గ్రూప్‌-2 నిర్వహణపై సందిగ్ధం

On management of Group-2 dilemma– జనవరి 6,7 తేదీల్లో రాతపరీక్షలు
– ఏర్పాట్లు చేయని టీఎస్‌పీఎస్సీ
– చైర్మెన్‌ సహా సభ్యుల రాజీనామా
– ఆందోళనలో అభ్యర్థులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వచ్చేనెల ఆరు, ఏడు తేదీల్లో గ్రూప్‌-2 రాతపరీక్షల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. ఇంకా కొన్ని రోజులే ఉన్నా రాతపరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చేయడం లేదు. ఇంకోవైపు గ్రూప్‌-2 రాతపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష నిర్వహిస్తారా? లేక వాయిదా వేస్తారా? అన్నది ప్రకటించాలని వారు కోరుతున్నారు. ఈనెల 11న టీఎస్‌పీఎస్సీ సమీక్షా  సమావేశం సమయంలోనే రాతపరీక్షలను రీషెడ్యూల్‌ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ఇంత వరకు గ్రూప్‌-2 వాయిదాకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్‌ 29న గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29,30 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేసింది. నవంబర్‌ రెండు, మూడు తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల మరోసారి గ్రూప్‌-2 రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీ, రాతపరీక్షలు వాయిదా పడడం వంటి ఘటనలతో టీఎస్‌పీఎస్సీ అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ పదవికి బి జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేశారు. అదే బాటలో సభ్యులు కూడా రాజీనామాలను సమర్పించారు. అయితే జనార్ధన్‌రెడ్డి రాజీనామాను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదించకపోవడం గమనార్హం. ప్రస్తుతం టీఎస్‌పీఎస్సీకి పాలకమండలి లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలి నియామకంపై కసరత్తు ప్రారంభించినట్టు తెలిసింది. నిరుద్యోగుల ఆకాంక్షలను నెరవేర్చడం, పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేయడం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. జాబ్‌ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకే టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌, సభ్యుల నియామకానికి సంబంధించి నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని భావిస్తోంది. ఆచితూచి అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీకి కొత్త పాలకమండలి వచ్చిన తర్వాతే రాతపరీక్షలను నిర్వహించే అవకాశమున్నది. త్వరలోనే గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3 రాతపరీక్షలకు సంబంధించి రీషెడ్యూల్‌ చేసి కొత్త తేదీలను ప్రకటించనుంది.