గుండేల్లో ఎముందో

Gundello Emundoగుండె స్పందిస్తున్నంత కాలమే మనిషి ప్రాణంతో జీవించి వున్నట్లు. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, భర్త… ఏ బంధమైనా… ఎవరైనా సరే వారి గుండె సరిగా స్పందించినంత కాలమే వారు ఆరోగ్యంగా అయినా, జీవించి అయినా వుండగలుగుతారు.
ప్రపంచ గుండె దినోత్సవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 29వ తేదీ ప్రజల్లో గుండె ఆరోగ్యంపట్ల అవగాహన, గుండె జబ్బుల నివారణపట్ల చైతన్యం కల్పించే ఉద్దేశ్యంతో జరుపబడుతోంది.

గుండెకు జబ్బులకు కారణాలేవైనా, లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కనుక ఏ సందేహం వచ్చినా తగిన వైద్యులను సంప్రదించి, వారు సూచించిన మేరకు జుజ+, జుజనఉ, జు ఆంజియోగ్రం, వీ=× పరీక్షలు చేయించుకొని, వైద్యులు సూచించిన మందులు, వ్యాయామం, చికిత్సలను క్రమం తప్పకుండా పాటిస్తూ, నిర్ణీత సమయాల్లో వైద్యులను తప్పక సంప్రదించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
సాధారణ సందేహాలు సమాధానాలు
ఛాతీలో వచ్చే నొప్పులన్నీ గుండెకు సంబంధించిన నొప్పేనా?
కాదు. రోజువారీ మనం చేసే పనులను బట్టి అధికశాతం నొప్పులు వుంటాయి. పక్కటెముకలు స్టెర్నమ్‌ ఎముకకు అతుక్కునే చోటు, కండరాల్లో వచ్చే ఇన్‌ప్లమేషన్‌, ఊపిరితిత్తులలోని ఇన్ఫెక్షన్‌, మెడ వద్ద బహిర్గతమయ్యే నరాలు ఒత్తిడికి గురికావడం. కడుపులోంచి ఆసిడ్‌ ఆహార నాళంలోకి రావడం, పెప్టిక్‌ అల్సర్‌ మొదలగు నొప్పులన్నీ గుండె నొప్పిలా భ్రమపడే అవకాశాలు ఎక్కువ. సందేహాన్ని వైద్యుడిని సంప్రదించడం ద్వారానే తీర్చుకోవాలి. స్వయంగా గ్యాస్‌ ప్రాబ్లమ్‌ అని నిర్దారణకు రావడం ప్రమాదానికి దారి తీయవచ్చు.
గ్యాస్‌ ట్రబుల్‌, అసిడిటీ, గుండెనొప్పి సందేహం తీరేదెలా?
అసిడిటీ, గ్యాస్‌ ప్రాబ్లమ్‌, అజీర్తి, గుండెనొప్పి లక్షణాలు చాలా వరకు ఒకేలా వుండి సమస్యను తేలిగ్గా తీసుకుని మోసపోయేలా చేస్తాయి. కనుక సందేహ నివృత్తికి, సరైన చికిత్సకు ఇ.సి.జి తప్పక తీయించుకోవాలి. ఇ.సి.జి. నార్మల్‌గా వున్నప్పుడు ఎండోస్కోప్‌ చేయించుకోవాలి.
నిన్న తీయించుకున్న ఇ.సి.జి. నార్మల్‌గా వుంది. ఈ రోజు నొప్పి వస్తే మళ్లీ ఇ.సి.జి. తీయించుకోవాలా?
తప్పకుండా తీయించుకోవాలి. ఇ.సి.జి. ఈ క్షణంలో వుండే గుండె పరిస్థితిని మాత్రమే తెలియజేస్తుంది. కొన్ని క్షణాల తరువాత గుండెలో వచ్చిన మార్పులు తెలియాలంటే మళ్లీ ఇ.సి.జి. తీయాల్సిందే. రాబోయే ప్రమాదాన్ని ఇ.సి.జి. ముందుగా తెలియజేయలేదు. ఇ.సి.జి. నార్మల్‌గా వుంటే ప్రస్తుతానికి గుండె సమస్యలకు గురి కాలేదని మాత్రమే అర్థం.
