పెంచిన ప్రేమ

రామాపురంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక గొర్రె, నాలుగు గొర్రె పిల్లలు ఉండేవి. పగలంతా వ్యవసాయం పనులు చూసుకుని సాయంత్రం వాటిని మేతకు తీసుకుని వెళ్లేవాడు. రంగయ్యకు సంతానం లేనందున వాటినే కన్న బిడ్డల్లా చూసుకునే వాడు. ఒక రోజు యధావిధిగా పొలం పనులు చూసుకుని సాయంత్రం గొర్రెలను తీసుకుని మేతకు బయలుదేరి వెళ్ళాడు. మార్గం మధ్యలో పెద్ద గొర్రె దారితప్పి పోయింది. రంగయ్య చుట్టుపక్కల వెతికినా కనుచూపు మేరలో కనిపించకపోవడంతో దిగులుగా మిగతా నాలుగు గొర్రె పిల్లలను తీసుకుని ఇంటి దారి పట్టాడు. దారి తప్పిన గొర్రెకు ఒక మేక కనిపించింది. తన యజమాని ఇల్లు చూపమని మేకను అడిగింది. అందుకు మేక ”ఎలాగోలా దారి తప్పావు. ఇంటికి వెళితే మీ యజమాని నిన్ను కసాయి వాడికి అమ్మి సొమ్ము చేసుకుంటాడు. కనుక నువ్వు కూడా నాలా స్వేచ్ఛగా బతుకు” అని సలహా ఇచ్చింది. నిజమే కదా అని గొర్రె ఆలోచనలో పడి ఒంటరిగా నడుచుకుంటూ వెళుతుంటే ఓ కసాయి వాడి కంట పడింది. ఇంకేముంది ఆ కసాయివాడు తన పంట పండిందని గొర్రెను పట్టుకుని తన ఇంటికి తీసికెళ్ళి పెరట్లో గుంజకు కట్టేశాడు. కసాయి వాడు తన భార్యతో ”రత్తాలు! ఈ రోజు నువ్వు ఎదురొచ్చిన వేళావిశేషమేమోగాని మంచి గొర్రె దొరికింది. రాత్రికి బాగా మేత పెట్టు రేపు ఆదివారం కోసి అమ్ముకుందాం” అని ఆనందంగా అన్నాడు. ఆ మాటలు విన్న గొర్రె భయపడింది. ‘తన యజమాని తనను, తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. కనీసం తన యజమానికి ఉపయోగపడి ఉంటే పెంచిన ఋణం తీర్చుకుని ఉండొచ్చు. కాని ఈ కసాయివాడికి తను దక్కాలా’ అని ఆలోచలో పడింది. ఎలాగోలా తప్పించుకుని తన యజమాని దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అర్థరాత్రి దాటాక అటుగా వెళుతున్న ఎలుకను పిలిచి తన కట్లు విప్పి సహాయం చేయమని ప్రాధేయ పడింది. గొర్రె కథ విన్న ఎలుక తన పళ్ళతో కట్లు కొరికి గొర్రెను అక్కడినుండి తప్పించి సహాయం చేసింది. వెంటనే గొర్రె, ఎలుకకు కతజ్ఞతలు తెలిపి అక్కడినుండి పరుగున తన యజమాని ఇంటి బయట నిలిచింది. కిటికీలోంచి దిగాలుగా కూర్చుని ఉన్న యజమానిని చూసింది. రంగయ్య తన భార్యతో ”మనకు పిల్లలు లేరని ఎంతో ప్రేమగా గొర్రెను పెంచుకున్నాం. మనం బతికినంత కాలం కన్న బిడ్డగా చూసుకుందామని అనుకున్నాం. ఇప్పుడు తప్పిపోయి ఎక్కడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఏమో? తెల్లవారినుండి గొర్రె పిల్లలు కూడా మేత ముట్టలేదు” అని బాధ పడుతూ అనడంతో ఆ మాటలు విన్న గొర్రె యజమానికి తనమీద ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేక ఆ మేక చెప్పుడు మాటలు విని, యజమానిని బాధ పెట్టానని పశ్చాతాపంతో కన్నీళ్ళు పెట్టుకుంది. ఎప్పటికి తన యజమానిని వదిలి వెళ్లకూడదని నిశ్చయించుకుని తన పిల్లలతో హాయిగా కాలం గడిపింది.
– నీతి-చెప్పుడు మాటలు వినరాదు
– కయ్యూరు బాలసుబ్రమణ్యం, 9441791239