ఉపాధి కూలీలకిచ్చిన హామీలను అమలు చేయాలి

– వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ వెంకట్‌ రాములు
నవతెలంగాణ- జడ్చర్ల
ఉపాధి కూలీలకు పెండింగ్‌ కూలి డబ్బులు వెంటనే చెల్లించాలని, ఉపాధి కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ వెంకట్‌ రాములు డిమాండ్‌ చేశారు. జడ్చర్ల మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జడ్చర్ల మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన ఉపాధి కూలీలకు పెండింగ్‌ కూలీ డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు. మెట్ల విధానాన్ని కొనసాగించాలన్నారు. సీనియర్‌ మేట్లను ఫీల్డ్‌ అసిస్టెంట్లుగా నియామకాలు చేపట్టాలని, పని దినాలు 200 రోజులు పెంచాలని, 600 రూపాయలు కూలి ఇవ్వాలని తెలిపారు. ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షలు ఇవ్వాలని ఉపాధి కూలీలను కార్మికులుగా గుర్తించాలని ఇవ్వాలన్నారు. రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలకు పూర్తిస్థాయిలో వేతనాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదని అందులో భాగంగా ఉపాధి కూలీలను పనికి దూరం చేసే దుర్మార్గపు చర్యకు ఈ యొక్క ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని ఆయన అన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు ఉపాధి కూలీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 150 రోజులు పని దినాలు 400 రూపాయలు వేతనం ప్రతి ఒక్కరికి జాబ్‌ కార్డు కల్పించాలని వారం వారం కూలీ డబ్బులు చెల్లించాలన్నారు. అనంతరం సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోలే జగన్‌, కడియాల మోహన్‌ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో మంచినీటి సౌకర్యం, కూలీ డబ్బులు, పనిముట్లు సరఫరా చేసే విషయంలో ఈజీఎస్‌ సంబంధిత అధికారులు బాధ్యత వహించి సక్రమంగా అమలు జరిగేలా చూడాలనిన్నారు. జిల్లా మండల వ్యాప్తంగా ఉపాధి కూలీలకు కూలి డబ్బులు చెల్లించని యెడల జిల్లా ఉపాధి పీడీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఉపాధి కూలీలను సమీకరించి ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.ఈకార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి గోపే నర్సింలు, సహాయ కార్యదర్శి బి జయరాములు, ఇ యాదయ్య, కప్పెట యాదయ్య,ఉపాధి కూలీలు బాలమని,అంజమ్మ, చంద్రకళ, దేవిగమ్లి, ముత్యాలు, మన్ని, సత్యమ్మ, సుక్కమ్మ, పిట్టె లక్ష్మమ్మ, శాంతమ్మ, నరసింహులు, శ్యామలమ్మ, ఎల్లమ్మ, బాలమ్మ, అనసూయ, లలిత, పార్వతమ్మ, ఈడిగి లక్ష్మమ్మ, మైసమ్మ తదితరులు పాల్గొన్నారు.