భారత జట్టుకు ఎంపికైన జిల్లా క్రీడాకారుడు గుండా వినయ్

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈనెల 2,3 తేదీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపుర్ ఆర్డిటిలో జరిగిన అండర్ -18 (జూనియర్) భారత జట్టు సెలెక్షన్ ట్రైల్స్ లో రాష్ట్రం తరఫున సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల బోధన్ క్రీడాకారుడు గుండ వినయ్, ఎంపీసీ ప్రథమ సంవత్సరం (డిచ్ పల్లి మండలంలోని మిట్టపల్లి గ్రామం ) పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచి (అండర్ -18) జూనియర్ భారత జట్టుకు ఎంపికన్నట్లుగా నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్షులు వి. ప్రభాకర్ రెడ్డి, జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి మార్కంటి గంగా మోహన్ లు సోమవారం తెలిపారు.
ఎంపికైన క్రీడాకారుడు ఈనెల 16 నుండి 21 వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని జల్గావ్ లో జరిగే శిక్షణ శిబిరంలో పాల్గొన్నారు. ఈ విధంగా నాలుగు శిక్షణ శిబిరాలలో పాల్గొని చివరి శిక్షణ శిబిరంలో ఎంపికైన భారత జట్టు జూన్ 23 ,24 తేదీల్లో జపాన్, కొచ్చి లో జరిగే (అండర్ -18)జూనియర్ బాలుర ఏషియన్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ లో పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారుడుని ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం అధ్యక్షులు వి. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గుండా వినయ్ భారత జట్టుకు సెలెక్ట్ కావడం పట్ల తనకు ఎంతో సంతోషం కలిగిందని, అదేవిధంగా రాబోయే క్రీడాకారులకు ఆదర్శంగా నిలవాలని, ఇంకా అనేక అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనాలని కోరారు. సాంఘిక సంక్షేమ గురుకుల స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ రామ్ లక్ష్మణ్, నిజామాబాద్ రీజినల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ పి. నీరజ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ సాఫ్ట్ బాల్ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ ఈట్యాల నరేష్ శిక్షణలో భారత జట్టుకు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
గుండా వినయ్ 2017 సంవత్సరం, ఆరో తరగతిలో తన ఆటను జడ్పీహెచ్ ఎస్ మిట్టపల్లి స్కూల్ పి ఈ టి మార్కంటి .గంగామోహన్ తో ప్రారంభించాడు. వినయ్ గంగామోహన్ ఆధ్వర్యంలో అనేక జాతీయ స్థాయి రాష్ట్రస్థాయిలో పోటీలలో పాల్గొని రాష్ట్ర జట్టు జిల్లా జట్టు పలుమార్లు ప్రథమ స్థానంలో ఉండడానికి జట్టును ముందుండి నడిపించాడు. గుండా వినయ్ ప్రస్తుతం తెలంగాణ సాంఘిక సంక్షేమ కళాశాల బోధనలో ఇంటర్మీడియట్ ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతు తెలంగాణ సాంఘిక సంక్షేమ సాఫ్ట్ బాల్ అకాడమీ( ఆర్మూర్) బాలుర కోచ్ ఇట్యాల. నరేష్ ఆధ్వర్యంలో తన శిక్షణను కొనసాగిస్తున్నాడు.
ఈ సన్మాన కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు బొజ్జ మల్లేష్ గౌడ్, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శి చిప్ప నవీన్, సొప్పరి వినోద్,మిట్టపల్లి గ్రామస్తుడు గుండా అశోక్ బాబు, బోధన్ పి ఈ టి పవన్, తెలంగాణ సాంఘిక సంక్షేమ సాఫ్ట్ బాల్ అకాడమీ కోచ్ ఇట్యాల నరేష్ పాల్గొన్నారు.