డిఫిబ్రిలేటర్‌తో కరెంట్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా రోగి గుండెపోటు నుండి తప్పక కోలుకుంటాడా?
వెంట్రికులార్‌ ఫిబ్రిలేషన్‌ వంటి సమస్యలు గుండెపోటు వచ్చినప్పుడు ఏర్పడితే ‘డిఫిబ్రిలేటర్‌’ అనే పరికరము ద్వారా డి.సి. షాక్‌ ఇవ్వాలి. గుండె పోటు తీవ్రంగా లేకుండా, గుండె ఫెయిల్యూర్‌ లేని సమయాల్లో మాత్రమే రోడి గుండె స్పందనలు మళ్లీ మొదలు కావచ్చు. ఇది ఒకానొక ప్రయత్నం మాత్రమే. కాని ఇది అత్యవసర చికిత్సలో తప్పక అందుబాటులో వుండాల్సిన పరికరం.

ఈ సంవత్సరం ప్రపంచ గుండె దినోత్సవం సందర్భంగా… గుండెను ఉపయోగించండి! గుండె గురించి తెలుసుకోండి!! (USE HEART – KNOW HEART) అన్న నినాదంతో ప్రజలను చైతన్య పరచాలన్నది ఉద్దేశ్యం!
ఏ విషయం పైనైనా అవగాహన పెరిగితేనే మనం జాగ్రత్త పడగలం… మన తోటి వారిని జాగ్రత్తగా చూసుకోగలం!
గుండె గురించి ఎందుకు తెలుసు కావాలి?
ఆరోగ్యకరమైన జీవితం గుండె ఆరోగ్యం మీద ప్రధానంగా ఆధారపడి వుంటుంది. ఒక్క రోజులో సగటున గుండె 1,15,000 సార్లుకొట్టుకుంటుంది (హార్ట్‌ బీట్స్‌). ఆ క్రమంలో 1.5 గాలన్ల రక్తాన్ని పంప్‌ చేస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికి రక్తం సరఫరా గుండె స్పందన పైనే ఆధార పడివుంటుంది.
ఏ వయసు వారి మరణాలకైనా గుండె పని తీరు ప్రధాన కారణమవుతోంది. దాదాపు సంవత్సరంలో 18.6 మిలియన్ల మరణాలకు గుండె జబ్బులే కారణం అవుతున్నాయి. అందుకే దానిగురించి అందరం తెలుసుకోవాలి. నివారించ దగ్గ మరణాలను తగ్గించాలి!
గుండె స్పందించడం ఎప్పుడు మొదలవుతుంది?
తల్లి గర్భంలో గుండె స్పందించడం ఫెర్టిలైజేషన్‌ జరిగిన నాలుగు వారాల తరువాత, అనగా గర్భం దాల్చిన ఆరవవారం తరువాత మొదలవుతుంది. ఈ ఎదుగుదల క్రమంలో తల్లి గర్భంలోంచి బయటకు వచ్చే దాక, వచ్చిన తరువాత కూడ అనేక మార్పులు సంభవించవచ్చు.
గుండెకు ఎన్ని రకాల జబ్బులు రావచ్చు?
1) గుండె రక్తప్రసరణ వ్యవస్థకు, రక్తనాళాలకు వచ్చే జబ్బులు (హార్ట్‌ ఎటాక్‌, CAD, CVA, PVD మొదలగునవి.
2) గుండె స్పందన (హార్ట్‌ బీట్స్‌) లో వచ్చే మార్పులు
3) పుట్టుకతో గుండె పెరుగుదలలోని లోపాల వల్ల వచ్చే గుండె జబ్బులు (జనణ)
4) గుండె కవాటాలకు వచ్చే జబ్బులు
5) గుండె కండరాలకు వచ్చే జబ్బులు
1) గుండెకు రక్త ప్రసరణ జరిపే రక్తనాళాలకు వచ్చే జబ్బు (CHD), శరీర అవయవాలకు గుండె నుండి రక్త ప్రసరణ జరిగే నాళాలకు వచ్చే జబ్బులు:
ప్రధానంగా రక్తనాళాలలో కొలెస్ట్రాల్‌ పేరుకు పోయి రక్త ప్రసరణ తగ్గిపోవడమో, ఆగిపోవడం వల్లనో సమస్యలు తలెత్తుతాయి. ఈ కారణం వల్ల గుండె పోటు, మెదడులోని రక్తనాళాల్లో రక్తప్రసరణ తగ్గితే పక్షవాతం, కిడ్నీలకు రక్త ప్రసరణ తగ్గితే కిడ్నీ ఫెయిలు కావడం, పాదాలకు రక్త సరఫరా తగ్గితే పాదాలు ఎండి పోవడం జరుగుతుంది.
