– డాక్టర్ మల్లయ్య భట్టు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మెరిట్ ప్రకారమే మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయాల సంస్థలో సీట్లు కేటాయిస్తున్నామనిసంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్య భట్టు ఒక ప్రకటనలో తెలిపారు. సీటు రానివారు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలనీ, కార్యాలయాలు, పాఠశాలల చుట్టూ తిరగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. 5, 6, 7, 8వ తరగతులతోపాటు, ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సుల్లో 2023- 24 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో వచ్చిన మార్కులు / మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. మొదటి , రెండో, విడత, మూడవ విడత ప్రవేశాలు ముగిసిన తరువాత ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి సీటు కేటాయించనున్నట్టు తెలిపారు.
ప్రవేశపరీక్ష రాసినా మెరిట్ రానివారు, ప్రవేశ పరీక్ష రాయలేకపోయిన వారు సీట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్‌లైన్‌లో https://mjptbcwreishms.cgg.gov.in దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
సీటు రానివారు హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలోకానీ, ఆర్‌సీఓ కార్యాలయంలో కానీ.. పాఠశాలల్లో గానీ ఎలాంటి దరఖాస్తులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన సూచించారు. వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్నవారికే సీట్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎవరైనా సీట్లు ఇప్పిస్తామని చెప్పితే వారి మాట నమ్మొద్దనీ, అలా చెప్పిన వారి వివరాలు 040-23120496 ద్వారా తెలియజేయాలని ఆయన కోరారు. సీట్లు ఇప్పిస్తామని తల్లిదండ్రులను, విద్యార్థులను మోసం చేసేవారి పై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుంటామని హెచ్చరించారు.