భావప్రధాన చిత్రాల రూపకర్త గురుదత్‌

భావ ప్రధానమైన ప్రేమోద్వేగాన్ని అత్యద్భుతంగా చిత్రీకరణ చేయగల ప్రతిభ గురుదత్‌ సొంతం. హిందీ చిత్రసీమ గౌరవించిన దర్శకులలో ఆయనభావ ప్రధానమైన ప్రేమోద్వేగాన్ని అత్యద్భుతంగా చిత్రీకరణ చేయగల ప్రతిభ గురుదత్‌ సొంతం. హిందీ చిత్రసీమ గౌరవించిన దర్శకులలో ఆయన ఒకరు. గురుదత్‌ కేవలం ఒక దర్శకుడే కాదు, మంచి రచయిత, నిర్మాత, అద్భుత నటుడు కూడా. బెంగాలీ చిత్రసీమలో సత్యజిత్‌ రారుకి ప్రయోగాలు చేయడంలో, భావోద్వేగపు చిత్రాలు నిర్మించడంలో ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నాయో, హిందీ చిత్రసీమలో గురుదత్‌ సినిమాలు కూడా అదే కోవకు చెందుతాయి. ఆయన నిర్మించిన ‘ప్యాసా’, ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌’, ‘కాగజ్‌ కే ఫూల్‌’, ‘చౌద్వి కా చాందిని’ చిత్రాలు క్లాసికల్‌ మాస్టర్‌ పీసులుగా గుర్తింపుపొందాయి. ముఖ్యంగా ‘ప్యాసా’, ‘కాగజ్‌ కే పూల్‌’ సినిమాలను అంతర్జాతీయ ‘టైమ్‌ మ్యాగజైన్‌’ 100 ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ సినిమాల జాబితాలో చేర్చింది. ‘సైట్‌ అండ్‌ సౌండ్‌ క్రిటిక్స్‌’ సంస్థ గురుదత్‌ పేరును ‘ఆల్‌ టైమ్‌ గ్రేటెస్ట్‌ ఫిలిం దర్శకుల’ జాబితాలో చేర్చింది. అంతేకాదు, ‘సి.ఎన్‌.ఎన్‌’ సంస్థ ‘ఆసియా ఖండంలోని టాప్‌ 25 దర్శకుల జాబితా’లో గురుదత్‌ పేరును ప్రకటించింది. గురుదత్‌ శతజయంతి ఈ ఏడాది జులై 9 నుంచి ప్రారంభమైన సందర్భంగా ఆ మహానటుని గురించి సోపతి పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
గురుదత్‌ 1925, జులై 9న కర్ణాటకలోని మైసూర్‌లో పుట్టాడు. గురుదత్‌ అసలు పేరు వసంత కుమార్‌ శివశంకర్‌ పదుకొణే. అయితే, చిన్నతనంలో గురుదత్‌కు పెద్ద ప్రమాదం తప్పటంతో అతని మేనమామ వసంత కుమార్‌ శివశంకర్‌ పదుకొణే పేరును గురుదత్‌గా మార్చాడు. గురుదత్‌ చిన్నతనంలోనే వారి కుటుంబం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలోని భవానీపూర్‌కు వెళ్లి అక్కడే స్థిరపడింది. ఆయన విద్యాభ్యాసం కలకత్తాలో జరిగింది. ఆ సమయంలో వాళ్ళ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో జరిగే తిరునాళ్లలో కళాకారుల ఆటపాటలతో స్పూర్తి పొందిన గురుదత్‌, పండిట్‌ రవిశంకర్‌ సోదరుడు ప్రముఖ నత్యదర్శకుడు ఉదరు శంకర్‌ వద్ద నాట్యంలో మెళకువలు నేర్చుకున్నాడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించని కారణంగా కళాశాలకు వెళ్ళి చదువుకోవాలన్న దత్‌ కల నెరవేరలేదు. దీంతో చదువుకు స్వస్తి చెప్పి ఉదయశంకర్‌ నడిపే నాట్య బందంలో సభ్యుడిగా చేరి సారస్వత పరిషత్‌ ప్రదర్శనలలో నత్య ప్రదర్శనలిచ్చేవాడు. తరువాత కొంతకాలం కలకత్తాలోని లీవర్‌ బ్రదర్స్‌ ఫాక్టరీలో టెలిఫోన్‌ ఆపరేటర్‌గా పనిచేసిన గురుదత్‌ కొన్నాళ్ళ తర్వాత ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. మేనమామ సహకారంతో తల్లిదండ్రులతో కలసి 1940లో బొంబాయిలో అడుగుపెట్టాడు. అక్కడ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండటంతో గురుదత్‌ పూణేకు చేరుకున్నాడు.
