– మార్చి 1 నుంచి 9 వరకు రెవెన్యూ సదస్సులు
– కలెక్టర్లకు కీలక బాధ్యతలు అప్పగింత
– 17 మాడ్యూల్స్‌లో ఉన్న 2,45,036 దరఖాస్తులు
– 20 లక్షల ఎకరాల భూ వివాదాలకు పరిష్కారం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం భూ పరిపాలనా శాఖ ముఖ్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 1 నుంచి మార్చి 9 వరకు ధరణి సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. తహశీల్దార్, ఆర్టీవో, అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ల సమక్షంలో రెవెన్యూ కమిటీలు 9 రోజుల్లో పెండింగ్ అప్లికేషన్లను క్లియర్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కరెక్షన్ చేసిన దరఖాస్తుల వివరాలను డిజిటల్ రూపంలో భద్రపరచాలని సూచించింది. ధరణిని అడ్డం పెట్టుకొని ఆక్రమించిన ప్రభుత్వ భూముల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్, రైతుల పేర్లు తప్పుగా నమోదై ఆగిపోయిన అప్లికేషన్లు, ఫొటో మిస్ మ్యాచ్‌లను సత్వరమే పరిష్కరించనుంది. దరఖాస్తుదారునికి ఫోన్, వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం చేరవేయాలని ఆదేశాల్లో పేర్కొంది. అప్లికేషన్లను క్లియర్ చేసే ముందు ప్రభుత్వ రికార్డులో వాటి వివరాలను తప్పనిసరిగా చెక్ చేయాలని ప్రభుత్వం సూచించింది. మార్చి 9 తర్వాత తిరస్కరణకు గురయిన దరఖాస్తులపై సమీక్ష నిర్వహించి అన్ని జిల్లా కలెక్టర్లు సీసీఎల్‌ఏకు రిపోర్ట్ సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెగా రెవెన్యూ సదస్సు ద్వారా 17 రకాల మాడ్యూల్స్‌లో పెండింగ్‌లో ఉన్న 2,45,036 దరఖాస్తులను క్లియర్ చేయనున్నారు. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఎకరాల భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుందని రెవెన్యూ వర్గాలు భావిస్తున్నాయి.
ధరణి ముఖ్యాంశాలు
1). మార్చి 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు
2). దరఖాస్తుల పరిశీలనకు తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలో 2నుంచి 3 బందాలు పని చేస్తాయి.
3). పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను తహశీల్దార్ కార్యాలయంలో అందుబాటులో ఉన్న రెవెన్యూ సిబ్బందికి అందిస్తారు.
4). చిన్న చిన్న సమస్యలను తహసిల్దార్, ఆర్టీవో స్థాయిలోనే పరిష్కరించనున్నారు.
5). అసైన్మెంట్, ఇతర ముఖ్య భూ వివాదాలకు సంబంధించి మాత్రం తహసిల్దార్ దృవీకరించిన తర్వాత, సమస్యను బట్టి, ఆర్డీవో, కలెక్టర్, అనంతరం సీసీఎల్‌కు బదిలీ చేస్తారు. తుది నిర్ణయం సీసీఎల్ తీసుకోనుంది.
6). మార్చి 1 నుంచి 9 వరకు జరగనున్న ప్రత్యేక రెవెన్యూ సదస్సుల అనంతరం ఈ ప్రక్రియను నిరంతరం కొనసాగించనున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఎంఆర్‌వో నుంచి కలెక్టర్ వరకు కాల పరిమితిని విదించారు.
7), తహశీల్దార్ 7 రోజులు, ఆర్డీవో 3 రోజులు, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) 3 రోజులు, కలెక్టర్ 7 రోజుల్లో తమ వద్దకు వచ్చే భూ సమస్యలను పరిష్కరించాలని సీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది.
తహసిల్దార్ స్థాయిలో పరిష్కరించే సమస్యలు.
1. టీఎం 14 – ఆధార్‌లో తప్పులు, ఆధార్ లేక పోవడంపై ఫిర్యాదులు
2. టీఎం 10 – జీపీఏ, ఎస్‌పీఏ, ఎగ్జిక్యూటెడ్ జీపీఏ కోసం దరఖాస్తు
3. టీఎం4 – అసైన్డ్ భూములతో సహా వారసత్వం కోసం దరఖాస్తు
4. టీఎం 32- ఖాతా విలీనం దరఖాస్తు
ఆర్డీవో స్థాయిలో పరిష్కరించే సమస్యలు
1. టీఎం 7 – పాస్‌బుక్ లేకుండా నాలా కోసం దరఖాస్తు
2.టీఎం 16 – సేకరించిన భూములకు సంబంధించిన ఫిర్యాదులు
3. టీఎం 20 – ఎన్‌ఆర్‌ఐ పోర్టల్ వివాదాలు
4. టీఎం 22 – సంస్థ కోసం పట్టాపాస్ బుక్ జారీ
5. టీఎం 26 – కోర్టు కేసుల సమాచారం
6). టీఎం 33 – పాస్‌బుక్ డేటా సవరణ కోసం దరఖాస్తు
పరిధి సవరణ (ప్రాథమిక విలువ రూ. 5 లక్షల వరకు )
కలెక్టర్ స్థాయిలో పరిష్కరించే సమస్యలు
1. టీఎం 3 – మ్యూటేషన్ కోసం ధరఖాస్తు
2. టీఎం 4 – అసైన్డ్ భూములతో సహా వారసత్వం కోసం దరఖాస్తు
3. టీఎం 15 – నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చడానికి సంబంధించిన ఫిర్యాదు
4. టీఎం 23-సెమీ అర్బన్ ల్యాండ్ కోసం దరఖాస్తు
5. టీఎం 24 -కోర్టు కేసుల కోసం దరఖాస్తు
6. టీఎం 31 – ”ఇల్లు/ఇంటి స్థలం” కోసం నాలా మార్పిడి
(భూమి బదిలీ, పేరు మార్పు, మిస్సింగ్ సర్వే నెం మొదలగు సవరణలు)
7. టీఎం 33-పాస్‌బుక్ డేటా కరెక్షన్ కోసం దరఖాస్తు( పేరు మార్పు మొదలగునవి)
పరిధి సవరణ (ప్రాథమిక విలువ రూ.5 లక్షల నుంచి రూ. 50 లక్షల కంటే ఎక్కువ )
సీసీఎల్‌ఏ స్థాయిలో పరిష్కరించే సమస్యలు
1. టీఎం 33-పాస్‌బుక్ డేటా కరెక్షన్ కోసం దరఖాస్తు
. ఏ). అన్ని రకాల పట్టాపాస్ బుక్ బదిలీ
బి). భూమి రకం దిద్దుబాటు (భూమి స్వభావం, వర్గీకరణ, ఆనందం
మరియు భూమిని స్వాధీనం చేసుకునే విధానం సవరణలు)
సి. పరిధి సవరణ (ప్రాథమిక విలువ రూ.50 లక్షల కంటే ఎక్కువ )
డి. సర్వే నెంబర్, సబ్ డివిజన్ మిస్సంగ్ ( రూ.50 కంటే ఎక్కువ ప్రాథమిక విలువ ).