– త్వరలో రాతపరీక్షల తేదీల ప్రకటన : టీఎస్‌పీఎస్సీ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వచ్చేనెల ఆరు, ఏడు తేదీల్లో నిర్వహించతలపెట్టిన గ్రూప్-2 రాతపరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్-2 రాతపరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 18 శాఖల్లో 783 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 29న గ్రూప్-2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29,30 తేదీల్లో రాతపరీక్షలను నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మొదటిసారి వాయిదా వేసింది. గ్రూప్-2 రాతపరీక్షలను నవంబర్ రెండు, మూడు తేదీల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమల్లోకి రావడం వల్ల మరోసారి గ్రూప్-2 రాతపరీక్షలు వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారడం, టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యులు రాజీనామా చేయడం వంటి కారణాలతో గ్రూప్-2 రాతపరీక్షలు ముచ్చటగా మూడోసారి వాయిదా పడ్డాయి. దీంతో నిరుద్యోగుల్లో ఉన్న ఆందోళనలకు తెరపడింది.