సినీరంగంలోకి గురుదత్‌
పూణేలో అడుగుపెట్టిన గురుదత్‌కు నత్యంలో ప్రవేశం ఉండటంతో ప్రభాత్‌ ఫిలిం స్టూడియోలో మూడు సంవత్సరాల ఒప్పందం మీద కొరియోగ్రాఫర్‌గా చేరాడు. ప్రభాత్‌ ఫిలిం కంపెనీ నిర్మించిన ‘చాంద్‌’ అనే సినిమాలో శ్రీకష్ణుడుగా చిన్న పాత్ర ధరించాడు. తరువాత ‘లఖ్రాని’ అనే సినిమాకు సహాయ దర్శకునిగా వ్యవహరిస్తూ అందులో నటించాడు. అప్పుడే దేవానంద్‌ హిందీ సినిమాల్లో నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రభాత్‌ ఫిలిం కంపెనీ పి.ఎల్‌. సంతోషి దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘హమ్‌ ఏక్‌ హై’ సినిమాలో దేవానంద్‌ది హీరో పాత్ర. ఆ సినిమాకు గురుదత్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒకరోజు షూటింగ్‌ జరుగుతుండగా దేవానంద్‌ తన షర్టుని గురుదత్‌ ధరించి వుండడం గమనించాడు. షూటింగ్‌ విరామంలో విషయాన్ని ప్రస్తావించాడు. తనకు ఒకే షర్టు వుందని, దానిని వుతకడానికి లాండ్రీలో ఇచ్చి, ఆ లాండ్రీ వాడిని బతిమాలి ఆ షర్టు వేసుకొచ్చానని గురుదత్‌ చెప్పుకొచ్చాడు. ఈ అనుకోని సంఘటన దేవానంద్‌-గురుదత్‌ల గాఢమైన స్నేహానికి పునాదిగా మారింది. అప్పుడు వీరిద్దరిమధ్య ఒక మౌఖిక ఒప్పందం జరిగింది. ‘గురుదత్‌ నిర్మాతగా మారితే అందులో దేవానంద్‌ హీరోగా నటించాలి.. దేవానంద్‌ నిర్మాత అయితే ఆ సినిమాకు గురుదత్‌ దర్శకత్వం వహించాలి’ అనేది ఆ ఒప్పందం. ప్రభాత్‌ స్టూడియోతో మూడేళ్ల ఒప్పందం పూర్తయ్యాక, బాబురావు పారుకి సహాయకుడిగా అదే స్టూడియోలో గురుదత్‌ పది నెలలపాటు పని చేశాడు. 1947 ప్రాంతంలో ఆ స్టూడియో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని 1952లో మూతపడి బొంబాయికి తరలిపోయింది. దాంతో గురుదత్‌ 1947లోనే బొంబాయికి మకాం మార్చాడు. 1947 లో అమియా చక్రవర్తి చిత్రం ‘గరల్స్‌ స్కూల్‌’, 1950లో జ్ఞాన్‌ ముఖర్జీ నిర్మించిన ‘సంగ్రామ్‌’ చిత్రాలకు సహాయకుడిగా పనిచేశాడు.
