మార్గదర్శి కేసు జులై 20కి వాయిదా

నవతెలంగాణ-హైదరాబాద్‌
మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రయివేటు లిమిటెడ్‌పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసుకు వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించకుండా ఉత్తర్వులు ఇవ్వాలనే పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ జులై 20కి వాయిదా వేసింది. ఏపీ సీఐడీ కేసును తెలంగాణ హైకోర్టు విచారణ చేయవచ్చునో లేదో అనే అంశంపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు విచారణ జులై 18న విచారణ జరగనుందని, అప్పటి వరకు ఇక్కడి కేసులో ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏపీ సీఐడీ కోరింది. మార్గదర్శి కేసు వివరాల్ని సీఐడీ ఆఫీసర్లు మీడియాకు వెల్లడించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ రామోజీరావు, శైలజ, మార్గదర్శి చిట్‌ ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. మార్గదర్శి అక్రమ మార్గాలద్వారా చట్ట వ్యతిరేకంగా తరలించిన డబ్బంతా ఖాతాదారులదేనని ఏపీ గవర్నర్‌మెంట్‌ స్పెషల్‌ ప్లీడర్‌ గోవిందరెడ్డి చెప్పారు. ఏవిధమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనక్కర్లేదన్నారు. ఇప్పటికే అనేక పిటిషన్లు వేసిన మార్గదర్శికి హైకోర్టు ఏవిధమైన ఉత్తర్వులు ఇవ్వలేదన్నారు. దర్యాప్తు కొనసాగించకుండా మీడియాకు వివరాలు ఎందుకు వెల్లడిస్తున్నరని, మీడియా ట్రయిల్‌ కరెక్టు కాదని హైకోర్టు ఏపీ సీఐడీని ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మీడియాకు ఎందుకు వివరాలు వెల్లడిస్తున్నారో చెప్పాలని ప్రతివాదులను ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. విచారణను జూలై 20కి వాయిదా వేసింది.