రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీని నిలబెట్టుకోవాలి

– రైతుబంధును వెంటనే జమచేయాలి : శ్రీధర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రైతులకు రూ.2 లక్షల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తామన్న వాగ్దానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి సూచించారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు పైసలు జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బుధవారం హైదరాబాద్‌లో వ్యవసాయ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్‌ 9 అయిపోయి నెల దాటినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం పదేండ్లుగా వ్యవసాయ యాంత్రిక పరికరాలకు సబ్సిడీ ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పాలు చేసిందనీ, పంటల బీమా యోజనను తెలంగాణలో అమలు చేయలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వమైనా రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ కిసాన్‌ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌ రెడ్డి, పాపయ్య గౌడ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి, కార్యదర్శులు నరసింహారెడ్డి, నిరంజన్‌, అలేందర్‌ పాల్గొన్నారు.