కలిసొచ్చిన దేవానంద్‌తో మైత్రి
దేవానంద్‌ హీరోగా స్థిరపడిన తరువాత 1950లో నవకేతన్‌ ఫిలిమ్స్‌ పేరుతో చిత్రనిర్మాణ సంస్థను నెలకొల్పాడు. తొలి ప్రయత్నంగా 1950లో ‘అఫ్సర్‌’ సినిమా నిర్మించాడు. తొలిచిత్రం కావడంతో ఆ చిత్రానికి దేవానంద్‌ అన్న చేతన్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. సినిమా విజయవంతం కావడంతో రెండవ ప్రయత్నంగా 1951లో ఒక క్రైమ్‌ త్రిల్లర్‌ ‘బాజి’ సినిమా నిర్మించాడు. గతంలో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆ చిత్రానికి గురుదత్‌కు దర్శకుడుగా తొలి అవకాశం కల్పించాడు. ఆ చిత్రం బాక్సాఫీస్‌ హిట్టయింది. తదనంతరం హిందీలో వచ్చిన క్రైమ్‌ చిత్రాలకు ‘బాజి’ సినిమా ఒక ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. తరువాత సొంత బ్యానర్‌ గురుదత్‌ ఫిలిం ఆర్ట్స్‌ పేరిట 1952లో నిర్మించిన ‘జాల్‌’ చిత్రానికి కథ సమకూర్చి దర్శకత్వం వహించాడు. ఇది గురుదత్‌కు దర్శకుడిగా రెండవ చిత్రం. అందులో దేవానంద్‌ హీరోగా నటించగా గీతాబాలి హీరోయిన్‌గా నటించింది. గోవాలో వుండే జాలరుల నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రం కూడా విజయవంతమైంది. 1953లో హరిదర్శన్‌ నిర్మించిన ‘బాజ్‌’ చిత్రానికి గురుదత్‌ కథ అందించి దర్శకత్వం వహించాడు. అంతేకాదు తొలిసారి ఇందులో గీతాబాలి సరసన హీరోగా కూడా నటించాడు. ఒక ఓడమీద జరిగే సాహసకత్యం ఇందులో హై లైట్‌గా నిలిచి సినిమాను హిట్‌ చేసింది. ఒ.పి.నయ్యర్‌ సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. 1954లో గురుదత్‌ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించిన ‘ఆర్‌ పార్‌’ సినిమా గురుదత్‌కు అటు నిర్మాత, దర్శకునిగా, ఇటు నటుడుగా ఒక మంచి బ్రేక్‌ ఇచ్చింది. ఇది ఒకరకమైన కామెడీతో కూడిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రంగా చలామణి అయ్యింది. గురుదత్‌ సరసన శ్యామా హీరోయిన్‌గా నటించగా, రాజ్‌ ఖోస్లా గురుదత్‌కు దర్శకత్వంలో సహాయకుడుగా వ్యవహరించడం విశేషం. ‘బాజి’ చిత్రానికి సంగీతం సమకూర్చిన ఒ.పి.నయ్యరే ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం తరువాత గురుదత్‌ ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. ఇందులో గురుదత్‌ సరసన హీరోయిన్‌గా మధుబాల నటించింది. ఒ.పి.నయ్యర్‌ సంగీత దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రముఖ కార్టూనిస్టు ఆర్‌.కె.లక్ష్మణ్‌ చిత్రాలు గీయడం విశేషం. మహిళా హక్కుల నేపథ్యంలో నిర్మించిన ఈ సినిమా బాగా ఆడింది. తనవద్ద సహాయకుడిగా పనిచేసిన రాజ్‌ ఖోస్లాను దర్శకుడిగా పరిచయం చేస్తూ గురుదత్‌ 1956లో ‘సీఐడీ’ చిత్రాన్ని నిర్మించాడు. అందులో హీరోగా దేవానంద్‌ నటించగా వహీదా రెహమాన్‌ను తొలిసారి హీరోయిన్‌గా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు. ఈ క్రైమ్‌ సినిమాలో దేవానంద్‌ ఒక హత్యను ఛేదించే పోలీసు అధికారిగా నటించాడు. తరువాతి కాలంలో దర్శకులుగా రాణించిన ప్రమోద్‌ చక్రవర్తి, భప్పీసోని ఈ చిత్రానికి సహాయ దర్శకులుగా పనిచేశారు. గురుదత్‌ మనసులో ‘ప్యాసా’ కథను సినిమాగా నిర్మించాలనే కోరిక ఉండడంతో, అందులో హీరోయిన్‌గా వహీదా రెహమాన్‌ చేత బాగా నటింపజేయాలని, తొలిసారి ‘సీఐడీ’ చిత్రంలో స్థానం కల్పించారు. జోహారా సెహగల్‌ను ఇందులో కొరియోగ్రాఫర్‌గా పరిచయం చేసింది గురుదత్‌ కావడం కూడా ఒక విశేషమే. ‘దిఖిదీ’ సినిమా సూపర్‌ హిట్టయింది. అప్పుడే గురుదత్‌ దర్శకుడు రాజ్‌ ఖోస్లాకు ఒక విదేశీ కారును బహుమతిగా ఇచ్చాడు.