గతంలో 50 సంవత్సరాల వయసు తరువాత వచ్చే సమస్యలు నేడు 30 సంవత్సరాల్లోనే వస్తున్నాయి. ఇది సమాజానికి, కుటుంబాలకు అత్యంత ప్రమాదకర, విషాదకర విషయం కనుక తప్పక అప్రమత్తం కావాలి.
కారణాలు:
1) డయాబెటిస్‌ వంటి జబ్బులు నియంత్రణలో లేకపోవడం వలన రక్తనాళాలలోని పొరలు దెబ్బతిని మూసుకుపోవడం వల్ల కొలెస్టరాల్‌ పేరుకొని గుండెపోటు వస్తుంది.
2) హైపర్‌ టెన్షన్‌ నియంత్రణలో లేకపోవడం వల్ల గుండె పోటే కాకుండా మెదడులోని పలుచని రక్త నాళాలు చిట్లి పక్షవాతం రావడం (జహూ), కిడ్నీల పనితీరు తగ్గి ఫెయిల్‌ కావడం జరుగుతుంది.
3) శరీరంలో లిపిడ్స్‌ (కొవ్వు) శాతం పెరగడం వల్ల రక్తనాళాలు పూడుకు పోయి గుండెపోటు, మెదడులో రక్తనాళాలు పూడుకుపోయి పక్షపాతమో, మరణమో సంభవిస్తుంటాయి.
4) పొగతాగడం : పొగ నేరుగా కాని, పరోక్షంగా కానీ పీల్చడం వలన రక్తనాళాలు, వూపిరి తిత్తులు దెబ్బతిని, చిన్న వయస్సులోనే గుండె పోటు, పాదాలు, వేళ్ళకు రక్తం సరఫరా తగ్గి అవి దెబ్బతినడం జరుగుతుంది.
లక్షణాలు ఎలా వుంటాయి?
1) గుండెకు రక్తం సరఫరా తగ్గితే, పని చేసినప్పుడు ఛాతీలో నొప్పివచ్చి, విశ్రాంతి సమయంలో తగ్గి పోతుంది (ఆంజైనా)
2) గుండె కండరాలకు రక్తం సరఫరా మూసుకు పోయి, కండరాలు దెబ్బతింటే… హర్ట్‌ అటాక్‌ వచ్చి – విపరీతమైన ఛాతీ నొప్పి, గందర గోళంగా అనిపించడం, చమట (సర్తు) కారిపోవడం, ఎడమచేతి వైపు, దవడలో నొప్పి, ఆయాసము, స్పృహ కోల్పోవడం జరుగవచ్చు. ఆయాసము, గస వస్తుంది.
3) పక్షవాతం: మెదడుకు రక్త ప్రవాహం తగ్గినా, రక్తనాళాలు మూసుకు పోయినా ఫిట్స్‌, తలపోటు, వాంతులు, శరీరము కదలికలు లేకుండా పక్షవాతం రావచ్చు. లక్షణాలు మెదడులోని ఏ ప్రాంత రక్తనాళాలు దెబ్బతిన్నాయనే పరిస్థితిని బట్టి వుంటాయి.
4) కిడ్నీలు పనిచేయకపోతే… మొహం, కాళ్ల వాపులు, మూత్రము తక్కువగా వస్తుంది.
