తెలంగాణ ఉద్యమ సమయంలో ‘కేజీ నుండి పీజీ ఉచిత విద్య’ అందరికీ సమానంగా అందాలనే డిమాండ్‌తో పోరాటం జరిగింది. ‘ప్రత్యేక రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలను మేము నెరవేరుస్తామని’ అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం ‘కేజీ నుండి పీజీ’ విధానంలో భాగంగా నాణ్యమైన విద్యతో పాటు, అన్ని వసతులతో గురుకులాలను తీసుకొస్తున్నామని ప్రకటించింది. ‘కార్మికుల పిల్లలైన, కలెక్టర్ పిల్లలైన ఒకే తరగతి గదిలో చదువుకునే కామన్ స్కూల్ విద్యా విధానం మా లక్ష్యం’ అని వాగ్దానం చేసింది. కొద్దిమందికైనా ఏర్పాటు చేసిన గురుకులాలకు తగిన నిధులు కేటాయించకపోవడంతో అవన్నీ కూడా నేడు సమస్యలకు నిలయాలుగా మారాయి. ఖాళీల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అయితే గత సర్కార్ చేసిన తప్పిదాలు, నెరవేర్చని హామీల పట్ల ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం కనినిస్తున్నది. ఎందుకంటే, ప్రస్తుతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ గురుకులాలు ఆయా సంక్షేమ శాఖల పరిధిలో కొనసాగుతుండగా.. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీజీఆర్‌ఈఐఎస్) నేరుగా పాఠశాల విద్యా శాఖ పరిధిలో కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకుల సొసైటీల పరిధిలో 1022 గురుకులాలుండగా, వీటిలో ఐదు నుంచి ఇంటర్‌వరకు 6,18,880 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిల్లో సుమారు 13వేల మంది టీజీటీ, పీజీటీ, స్థాయి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో గురుకులాల్లో కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టాయిలెట్లు, బాత్రూమ్‌లు లేవు. ఉన్న కాసిన్ని కూడా మరమ్మతులకు నోచుకోక నానా తంటాలు పడుతున్నారు. కాలకృత్యాలు కూడా సరిగా తీర్చుకోకుండా, రెండు మూడు రోజులకోసారి స్నానం చేస్తూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఒక్కో గురుకుల విద్యాసంస్థలో 640 మంది విద్యార్థులుంటారు. ఐదు నుంచి పదివరకు 480 మంది విద్యార్థులు కాగా.. ఇంటర్మీడియట్‌లో 160మంది ఉంటారు. గురుకుల పాఠశాల వసతుల్లో భాగంగా కనీసం పదిమంది విద్యార్థులకు ఒక బాత్రూం, కనీసం ఏడుగురికి ఒక టాయిలెట్ ఉండాలనేది నిబంధన. ఈ లెక్కన ఒక్కో గురుకుల పాఠశాలలో 64 బాత్రూమ్‌లు, 90 టాయిలెట్లు ఉండాలి. కనీసం పది మందికి ఒకటి చొప్పున ఉన్నా సర్దుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ చాలా చోట్ల 1:20 నిష్పత్తిలో కూడా లేవు. గురుకుల విద్యాసంస్థల్లో బాత్రూమ్‌లు, టాయిలెట్ల పరిస్థితి తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద 29 గురుకులాల్లో వివరాలను సేకరించగా, ఆ 26 గురుకులాలు, 3 కేజీబీవీలలో ప్రస్తుతం 15136 మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. వారికి 1,513 బాత్రూంలు అవసరమవగా. 870 మాత్రమే ఉన్నాయి. 1:10 నిష్పత్తిలో లెక్కించినా.. 644 బాత్రూమ్‌లు తక్కువగా ఉన్నాయి. ఇక 2,162 టాయిలెట్లు అవసరంకాగా. 1,104 మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ తలుపులు సరిగా లేనివి, నిర్వహణ సరిగాలేక పాడైపోయినవి ఎక్కువే. దీంతో వీలు చిక్కినప్పుడే స్నానాలు చేస్తున్నామని.. కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎక్కువకాలం ఇలాగే కొనసాగితే వారి ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్నది వాస్తవం. శాశ్వత ప్రాతిపదిన ఉన్న గురుకులాల్లో కంటే.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటిలో ఈసమస్య మరింత తీవ్రంగా ఉంది.
అద్దె భవనాల్లో అవస్థలెన్నో?