అద్భుత పాటల సష్టికర్త గురుదత్‌
గురుదత్‌ మంచి విజయవంతమైన నిర్మాత, దర్శకునిగానే కాకుండా అద్భుత పాటల సష్టికర్తగా పేరు తెచ్చుకున్నారు. 1954లో తనే హీరోగా, శ్యామా హీరోయిన్‌గా ‘ఆర్‌ పార్‌’ సినిమా నిర్మించి దర్శకత్వం వహించారు. ఓ.పి. నయ్యర్‌ సంగీతం చిత్ర విజయానికి యెంతో సహకరించింది. ‘బాబూజీ ధీరే చల్నా…’ వంటి అద్భుతమైన పాటలు గీతా దత్‌ చేత పాడించి హిట్‌ చేశారు. ఆ మరుసటి సంవత్సరం ‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55’ సినిమా నిర్మించారు. గురుదత్‌, మధుబాల ఇందులో హీరో హీరోయిన్లు. ఓ.పి. నయ్యర్‌ సంగీతం మరలా మురిపించింది. గీతా దత్‌ ఆలపించిన ‘థండి హవా కాలి ఘటా…’ ‘ప్రీతమ్‌ ఆన్‌ మిలో’ పాటలు మారుమోగాయి. తరవాత తను నిర్మాతగా వ్యవహరిస్తూ మిత్రుడు రాజ్‌ ఖోస్లా దర్శకత్వంలో ‘సి.ఐ.డి.’ సినిమా నిర్మించారు. దేవానంద్‌ హీరోగా, షకీలా, వహీదా రెహమాన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ సూపర్‌ హిట్‌ సినిమాలో ఓ.పి. నయ్యర్‌ సంగీతం కొత్త పుంతలు తొక్కింది. ఇందులో ‘ఆంఖోం హి ఆంఖోం మే ఇషారా హోగయా’, ‘లేకే పెహలా పెహలా ప్యార్‌’, ‘యే దిల్‌ హై ముష్కిల్‌’, ‘జీనా యహా’ పాటలు నేటికీ వినపడుతూనే వుంటాయి. ప్రఖ్యాత హార్మోనికా ప్లేయర్‌ మిలోన్‌ గుప్తా ఈ సినిమాలో హార్మోనికా వాయించడం విశేషం. గురుదత్‌ నిర్మించిన సినిమాలన్నీ భావ ప్రధానమైనవే కావడంతో నటీనటులకు తమ పూర్తి స్థాయి ప్రతిభను ప్రదర్శించే అవకాశం దక్కింది. గురుదత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టిన అద్భుత చిత్రం 1957లో వచ్చిన ‘ప్యాసా’. ఈ సినిమాకు దర్శక నిర్మాత, హీరో కూడా గురుదత్తే! గురుదత్‌ స్టూడియోలోనే ఈ సినిమా నిర్మాణం జరిగింది. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ అందించిన అద్భుత సంగీతం ఈ చిత్ర విజయానికి ఎంతో తోడ్పడింది. ‘ప్యాసా’ సినిమా అంత గొప్ప విజయాన్ని సాధిస్తుందని హిందీ చలనచిత్రరంగ పండితులు ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాలో దిలీప్‌ కుమార్‌, నర్గీస్‌, మధుబాల నటించాల్సింది. గురుదత్‌ ప్రతిభను గుర్తించలేని ఈ నటవర్గం వెనక్కు తగ్గడంతో తనే హీరో పాత్రను పోషించాల్సివచ్చింది. హీరోయిన్లుగా వహీదా రెహమాన్‌, మాలాసిన్హాలు వారి స్థానాల్లో నటించడం జరిగింది. ప్యాసా సినిమా విడుదలయ్యాక దాదాపు ఎనిమిది వారాల దాకా