గుండె స్పందన (కొట్టుకొనే తీరు) లో వచ్చే మార్పులు (ARRHYTHMIAS) :
సాధారణంగా గుండె ఒక క్రమపద్ధతిలో స్పందిస్తూ వుంటుంది. గుండెవేగం పెరగడం, తగ్గడం, అసాధారణ రీతిలో స్పందించడం వలన సమస్యలు తలెత్తుతాయి.
లక్షణాలు:
1) గుండె అతివేగంగా స్పందించడం కానీ, అతి తక్కువగా స్పందించడం గాని జారుతుంది
2) చెమట కారడం
3) శ్వాసతీసుకోవడం కష్టంగా మారడం
4) స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం
5) ఎదలో నొప్పి వంటి యిబ్బంది
కారణాలు:
1) గుండె పైన వున్న ఎలక్ట్రికల్‌ ఆక్టివిటీ కల్పించే నోడ్స్‌ (SA, AV NODES) లో మార్పులు సంభవించడం.
2) గుండెజబ్బు వుండడం
3) అధికరక్తపోటు
4) గుండెకండరాలు దెబ్బతిని వుండటం
5) ఎలెక్ట్రోలైట్స్‌లో హెచ్చు తగ్గులు ఏర్పడటం
6) థైరాయిడ్‌, అడ్రెనలిన్‌ గ్రంథులలో లోపాలు కారణమవుతాయి.
చికిత్స :
1) కొన్ని ప్రత్యేకమైన మందులు
2) రక్తపోటు, గుండె జబ్బులకు చికిత్స చెయ్యడం
3) లవణాల హెచ్చు తగ్గులను సవరించడం
4) డిఫిబ్రిల్లేటర్‌, పేస్‌ మేకర్‌, ఎలక్ట్రికల్‌ ఫైబర్‌ అబ్లేషన్‌ వంటి చికిత్సలు ప్రత్యేక వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా చేయించుకొని నియంత్రణ లోకి తీసుకు రావచ్చు.
పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు: ((Congenital Heart Diseases))
పుట్టుకతోనే గుండె నిర్మాణ క్రమములో వచ్చే మార్పుల వల్ల ఈ జబ్బులు వస్తాయి.
లక్షణాలు:
1) పెదవులు, చేతి వేళ్ళు నీలి రంగులో వుండటం
2) ఏడ్చే సమయంలోనూ, పాలు తాగే సమయంలో పసిబిడ్డ నీలి రంగు లోకి మారడం
3)ఎక్కువగా శ్వాస తీసుకోవడం
4) కాళ్ళు, కడుపు వాపు రావడం
5) గుండెవద్ద మర్మర్‌ శబ్దాలు ఏర్పడటం
కారణాలు:
1) జన్యులోపాలు
2) వంశ పారంపర్యం
3) తల్లికి డయాబెటిస్‌, బీపీ, రుబెళ్ళ వైరస్‌ సోకడం
4) తల్లి నేరుగా కానీ, పరోక్షంగా కానీ పొగతాగే అలవాటు వుండటం వంటి కారణాల వల్ల పుట్టుకతో గుండె జబ్బులు రావచ్చు
కొన్ని జనణ:
1) గుండె గదుల మధ్య గోడలలో రంధ్రాలు VSD, ASD
2) రక్తనాళాల అమరికలో మార్పులుPDA, FOT
3) కవాటాల నిర్మాణములో మార్పు వీూ, MS, MR, TR AS, AR
చికిత్స :
సమస్యను బట్టి ఒక్కో వయసులో ఆ జబ్బులకు శస్త్రచికిత్స నిర్వహిస్తారు. ఎంత త్వరగా గుర్తించి, తగిన వైద్యున్ని సంప్రదిస్తే అంత మంచి ఫలితాలు ఉంటాయి.
గుండె కవాటములకు వచ్చు జబ్బులు:
గుండెలోని నాలుగు గదుల మధ్య, ప్రధాన రక్తనాళాలలోనూ రక్త ప్రసరణ దిశను నిర్దేశించడం కోసం కవాటాలు వుంటాయి. కవాటాలు బిగుతుగా మారినా, వదులుగా మారినా రక్త ప్రసరణ వేగం, దిశలలో మార్పులు వల్ల జబ్బులు వస్తాయి.
