దేశంలో పెరుగుతున్న నిరంకుశత్వం

దేశంలో పెరుగుతున్న నిరంకుశత్వం– ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ సమాఖ్య నిర్మాణానికి దెబ్బ
– ప్రజాస్వామ్యం సదస్సులో వక్తలు
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ దేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బ తీస్తుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. రెండ్రోజులపాటు ఢిల్లీలోని ఇండియా హాబిటాట్‌ సెంటర్‌లో ‘ప్రజాస్వామ్యం’ అంశంపై జాతీయ సదస్సు జరిగింది. దీనికి పలువురు రాజకీయ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, పౌర సమాజ సమూహాల సభ్యులు, మానవ హక్కుల పరిరక్షకులు, మాజీ సివిల్‌ సర్వెంట్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు. సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, కాంగ్రెస్‌ నేత సల్మాన్‌ ఖుర్షిద్‌, కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా, ఎండి యూసుఫ్‌, ప్రొఫెసర్‌ రోమిలా థాపర్‌, ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌, ప్రొఫెసర్‌ జయతి ఘోష్‌, రాధా కుమార్‌, ప్రొఫెసర్‌ ఎమెరిటా, ప్రొఫెసర్‌ జోయా హసన్‌, ప్రొఫెసర్‌ హసన్‌, ప్రొఫెసర్‌ బల్వీర్‌ అరోరా, ప్రొఫెసర్‌ విధు వర్మ, ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ మాజీ డైరెక్టర్‌ పులిన్‌ నాయక్‌, మాజీ ఐఎఎస్‌ అమితాభా పాండే తదితరులు మాట్లాడారు. దేశంలో నిరంకుశత్వం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యం బిల్లులను సమీక్షించాలనీ, కేవలం అనుమానంతో అరెస్టు చేయడానికి, శాంతియుత నిరసనలకు ఉగ్రవాద నిర్వచనాన్ని విస్తరించడానికి అనుమతిస్తుందని పేర్కొన్నారు. యూఏపీిఎ, జమ్మూ కాశ్మీర్‌ పీఎస్‌ఏ వంటి క్రూరమైన చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అంతర్గత ఘర్షణల్లో సాయుధ బలగాలను మోహరించడం మానుకోవాలని హితవు పలికారు. వ్యవసాయానికి కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇచ్చి, స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని కోరారు. ఒకేదేశం-ఒకే ఎన్నిక వంటి చర్యలు భారతదేశ సమాఖ్య నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయనీ, రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రులతో సంప్రదించే గవర్నర్లను నియమించాలని చెప్పారు. ఈ సందర్భంగా పలు చట్టాలు, రాజకీయ, సామాజిక అంశాలపై వక్తలు విస్త్రుతంగా మాట్లాడారు. అనంతరం పలు తీర్మానాలను సదస్సు ఆమోదించింది.