మందగమనంతో నడిచింది. ఆ తరవాత బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం భారత చలనచిత్ర చరిత్రలో ఓ కళాఖండంగా నిలిచిపోయింది, అయితే గురుదత్‌ ఎంతో శ్రమించి 1959 లో నిర్మించిన ‘కాగజ్‌ కే పూల్‌’ నిరాశను, పుట్టెడు నష్టాలను మిగిల్చింది. ఇందులో గురుదత్‌, వహీదా రెహమాన్‌ జంటగా నటించారు. ‘కాగజ్‌ కే ఫూల్‌’ మిగిల్చిన నష్టాలను ‘చౌద్వి కా చాంద్‌’ సినిమా పూడ్చింది. 1960లో వచ్చిన ‘చౌద్వి కా చాంద్‌’ సినిమా స్మాష్‌ హిట్టయింది. గురుదత్‌, వహీదా రెహమాన్‌ నటించిన ఈ చిత్రానికి మహమ్మద్‌ సాదిక్‌ దర్శకత్వం వహించారు. రవి సంగీత దర్శకుడు. రఫీ ఆలపించిన ‘చౌద్వి కా చాంద్‌ హో’ పాట నేటికీ నిత్య నూతనమే! ఈ సినిమా టైటిల్‌ ట్రాక్‌ను కలర్‌లో నిర్మించారు. గురుదత్‌ నటించిన ఒకే ఒక కలర్‌ సినిమా ఇదే. ఈ చిత్రం మూడు ఫిలింఫేర్‌ బహుమతులను గెలుచుకోవడమే కాకుండా మాస్కోలో జరిగిన రెండవ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికైంది. 1962లో గురుదత్‌ అబ్రార్‌ ఆల్వి దర్శకత్వంలో ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌’ సినిమా నిర్మించాడు. ఈ సినిమా సినీ పండితుల ప్రశంసలు పొందినా కమర్షియల్‌గా పెద్దగా విజయవంతం కాలేదు. ఇది ఉత్తమ చిత్రంగానే కాకుండా నాలుగు ఫిలింఫేర్‌ బహుమతులు కూడా గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఈ సినిమాను ఆస్కార్‌ బహుమతికి అధికారిక ఎంట్రీగా పంపింది. కానీ ఒక గహిణి మద్యానికి బానిస అయ్యే నేపథ్యం కలిగి ఉండడంతో ఈ చిత్రాన్ని ఆస్కార్‌ కమిటీ పరిశీలనకు నిరాకరించింది. గురుదత్‌ నటించిన ఆఖరి సినిమా హషికేష్‌ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘సాంర్‌a అవుర్‌ సవేరా’. అందులో హీరోయిన్‌ మీనాకుమారి. ‘బహారె ఫిర్‌ భి ఆయేంగీ’ సినిమా నిర్మాణాన్ని గురుదత్‌ 1964లో ప్రారంభించారు. అందులో తనే హీరో. అయితే ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే గురుదత్‌ మరణించడంతో గురుదత్‌ పాత్రను ధర్మేంద్ర పోషించాడు. ఓ.పి. నయ్యర్‌ సంగీతం ఈ సినిమాకు ఒక వరంగా నిలిచింది. రెండు సంవత్సరాల తరవాత ఈ సినిమా విడుదలైంది. గురుదత్‌ నటించి నిర్మించిన సినిమాలు ఫ్రాన్స్‌, జపాన్‌, జర్మనీ దేశాల్లో హౌస్‌ఫుల్‌గా నడచిన సందర్భాలు వున్నాయి. గురుదత్‌ నిర్మించిన సినిమాల్లో పాటలు కథాబలాన్ని ఇనుమడించేవిగా ఉండేవి.
