మందులపై జీఎస్టీ తగ్గించాలి నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ మహాసభలో ఐలయ్య
నవతెలంగాణ-నల్లగొండ
కేంద్ర ప్రభుత్వం పేదలకు వైద్యం అందుబాటులో లేకుండా చేస్తూ మందులపై విధించిన జీఎస్టీని రద్దు చేయాలని తెలంగాణ మెడికల్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి ఐలయ్య డిమాండ్‌ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమురయ్య భవన్‌లో తెలంగాణ మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రెజెంటేటివ్‌ యూనియన్‌ (టీఎంఎస్‌ఆర్‌యూ) ఉమ్మడి నల్లగొండ జిల్లా జనరల్‌ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను మార్పులు చేస్తూ నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చిందని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 8 గంటల పని విధానం 12 గంటలకు పెంచి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, అక్రమ తొలగింపులు అరికట్టాలని, పేదలకు విద్యా, వైద్యం అందించాలని జరిగే పోరాటాలలో మెడికల్‌ రీప్రజెంటేటీస్‌ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటా సుధాకర్‌, రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు సోమ స్వామి ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సబ్‌ యూనిట్‌ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా చెరుపల్లి నిరంజన్‌, ప్రధాన కార్యదర్శిగా రవి రావుల, కోశాధికారిగా పోలా రమేష్‌, కార్యవర్గ సభ్యులుగా మహేష్‌, అనిల్‌, జీవన్‌, జీ.నరేష్‌, మరో 18 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.