– రూ. 30 నుంచి రూ.50 వేల వరకు వసూలు
– సీట్లను అమ్ముకుంటున్న ఉపాధ్యాయులు
– ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం
నవతెలంగాణ-మిర్యాలగూడ
పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. గురుకులాలలో పనిచేసే ఉపాధ్యాయులు సీట్లను అమ్ముకొని లక్షలు ఆర్ధిస్తున్నారు. అక్రమాలపై విద్యార్థి, ప్రజా సంఘాలు ఫిర్యాదు చేసిన అధికారుల నుండి ఎలాంటి స్పందన లేదు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఖాళీ సీట్లను అమ్ముకున్నట్లు కాల్ రికార్డులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విద్యార్థినిల తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయులు డబ్బులు డిమాండ్ చేసే కాల్ రికార్డులు వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై తెలంగాణ గిరిజన సంఘం నాయకులు ఉన్నత అధికారులకు ఆధారలతో సహా ఫిర్యాదు చేశారు. వివరాలకు వెళితే…మిర్యాలగూడ పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలోని ప్రిన్సిపాల్ శారద మ్యాథమెటిక్స్ ఉపాధ్యాయురాలు పుష్ప ఇద్దరు కలిసి ఆ గురుకులంలో ఉన్న ఖాళీ సీట్లను అమ్ముకుంటున్నారు. ప్రతిభా ఆధారంగా గురుకులాలలో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ విద్యా సంవత్సరం మధ్యలో వెళ్లిపోయిన విద్యార్థులు ఇలా స్థానంలో కొత్తవారిని భర్తీ చేస్తుంటారు. అన్ని అర్హతలు ఉంటేనే ఉన్నతాధికారుల అనుమతి మేరకు సీట్లను భర్తీ చేయాలి. కానీ ఆ గురుకుల పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులు అవినీతి అక్రమాలకు తెరలేపి వేలాది రూపాయలకు సీట్లను అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క సీటును 30 నుంచి 50 వేల వరకు అనుకుంటున్నారు. ఇప్పటికే ఆ పాఠశాలలో మూడు సీట్లు అమ్ముకోగా మరో సీటు అమ్ముకొని తల్లిదండ్రుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న కాల్ రికార్డ్ వైరల్ అవుతుంది. తుంగతుర్తిలో సీటు వచ్చినటువంటి 5 వ తరగతి విద్యార్థిని కే.అక్షర మిర్యాలగూడ బాలికల గురుకుల పాఠశాలలో బదిలీ చేయుటకు విద్యార్థిని తండ్రి కే.స్వామి ద్వారా ఉపాధ్యాయురాలు పుష్ప 33 వేల రూపాయలు అడిగిన విషయాన్ని ఫోన్ రికార్డులు వెలుగులోకి వచ్చాయి. నేరుగా తల్లిదండ్రులను డబ్బులు తీసుకొని సీట్లు కేటాయిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. నేరుగా తల్లిదండ్రుల నుండి డబ్బులు తీసుకొని సీట్లు కేటాయిస్తున్నారని స్పష్టమవుతుంది. తాము చెప్పిన టైం లోపు డబ్బులు చెల్లిస్తేనే సీటు ఉంటుందని లేకుంటే వేరే వారికి కేటాయిస్తామని చెప్పి బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఇందులో మ్యాథమెటిక్స్ టీచర్ పుష్ప భర్త కీలకంగా వ్యవహరించినట్లు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గిరిజన సంఘం నాయకులు ఉపాధ్యాయులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానం చెప్పడంతో పాటు పైగా పుష్ప భర్త పాఠశాల లోపలికి వచ్చి అంతే అమ్ముకుంటాము ఏం చేసుకుంటావో చేసుకో పో అని దబాయిస్తున్నట్లు గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఈ విషయాన్ని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి నాయక్ రాష్ట్ర గురుకులం సెక్రటరీ డాక్టర్ నవీన్ నికోలాస్ దష్టికి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపించి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రకంగా గిరిజన గురుకుల పాఠశాలలో ప్రతి సంవత్సరం 7 లక్షల నుంచి 10 లక్షల వరకు సీట్ల నమ్మకం ద్వారా ప్రిన్సిపాల్ ఇతర సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు.