బీమాపై జీఎస్టీ- బీజేపీ విన్యాసాలు

బీమాపై జీఎస్టీ- బీజేపీ విన్యాసాలుదేశవ్యాప్తంగా ఏఐఐఈఏ (అఖిల భారత బీమా ఉద్యోగుల సంఘం)కి చెందిన యూనిట్లు దాదాపు 300 మంది పార్లమెంట్‌ సభ్యులను కలిసి బీమా రంగంపై జీఎస్టీ భారాన్ని తగ్గించమని వినతి పత్రాలు అందజేశాయి. ఈ ఏడాది యూనియన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా దీనిపై చర్చించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను విపక్షాలు పట్టుబట్టాయి. అయితే దీనికి సమాధానం చెప్పకపోగా కేంద్రం వ్యూహాత్మక మౌనం పాటించింది. నేటికీ ఒక నిర్ణయంగానీ, పరిష్కార మార్గంగానీ లభించలేదు. బీమా ప్రీమియంపై 18 శాతం పన్ను విధించడాన్ని వ్యతిరేకిస్తూ గత ఏడేండ్లుగా (ఏఐఐఈఏ) స్ఫూర్తిదాయక పోరాటాన్ని కొనసాగిస్తున్నది. బీమా రంగంలో జీఎస్టీ భారాన్ని తగ్గించాలని ఉద్యోగులు, ఏజెంట్లతో కలిసి దేశవ్యాప్తంగా 46 లక్షల పాలసీదారుల చేత ఆ నాటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి లేఖలు రాయించింది. దాదాపు 400 మంది పార్లమెంట్‌ సభ్యులను కలిసి వినతి పత్రాలను అందజేసింది. అనేక రాష్ట్రాలలో ఉన్న ఆర్థిక మంత్రులను కలిసి ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్‌లో చేపట్టమని అభ్యర్థించింది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు యూనియన్‌ తరపున వినతి పత్రాలు సమర్పించింది. కేరళ, తమిళనాడు ఆర్థిక మంత్రులు జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ అంశాన్ని లేవనెత్తే ప్రయ త్నం చేసినా దానికి కేంద్రం అంగీకరించలేదు. గత పార్లమెం ట్‌లోనూ, ప్రస్తుత పార్లమెంట్‌లోనూ అనేకమంది పార్లమెంట్‌ సభ్యులు ఈ అంశాన్ని ప్రస్తావించినా, జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్ర అనుమతి లేకుండా ఏ ప్రతిపాదన ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఈ అంశం అపరిష్కృతంగానే ఉంది.
బీమా రంగాన్ని ప్రోత్సహించాలి
ఆహారం, దుస్తులు, నివాసం తర్వాత, సామాజిక భద్రత ప్రజలకు ముఖ్యమైన అవసరం. సార్వత్రిక భద్రత లోపించిన మన దేశంలో బీమా రంగం ప్రజలకు సామాజిక భద్రత అందించే ముఖ్యమైన సాధనం. కనుక, కేంద్రమే బీమారంగాన్ని ప్రోత్సహించాలి. పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా బీమా పథకాల ద్వారా పొదుపును ప్రోత్సహించాలి. అప్పుడు మాత్రమే బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి బీమా చేయదగిన ప్రజలు ఆకర్షితులవుతారు. ఇది దేశంలో ఎక్కువ బీమా వ్యాప్తికి సహాయ పడుతుంది. పాలసీదారు అకాల మరణం సంభవించినప్పుడు అతని కుటుంబానికి అవసరమైన ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా, దేశ నిర్మాణ కార్యకలాపాల కోసం ప్రజల దీర్ఘకాలిక పొదుపును పెట్టుబడి పెట్టడంలో ప్రభుత్వానికి సహాయం చేస్తుంది.