లక్షణములు :
1) ఛాతీలో నొప్పి
2) అలసిపోవడం
3) కాళ్ళ వాపులు
4) గుండె లయలో మార్పులు
5) స్పృహ కోల్పోవడం
కారణములు :
1) రుమాటిక్‌ ఫీవర్‌
2) పెరిగే వయసుతో పాటు గుండె కండరాలలో వచ్చే మార్పులు
3) గుండెకు ఇన్ఫెక్షన్‌ సోకడం
4) హార్ట్‌ ఎటాక్‌
5) పుట్టుకతో వచ్చిన జబ్బు
చికిత్స :
అత్యాధునిక పద్ధతులలో కవాటముల మార్పిడి, మందులతో చికిత్స అందుబాటులో వుంది.
ఆపరేషన్‌, చికిత్స తరువాత రక్తం గడ్డ కట్టకుండా ఉండటానికి, ఇన్ఫెక్షన్‌ సోకకుండా వుండటానికి దీర్ఘకాలం మందులు క్రమం తప్పకుండా వాడాలి.
గుండె కండరాలకు వచ్చే జబ్బులు: CAR- DIOMYOPATHY)
ఈ జబ్బువల్ల గుండె శరీరభాగాలకు రక్తాన్ని సరఫరా చేయలేక పోతుంది. చివరిగా గుండె ఫెయిల్యూర్‌కు కారణ మవుతుంది.
లక్షణాలు:
1) ఆయాసము
2) కాళ్ళ వాపులు
3) ఉదర భాగంలో నీరు చేరడం
4) పడుకునే సమయంలో దగ్గు
5) అలసిపోవడం
6) తల తిరిగినట్లు అనిపించడం
7) ఆకస్మిక మరణం
కారణాలు:
1) దీర్ఘకాలం అధిక రక్తపోటు
2) వంశ పారంపర్యంగా
3) గుండెపోటు తరువాత కండరము దెబ్బతినడం వల్ల
4) గర్భిణి స్త్రీలలో వచ్చు మార్పుల వలన ప్రసవ సమయంలోనూ, ఆతరువాత peri-partam cardiomyopathy జబ్బు ఏర్పడవచ్చు
5) గుండె కండరాలలో అమైలోయిడ్‌, ఐరన్‌ నిలువ కావడం
6) మద్యపానం మొదలగునవి
చికిత్స :
మూల కారణాలకు చికిత్స చెయ్యడం, హార్ట్‌ ఫెయిల్యూర్‌ను మందులతోనూ, ప్రత్యేక ఉపకరణాల సాయంతోనూ చికిత్స చేస్తారు.
చివరిగా…
గుండెకు జబ్బులకు కారణాలేవైనా, లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కనుక ఏ సందేహం వచ్చినా తగిన వైద్యులను సంప్రదించి, వారు సూచించిన మేరకు జుజ+, జుజనఉ, జు ఆంజియోగ్రం, వీ=× పరీక్షలు చేయించుకొని, వైద్యులు సూచించిన మందులు, వ్యాయామం, చికిత్సలను క్రమం తప్పకుండా పాటిస్తూ, నిర్ణీత సమయాల్లో వైద్యులను తప్పక సంప్రదించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చు.
మన జీవన శైలిని మార్చుకొని, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ధూమపానం, మద్యపానం వంటి ప్రమాదకరమైన అలవాట్లను దూరంగా ఉంచి, ఊబకాయం రాకుండా జాగ్రత్తపడి, బీపీ, షుగర్‌ లాంటి జబ్బులను కఠినంగా నియంత్రించుకోవడం ద్వారా గుండె జబ్బుల దుష్ఫలితాలను దూరం చేసుకోవచ్చు.
ప్రతి సంవత్సరం గుండె పరీక్షల కోసం ఆరోగ్యవంతులు కూడా ఒక రోజు కేటాయించి హార్ట్‌ ఎటాక్‌ రాకుండా జాగ్రత్త పడాలి… మీరు ప్రేమించే కుటుంబ సభ్యులకోసం, మీ మీద ఆధారపడిన వారికోసం!
– డా||టి.ఎం.బషీర్‌, ఎం.బి.బి.ఎస్‌, డి.ఎ