వివిధ భాషలలోకి ‘ప్యాసా’
బ్లాక్‌ బస్టర్‌ సాధించిన ‘ప్యాసా’ చిత్రాన్ని తదనంతర కాలంలో వివిధ భాషలలోకి రీమేక్‌ అయ్యి అక్కడ విజయం సాధించింది. 1975 లో తెలుగులో ‘మల్లెపూవు’గా, 1968 లో తమిళంలో ‘దేవి’గా, 1961లో కన్నడంలో ‘కన్తెరేడు నోడు’గా పునర్నిర్మించారు.
వెలుగు చూడని గురుదత్‌ సినిమాలు
గురుదత్‌ చనిపోయేనాటికి ‘బహారె ఫిర్‌ భి ఆయేంగీ’, ‘లవ్‌’, ‘గాడ్‌’ వంటి చిత్రాలు వివిధ నిర్మాణ దశల్లో వున్నాయి. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తనకు నచ్చకపోతే వాటిని కాల్చేసి కొత్తగా చిత్రీకరించడం వంటి కారణాల చేత ఈ సినిమాలు పూర్తి కాలేదు. ‘ప్యాసా’ చిత్ర విజయం తర్వాత గురుదత్‌ ‘గౌరీ’ అనే సినిమాను బెంగాలి, ఇంగ్లీషు భాషల్లో నిర్మించాలని సంకల్పించారు. ఈ చిత్రంతోనే తన భార్య, ప్రముఖ గాయని గీతాదత్‌ని హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం చేయాలనుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన కలకత్తా నగరంలో సినిమా మొదలుపెట్టి రెండు రీళ్ల చిత్రాన్ని తీశారు. సచిన్‌ దేవ్‌ బర్మన్‌ ‘గౌరీ’ సినిమా కోసం రెండు పాటల్ని కూడా రికార్డు చేశారు. సినిమా స్కోప్‌లో నిర్మించ తలపెట్టిన ఈ సినిమా నిర్మాణం అర్దాంతరంగా ఆగిపోయింది. అదే సినిమా పూర్తయితే ఇండియాలో నిర్మించిన తొలి సినిమా స్కోప్‌ చిత్రంగా చరిత్ర పుటలకు ఎక్కి వుండేది. అలాగే విల్కీ కోలిన్స్‌ రచించిన క్లాసికల్‌ నవల ‘ది వుమన్‌ ఇన్‌ వైట్‌’ ఆధారంగా ‘రాజ్‌’ అనే చిత్రాన్ని తన సహాయకుడు నిరంజన్‌ చేతిలో పెట్టి చిత్రనిర్మాణం మొదలెట్టారు. సునీల్‌ దత్‌ ఆర్మీ వైద్యునిగా, వహీదా రెహమాన్‌ ద్విపాత్రాభినయంతో ఈ చిత్రం మొదలైనా, ఆటుపోట్లకు లోనై చివరకు తనే హీరోగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాహుల్‌ దేవ్‌ బర్మన్‌ సంగీత దర్శకుడుగా తొలి ప్రయత్నంలో ఆశా భోస్లే, గీతాదత్‌, శంషాద్‌ బేగంలు పాడిన రెండు డ్యాన్స్‌ పాటలను రికార్డు చేశారు. సిమ్లాలో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగింది. ఆరు రీళ్ల సినిమా పూర్తయ్యాక ఎందుకో గురుదత్‌కు సంతప్తి కలుగక, ఆ సినిమాను ప్రక్కన పెట్టేశారు. గురుదత్‌ మొదలుపెట్టి మధ్యలో ఆపివేసిన మరో బెంగాలీ చిత్రం ‘ఏక్‌ టుకు