జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం సమావేశం

– వందకు పైగా వస్తువుల మీద పన్నురేటు సర్దుబాటుపై చర్చ
– తదుపరి మీటింగ్‌ వచ్చేనెల 20న
న్యూఢిల్లీ: జీఎస్టీ రేటు హేతబద్దీకరణపై ఆరుగురు మంత్రుల బృందం (జీఓఎం) సమావేశమైంది. వందకు పైగా వస్తువుల మీద పన్ను రేటు సర్దుబాటుపై చర్చించింది. కొన్ని వస్తువులపై 12 నుంచి ఐదు శాతానికి పన్నులు తగ్గించటం కూడా ఇందులో చర్చకు వచ్చింది. బుధవారం జరిగిన సమావేశపు విషయాన్ని పశ్చిమ బెంగాల్‌ ఆర్థిక మంత్రి చంద్రిమ భట్టాచార్య వెల్లడించారు. జీఓఎం తదుపరి సమావేశం అక్టోబర్‌ 20న ఉంటుందని తెలిపారు. సైకిళ్లు, వాటర్‌ బాటిళ్ల మీద పన్నుల హేతుబద్దీకరణపై ఈ సమావేశంలో చర్చకు వస్తుందని వివరించారు. 12 శాతం పన్ను స్లాబ్‌లో మెడికల్‌, ఫార్మా సంబంధిత ఐటెమ్స్‌పై పన్ను రేటు తగ్గింపు అంశాన్ని కూడా జీఓఎం చేపట్టింది. వచ్చే నెల సమావేశంలో దీనిపై చర్చించాలని నిర్ణయించింది. బేవరేజెస్‌ వంటి కొన్ని వస్తువులపై ప్రస్తుతం ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి పన్ను రేట్లను పెంచే అవకాశం పైనా మంత్రుల బృందం చర్చించింది. ప్రస్తుతం జీఎస్టీ 5, 12, 18, 28 శాతం స్లాబులతో ఫోర్‌-టైర్‌ ట్యాక్స్‌ నిర్మాణాన్ని కలిగి ఉన్నది. జీఎస్టీ చట్టం ప్రకారం వస్తువులు, సేవలపై 40 శాతం వరకు పన్ను విధించొచ్చు. వచ్చేనెల 20న జరిగే సమావేశంలో జీఓం తన సభ్యుల అభిప్రాయాలపై చర్చించనున్నది. అలాగే, తమ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్‌ ముందు ఉంచనున్నది. జీఎస్టీ కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థికమంత్రి నేతృత్వం వహిస్తారు. ఇందులో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మంత్రులు ఉంటారు. ప్రస్తుత ఆరుగురు సభ్యుల జీఓఎంలో కూడా యూపీ ఆర్థిక మంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా, రాజస్థాన్‌ ఆరోగ్య సేవల మంత్రి గజేంద్రసింగ్‌, కర్నాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడ, కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్‌ బాలగోపాల్‌లు ఉన్నారు.