850 గురుకులాలకు సొంతభవనాలే లేవు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వాటిలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా వసతులు కల్పించలేదు. కిటీకీలు, డోర్లు సరిగా లేవు. పుస్తకాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు, కంప్యూటర్లు కానరావు. బోధన,బోధనేతర సిబ్బంది సరిపడా లేరు. పంటపొలాల నడుమ ఏర్పాటు చేసిన హాస్టళ్లలో కనీసం ప్రహరీ నిర్మించకపోవడం మూలాన అనేకచోట్ల విద్యార్థులు విషసర్పాల కాటుకు గురవుతున్నారు. పారిశుధ్యం లోపించి దోమలతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారు. బెంచీలు కూడా లేకపోవడంతో కింద కూర్చుని చదువుకుంటున్న కాలేజీలు విద్యార్థులున్నారు. చాలాచోట్ల తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే వుంది. ‘ఒంటికి, రెంటికి’ బాత్రూమ్స్ లేక ఆరుబయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. స్వేచ్ఛ వాతావరణంలో ఆనంద నిలయాలుగా మారి సృజనాత్మకంగా విజ్ఞానం వైపు అడుగులు వేయా ల్సిన గురుకులాలు నిర్బంధ కేంద్రాలుగా మారాయని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మార్చిన టైం టేబుల్ కూడా శాస్త్రీయంగా లేకపోగా, విద్యార్థులపై తీవ్రమైన మానసిక ఒత్తిడి పడుతున్నది. ఫలితంగా శారీరక అనారోగ్యానికి గురైవిద్యార్థుల డ్రాపౌట్లు పెరుగుతున్నాయి. గురుకుల విద్య మీద అనేక ఆశలు పెట్టుకున్న పేదవిద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురుకులాల్లో ఉండే భయానక పరిస్థితుల మూలంగా చాలామంది సీటు సంపాదించుకున్నప్పటికీ విద్యార్థులు క్యాంపస్ వాతావరణంలో ఉండే సమస్యలను చూశాక ఇంటికి తిరుగుముఖం పడుతున్నారు. ఫలి తంగా అన్ని గురుకులాల్లో కలిపి సుమారు లక్షా 22వేల విద్యార్థుల ఖాళీలున్నాయి.
ఖాళీలను భర్తీ చేసేదెప్పుడు?
రాష్ట్రంలో ఏ ఇతర శాఖలో పోస్టుల భర్తీ చేపట్టినా.. సంక్షేమ గురుకుల సొసైటీల్లోని ఉపాధ్యాయ ఉద్యోగాల్లో బ్యాక్‌లాగ్‌లు పెరుగు తున్నాయి. ఇప్పటికే నియామకాల్లో అవరోహణ క్రమం పాటించకపోవడంతో దాదాపు 1800కి పైగా ఖాళీలు వచ్చినట్లు సమాచారం. తాజాగా పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ కింద 11,062 పోస్టుల భర్తీ చేసింది. దీంతో అన్ని సొసైటీల్లో కలిపి దాదాపు 1,800 వరకు వివిధ కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. మరోవైపు ప్రభుత్వ కళాశాలల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరి శీలన పూర్తయి, నియామకాలు జరిగితే ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది? గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనాభ్యసన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆహ్లాదకరమైన తరగతి గదులు, మౌలిక వసతులు, ఉపాధ్యాయులకు స్టాఫ్ క్వార్టర్స్ కల్పించడం ద్వారా గురుకులాల్లో సరైన బోధనా వాతావరణన్ని సృష్టించగలుగుతారు. ఆరోగ్యకరమైన పని పరిస్థితుల ద్వారానే ఉపాధ్యాయులు సక్రమంగా, నాణ్యమైన బోధన చేయగలుగుతారు. అయితే మెజారిటీ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఫ్యామిలీ క్వార్టర్స్ లేకపోవడంతో వాళ్లు దూరప్రాంతాల నుంచి రావడం, మహిళా ఉపాధ్యాయులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం తరచూ జరుగుతున్నవే. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు, పాఠశాలల్లో పనిచేసే టీచర్స్‌కు కొంత వ్యత్యాసం ఉంటుంది. దానికి తగినట్టుగా కూడా పేస్కేల్‌లో మార్పులు చేసి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉన్నది. సమగ్రంగా ఆలోచించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచించి రొటీన్ ఉద్యోగాల వల్లే గురుకుల ఉద్యోగాలను ట్రీట్ చేయడం సరికాదు. ఖాళీల సంఖ్య పెరిగితే ఆ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై పనిభారం పెరిగి బోధనా ప్రమాణాలు పడిపోతాయన్న విషయం మరవకూడదు.
ఆనంద నిలయాలుగా మార్చాలి
ఉపాధ్యాయ వృత్తి అనేది గౌరవప్రదమైనది. ఈ వృత్తిలోకి సమాజంలో ప్రతిభావంతుడైన యువకులను ఆకర్షించడానికి మిగతా ఉద్యోగాల కన్నా జీతభత్యాలు ఎక్కువగా చెల్లించాలి. అప్పుడే ప్రతిభావంతులైన యువకులు ఈ ఉద్యోగంలోకి ఆకర్షింపబడుతారన్న కొఠారి కమిషన్ సిఫార్సును గమనంలోకి తీసుకోవాలి. ఉపాధ్యాయుల ఖాళీలు లేకుండా చూడాలి. పటిష్టమైన పర్యవేక్షణా చర్యలు తీసుకోవడంతోపాటు, శాశ్వత భవనాలు నిర్మించి, విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి. అనేక ఆశలతో గురుకులాల్లో చేరిన విద్యార్థులు వాటిని వీడకుండా, ఖాళీలు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానిదే. రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరిస్తూ, అన్ని పాఠశాలలను గురుకులాలుగా మార్చే దిశలో ప్రభుత్వం ఆలోచించాలి. చదువుకునే ప్రతి విద్యార్థికి ప్రవేశ పరీక్ష లేకుండా ప్రవేశాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. స్వేచ్ఛా వాతావరణంలో ఆనంద నిలయాలుగా మారి సృజనాత్మకంగా విజ్ఞానం వైపునకు అడుగులు వేయాల్సిన గురుకులాలు నిర్బంధ కేంద్రాలుగా మారకూడదు. తద్వారా మాత్రమే తెలంగాణ విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందించే అవకాశముంది.
కె.వేణుగోపాల్
9866514577