చువా’. గుల్షన్‌ నందా రాసిన నీల్‌ కమల్‌ నవల నేపథ్యంలో ఈ సినిమా నిర్మించాలనుకుని, షూటింగు మొదలుపెట్టిన రోజే దానికి మంగళం పలికారు. ‘రాజ్‌’ చిత్రాన్ని పూర్తిచేయలేక పోయిన నిరంజన్‌ చేయి జారిన మరో సినిమా ఇది. ‘మోతీ కి మోసి’ అనే మరో సినిమాను తనూజ హీరోయిన్‌గా తీద్దామని ప్లాన్‌ చేసిన గురుదత్‌, నిరంజన్‌ మరణంతో ఆ సినిమా నిర్మాణానికి స్వస్తి పలికారు. లేఖ్‌ టాండన్‌, షమ్మీకపూర్‌ హీరోగా నిర్మించిన ‘ప్రొఫెసర్‌’ సినిమా గురుదత్‌ తీయాలనుకున్నదే. కిషోర్‌ కుమార్‌, వహీదా రెహమాన్‌ జంటగా ఈ చిత్రాన్ని నిర్మించాలని రచయిత అబ్రార్‌ ఆల్వి చేత స్క్రిప్టు తయారు చేయించారు గురుదత్‌. అబ్రార్‌ ఆల్వి నే దర్శకత్వం వహించమని కోరారు. అతడు ససేమిరా అనడంతో శశి భూషణ్‌ చేత తీయిద్దామనుకున్నారు. కాలం కలిసి రాలేదు. ఆ స్క్రిప్టు లేఖ్‌ టాండన్‌కు అందించారు. షమ్మీకపూర్‌ నటించిన ఈ చిత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది. గురుదత్‌ తలపెట్టిన మరో అసంపూర్తి చిత్రం ‘పిక్నిక్‌’. ఇందులో గురుదత్‌, సాధనా జంటగా నటించాల్సి ఉంది. సంగీత దర్శకుడు ఎన్‌. దత్తా చేత మహమ్మద్‌ రఫీ, ఆశాభోస్లే ఆలపించిన రెండు డ్యూయట్లు కూడా రికార్డు చేయించారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో ఈ సినిమా కూడా వెలుగు చూడలేదు.
వ్యక్తిగత జీవితం…
‘బాజీ’ చిత్రాన్ని నిర్మించే సమయంలో గురుదత్‌ గాయని గీతాదత్‌ (అసలుపేరు గీతారారు చౌదరి) తో ప్రేమలో పడి ఆమెను 1953లో పెళ్లాడారు. ఇరు కుటుంబాల నుంచి వచ్చిన వ్యతిరేకత వలన వారి ప్రేమ ఫలించి పెళ్లి దాకా వచ్చేందుకు మూడు సంవత్సరాలు పట్టింది. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే అన్యోన్యంగా సాగుతున్న వీరి సంసారంలో వహిదా రెహమాన్‌ రూపంలో తుపాన్‌ చెలరేగింది. వహిదాతో గురుదత్‌ ప్రేమాయణం గీతాదత్‌కు తెలియడంతో ఆమె పిల్లలను తీసుకుని వేరే ఇంటికి మారిపోయింది. భార్యాపిల్లలు దూరమవ్వడం.. ప్రేమించిన వహిదాను మరచిపోలేక.. మద్యానికి బానిసవ్వడమే కాకుండా మోతాదుకు మించి నిద్ర మాత్రలకు అలవాటయ్యాడు. గురుదత్‌ సెట్స్‌లో ఎంత క్రమశిక్షణ పాటించేవాడో, వ్యక్తిగత జీవిత విషయానికొస్తే సిగరెట్లు అధికంగా కాల్చేవాడు, మద్యం అధిక మోతాదుల్లో