భ(ర)క్షకులు…!

భ(ర)క్షకులు...!నాలుగేండ్ల కిందట హథ్రాస్‌లో 27 ఏండ్ల దళిత మహిళపై పోలీసుల అఘాయిత్యం ఇంకా మన గుండెలను మెలిపెడుతూనే ఉంది. మూడేండ్ల కిందట నల్గొండలో పోలీసుల హింస తాళలేక లాకప్‌లోనే జీవచ్ఛవంగా మారిన మరియమ్మ శరీరం కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. నిత్యం ఇలాంటి ఘటనలు మానని గాయాలుగా మనసును సలుపుతూ ఉండగానే… మొన్నటికి మొన్న రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో సునీత అనే దళిత మహిళపై పోలీసుల దాష్టికం ఆలస్యంగా బయటకొచ్చింది. 1978లో రమిజాబీపై జరిగిన సమూహిక లైంగిక దాడి మొదలుకొని నేటి షాద్‌నగర్‌ ఘటన వరకు మహిళలపై పోలీసుల పైశాచిక క్రీడ కొనసాగుతూనే ఉంది.
దొంగతనం ఒప్పుకోవాలంటూ పోలీసులు సునీతపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు. మహిళ అని కూడా చూడకుండా అమానవీయంగా ప్రవర్తించారు. బూటు కాళ్లతో తన్నారు.తన పదమూడేండ్ల కొడుకునూ హింసించారు. ఇక్కడ విచిత్రమేమిటంటే దొంగతనం కేసులో ఆమెపై 13 రోజుల కిందటే నాన్‌బెయిల్‌బుల్‌ కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. అరెస్టు చేయకముందే తీవ్రంగా కొట్టి హింసించారు. ఆస్పత్రికి తీసుకెళితే అసలు నిజాలు బయటపడతాయని భయం కాబోలు. అందుకే మూడోకంటికి తెలియకుండా ఇంటికి పంపించేశారు.
ఇలా రక్షించాల్సిన పోలీసులే దాడులకు పాల్ప తుంతే మహిళలకు దిక్కెవరు? ఇప్పుడిది బుద్ధిజీవుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దళితుల రక్షణ బాధ్యత పూర్తిగా తామే స్వీకరిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారు. ‘ఇందిరమ్మ’ రాజ్యంలో మహిళలపై ఎలాంటి దాడులు జరగవని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు నిండాయో లేదో ఓ దళిత మహిళపై పోలీసులు తమ ప్రతాపం చూపారు. అంటే పార్టీలు ఏవైనా, ప్రభుత్వాలు ఎవరివైనా బలయ్యేది అణగారిన వర్గాలే. అందునా దళితులు, మహిళలు, మైనార్టీలే అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?
దళితుల రక్షణ కోసం తీసుకొచ్చిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి చట్టాలను అమలు చేయడంలో ప్రభు త్వాలు మొదటి నుండి నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నాయి. అందుకే ఇలాంటి దాడులు రోజురోజుకు పెరిగిపోతు న్నాయి. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినా సరిగ్గా విచారణ చేయడంలేదు. ప్రజా సంఘాల పోరాటాలతో విచారణ మొదలు పెట్టినా శిక్షలు ఆలస్యం చేస్తున్నారు. కొందరైతే అసలు శిక్షలే పడకుండా తప్పించుకుంటున్నారు. కులం, ధనం, అధికార బలంతో తామేం చేసినా చెల్లుతుందనే ధోరణి కొనసాగుతోంది. చుండూరులో జరిగిన దళితుల ఊచకోత నుంచీ ఇది మనకు అనుభవమే. ఈ కేసులో అసలు హంతకులను నిర్దోషులుగా వదిలేశారు. దేశాన్ని అతలాకుతలం చేసిన అంతటి దారుణ ఘటనలోనే అధికారులు ఇలా వ్యవహరిస్తే ఇక మిగిలిన కేసుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీన్ని బట్టి అధికారుల్లోని ఆధిపత్య ధోరణి కూడా ఇలాంటి ఘటనలకు ఓ కారణమని అర్థమవుతోంది. షాద్‌నగర్‌ ఘటనలోనూ మనం గమనిస్తే అగ్రకుల దురహంకారం స్పష్టంగా కనిపిస్తుంది.
ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులపై చర్యలు తీసుకున్నంత మాత్రాన బాధితులకు పూర్తి న్యాయం జరగదు. ఇవి కేవలం తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే. అంతకుముందు కూడా పలు కేసుల్లో పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసిన సంఘటనలనేకం. కానీ దాడులు మాత్రం ఆగడం లేదు. మరీ ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా ఇలాంటి దాడుల సంఖ్య పెరిగిపోయింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే పాలకుల అండ చూసుకొని దళితులు, మైనార్టీలపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. బీజేపీ ముందుకు తెస్తున్న కులతత్వ, మతతత్వ, మనువాదమే దీనికి కారణం. అధికారిక లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా ఏడాదిలో యాభై వేలకు పైగా కేసులు నమోదవుతున్నా యంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి వివక్షను నిర్మూలించాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే. తమ బాధ్యతను విస్మరించడం ప్రభుత్వాలకు మంచిది కాదు. షాద్‌నగర్‌ ఘటనకు కారణమైన పోలీసు అధికారులను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. మరో అధికారి ఇలా ప్రవర్తించకుండా చట్టాలను పటిష్టంగా అమలు జరిగేలా చూడాలి. అలాగే కులవివక్షపై ప్రభుత్వమే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కులవివక్ష, లింగ వివక్ష వంటివి సరైనవి కావని ప్రచారం చేయాలి. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సిఫార్సుల్లో దీని గురించి స్పష్టంగా ఉంది. ప్రతి నెలలో ఒకరోజు పౌర హక్కుల దినోత్సవంగా పాటించాలి. ఆ రోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గ్రామాలు, బస్తీల్లోకి వెళ్లాలి. అంటరానితనం, లింగ వివక్షపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు పూర్తిగా నిర్మూలించబడతాయి.