భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత విశిష్టమైనది

– శ్రీ విద్యా భారతి పాఠశాల కరస్పాండెంట్ చేపూరి కృష్ణయ్య
నవతెలంగాణ – తుంగతుర్తి
భారతీయ సంస్కృతిలో గురువు స్థానం అత్యంత విశిష్టమైనదని,సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని శ్రీవిద్యా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ చేపూరి కృష్ణయ్య అన్నారు. గురువారం సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.ఈ మేరకు ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి రాష్ట్రపతి పదవి వరకు అంచెలంచెలుగా ఎదిగిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవితం నేటి యువతకు ఉపాధ్యాయులకు మార్గదర్శకం అంటారు.దేశానికి, విద్యారంగానికి రాధాకృష్ణన్ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ సమాజంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా గౌరవింపబడే వృత్తి ఉపాధ్యాయ వృత్తి అన్నారు.వేద కాలం నుండి నేటి వరకు తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే అన్నారు.విద్యార్థులను అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు నడిపించే వాడే గురువు అన్నారు.విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి,వారు ఎంచుకున్న రంగంలో రాణించేలా ఉపాధ్యాయులు చేస్తున్న కృషి మరువలేనిది అన్నారు. సమాజం, జాతి నడవడికకు, పురోగతికి, శ్రేయస్సుకు మార్గదర్శనం ముమ్మాటికి గురువే అన్నారు.తొలి ఉపరాష్ట్రపతి మలి రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం భావితరాలకు గుర్తుండిపోయేలా గురుపూజోత్సవం జరుపుకుంటున్న ఉపాధ్యాయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మల్లయ్య, డైరెక్టర్ వెంకటగోపాల్, నజీరుద్దీన్ ఉపాధ్యాయ బృందం అంబటి రమేష్, లింగమూర్తి, సురేష్, ఈరోజి, సరిత, స్వప్న, మున్ని, ఉమ, అనిత, సునీత, రాధ, ఉమ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.