సేవించేవాడు. ఈ అలవాట్లతో ఆరోగ్యం పాడుచేసుకున్న గురుదత్‌ కేవలం 39 ఏళ్ళకే 1964 అక్టోబరు 10న అద్దె ఇంటిలో ‘సాహిబ్‌ బీబీ అవుర్‌ గులామ్‌’, ‘చౌద్వి కా చాంద్‌’ చిత్రాల విజయాన్ని చవిచూడకుండానే అర్థాంతరంగా తనువు చాలించాడు. గురుదత్‌ మరణాన్ని చిత్రరంగం మాత్రం ఆత్మహత్యగా నిర్ధారించింది. అయితే గురుదత్‌ తనయుడు అరుణ్‌దత్‌ తెలిపిన వివరాల ప్రకారం గురుదత్‌ది ఆత్మహత్య కాదని, కేవలం ప్రమాదవశాత్తు జరిగిన మరణమేనని తెలిపాడు. ఎందుకంటే గురుదత్‌ చనిపోయిన మరుసటిరోజు రాజ్‌కపూర్‌, మాలాసిన్హాలతో ‘బహారే ఫిర్‌ భి ఆయేంగీ’ సినిమా గురించి గురుదత్‌ చర్చలు జరపాల్సి వుంది. గురుదత్‌ మరణించే సమయంలో అతడు రెండు సినిమాలను నిర్మించేందుకు సన్నాహాలు పూర్తి చేసుకున్నాడు. మొదటిది సాధనా హీరోయిన్‌గా ‘పిక్నిక్‌’ సినిమా, రెండవది దర్శకుడు కె. ఆసిఫ్‌తో నిర్మించాల్సిన ‘లవ్‌ అండ్‌ గాడ్‌’ చిత్రం. ‘పిక్నిక్‌’ సినిమా నిర్మాణం ఆగిపోగా, ‘లవ్‌ అండ్‌ గాడ్‌’ సినిమా మాత్రం ఇరవై ఏళ్ల తరువాత సంజీవ్‌ కుమార్‌ హీరోగా విడుదలైంది. గురుదత్‌ చివరి ఘడియల్లో మాట్లాడింది గాయని ఆశాభోస్లేతో. తన భార్య ఎలావుందని అడిగిన మాటలే అతని చివరి మాటలుగా మిగిలాయి. గురుదత్‌ మరణించిన ఎనిమిదేళ్లకే భార్య గీతాదత్‌ కూడా 1972లో కేవలం 41 సంవత్సరాల వయసులోనే మరణించడం మరో దురదష్ట సంఘటన. గీతాదత్‌ కూడా అధిక మోతాదులో మద్యం తీసుకోవడం వలన కాలేయం చెడిపోయి మరణానికి దగ్గరైంది.
గురుదత్‌ జీవితంపై పుస్తకాలు, డాక్యుమెంటరీ
గురుదత్‌ ప్రతిభను గుర్తిస్తూ దూరదర్శన్‌ 2011లో ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అలా చిన్న వయసులోనే అద్భుత చిత్రాలు నిర్మించి, నేల రాలిన గురుదత్‌ పై అరుణ్‌ కోపకర్‌ ‘గురుదత్‌ ఏ ట్రాజెడీ ఇన్‌ త్రీ యాక్ట్స్‌’, సత్య సరన్‌ ‘ది ఈయర్స్‌ విత్‌ గురుదత్‌ అబ్రార్‌ ఆల్విస్‌ జర్నీ’, యాసిర్‌ ఉస్మాన్‌ ‘గురుదత్‌ ఆన్‌ అన్‌ఫినిష్డ్‌ స్టోరీ’, అరుణ్‌ వాసుదేవ్‌ ‘గురుదత్‌ ది లెజెండ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’, తెలుగులో ఇటీవల ప్రముఖ రచయిత్రి పి. జ్యోతి ‘గురుదత్‌ ఓ వెన్నెల ఏడారి’ పేరుతో దాదాపు అయిదుకు పైగా పుస్తకాలు ఆయన జీవిత చరిత్రపై వెలువడ్డాయి.
-పొన్నం రవిచంద్ర,
9440077499