నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ మోడల్ దేశానికి తెలిస్తే గుజరాత్ మోడల్ విఫలమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ కోసం 50 వేల మందిని తరలిస్తే, చప్పట్లు కొట్టి అభినందించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణలో మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్‌రెడ్డి గుజరాత్‌కు గులాంగా మారారనీ, మహారాష్ట్రకు ఏక్‌నాథ్ శిందే, అజిత్ పవార్ ఎలాగైతే విరోధులుగా మారారో, కిషన్‌రెడ్డి తెలంగాణలో అలా తయారయ్యారని విమర్శించారు. గంగానది ప్రక్షాళన, సబర్మతీ రివర్ ఫ్రంట్ కిషన్ రెడ్డికి గొప్పగా కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఏం చేసినా తాము మూసీ పునరుజ్జీవనాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.