కాళేశ్వరం తెలంగాణకు గుదిబండ : వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు తలమానికం కాదనీ, అది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఆ ప్రాజెక్టు జీవాధారం కాదనీ, కేసీఆర్‌ కుటుంబానికి కమీషన్ల ధార అని తెలిపారు. ప్రాజెక్టు ఇంజనీరింగ్‌లో మెఘా సంస్థ వైఫల్యమని విమర్శించారు. ఆ ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. లక్షల ఎకరాలకు నీళ్లిస్తే..తొమ్మిదేండ్లలో 9 వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలపాలని కోరారు. దీనిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. బయటి దేశాల్లో సైతం కేటీఆర్‌ పచ్చి అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడి రైతులు వీరి మాటలు నమ్మేంత పిచ్చోళ్లు కాదని తెలిపారు.