌ షీట్లు వచ్చేనెల 27వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశముంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ప్రాథమిక కీ, ఓఎంఆర్‌ షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అయితే గతేడాది అక్టోబర్‌ 16న గ్రూప్‌-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు 2,85,916 మంది అభ్యర్థులు హాజరైన విషయం తెలిసిందే. అందులో 25,150 మంది అభ్యర్థులను గ్రూప్‌-1 మెయిన్స్‌ రాతపరీక్షలకు కూడా అర్హత సాధించినట్టు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. అయితే ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసింది. దీంతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి ఈనెల 11న నిర్వహించింది.