వృద్థి 6.3 శాతమే..! : మోర్గాన్‌ స్టాన్లే

వృద్థి 6.3 శాతమే..! : మోర్గాన్‌ స్టాన్లేన్యూఢిల్లీ : భారత జీడీపీ అంచనాలకు గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లే కోత పెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో దేశ వృద్థి 6.3 శాతానికే పరిమితం కావొచ్చని 2025 ఇండియా ఎనామిక్‌ అవుట్‌లుక్‌ రిపోర్ట్‌లో వెల్లడించింది. 2024-25లో భారత జీడీపీ 6.7 శాతానికి పరిమితం కావొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం 7 శాతంగా అంచనా వేసింది. ద్వితీయార్థంలో 6.7-6.8 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చని పేర్కొంది. వచ్చే 2026-27లోనూ భారత జీడీపీ 6.5 శాతంగా ఉండొచ్చని మోర్గాన్‌ స్టాన్లే గ్రూప్‌ రీసెర్చ్‌ ఇండియా చీఫ్‌ ఎకనామిస్ట్‌ ఉపాసన చచ్ర పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ వ్యయాలు, వ్యవసాయ రంగంలో వృద్థి ఉండొచ్చన్నారు. అంతర్జాతీయంగా టారిఫ్‌ విధానాలకు సంబంధించి అనిశ్చిత్తి నెలకొన్న నేపథ్యంలో ఎగుమతుల వృద్థిపై ప్రభావం ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ కీలక వృద్థి రేటు 40 నెలల కనిష్టానికి పడిపోయిన విషయాన్ని మోర్గాన్‌ స్టాన్లే గుర్తు చేసింది. డిసెంబర్‌లో జరగనున్న ఆర్‌బీఐ ఎంపీసీ భేటీలోనూ వడ్డీ రేట్లను తగ్గించకపోవచ్చని అంచనా వేసింది. టారిఫ్‌ విధానాల ప్రభావంతో గ్లోబల్‌ కమోడిటీ ధరలు పెరగొచ్చని పేర్కొంది.