జీవిత బీమా ఉత్పత్తులపై జీఎస్టీని నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని అందరూ భావించారు. జీవిత బీమా ఉత్పత్తులు, ప్రీమియంలపై అంత పెద్ద మొత్తంలో జీఎస్టీ విధించడం పాలసీదారులపై భారం మోపడమే అవుతుంది. అంతేగాక వారి పొదుపును నిరుత్సాహ పరుస్తుంది. బీమా పరిశ్రమ వృద్ధికి ఇది ప్రతిబంధకంగా మారుతున్నది. దేశంలో అందరికీ సామాజిక భద్రత లేని పరిస్థితుల్లో, బీమా చేయించుకోవడం తప్పనిసరి అవుతుంది. అన్ని నిత్యవసర వస్తువులు, సేవలు జీఎస్టీ పరిధిలోంచి తప్పిస్తున్న నేపథ్యంలో, బీమా ప్రీమియంపై ఇంత పన్ను భారం మోపడం సహేతుకంగా లేదని ఐఆర్‌డిఏ (బీమా నియంత్రణ సంస్థ) పూర్వ సభ్యులు నీలేష్‌ సాఠే అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా బీమా ప్రీమియం మీద ఇంత పన్ను వేయట్లేదని, యాన్యుటీ పాలసీలపై కూడా ఇంత పన్ను భారమా అని నీలేష్‌ సాఠే వాపోయారు.విలాస వస్తువులైన బంగారంపై 3 శాతం, నగిషీ చెక్కిన డైమండ్లపై 0.25 శాతం పన్ను విధిస్తూ, ప్రాణాధార మందులు, ప్రాణ వాయువుపై 12 నుండి 18 శాతం జీఎస్టీ భారమా?ప్రజలకు సామాజిక భద్రత, ఆరోగ్య బీమా సేవలు అందిస్తున్న బీమా రంగంపై 18 శాతం జీఎస్టీనా? ప్రపంచంలో ఏ దేశంలో కూడా సామాజిక భద్రతపై 18 జీఎస్టీ పన్ను లేదు. ప్రజల పొదుపుపై అధిక జీఎస్టీ విధించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి!
దేశ ఆర్థిక వ్యవస్థలో ఎల్‌ఐసిది కీలకపాత్ర
31 మార్చి 2023 నాటికి ఎల్‌ఐసి మన దేశ ఆర్థిక వ్యవస్థలో రూ.43,97,204.59 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ఇందులో రూ. 31,37,315 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీలలో, హౌసింగ్‌, నీటిపారుదల సౌకర్యాల కల్పన కోసం ఎల్‌ఐసి కేటాయించింది. దేశీయ బీమా రంగంలో ప్రయివేటు బీమా కంపెనీల ప్రవేశం జరిగి 24 ఏండ్లయినా, ఎల్‌ఐసి ప్రీమియమ్‌ ఆదాయంలో దాదాపు 60 శాతం మార్కెట్‌ వాటా, పాలసీలలో 72 శాతం మార్కెట్‌ వాటాతో ఇప్పటికీ మార్కెట్‌ లీడర్‌గా ముందుకు సాగుతోంది. ఎల్‌ఐసి ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి ఏటా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అందుతున్నాయి. ప్రభుత్వ అంతర్గత నిధుల సమీకరణలో ఎల్‌ఐసి వాటా 25 శాతం పైబడి ఉంది.’స్విస్‌ రే’ సంస్థ అంచనాల ప్రకారం 2032 నాటికి భారత్‌ పపంచంలో ఆరవ అతి పెద్ద బీమా మార్కెట్‌గా ఎదగనుంది. 2021లో కోవిడ్‌ మహమ్మారి దెబ్బకు మన దేశంలో 22.5 శాతం ఆరోగ్య బీమా ప్రీమియమ్‌లు అధికమయ్యాయి. 2022లో ఆర్థిక వ్యవస్థ కోవిడ్‌ తదనంతర పరిస్థితుల నుంచి కోలుకున్నాక, మోటార్‌ ప్రీమియమ్‌లు సైతం దాదాపు 2.9 శాతం పైబడి పెరిగాయి. మరి ఆరోగ్య బీమాపై, థర్డ్‌ పార్టీ ప్రీమియంపై 18 శాతం పన్ను భారం మోపడం, ప్రజలు తమకు తాము కల్పించుకునే సామాజిక భద్రతపై భారం వేయడం కాదా!! ఇప్పటికైనా మోడీ, బీజేపీ అండ్‌ కో బీమాపై విధించిన జీఎస్టీ విషయమై చేస్తున్న విన్యాసాలు, ఆడుతున్న నాటకాలు మానుకోవాలి. జీఎస్టీ భారాన్ని తగ్గించాలి. ప్రభుత్వ బీమా రంగాన్ని ప్రోత్సహించాలి.
– పి.సతీష్‌, 9441797900