
నవతెలంగాణ నల్లగొండ కలెక్టరేట్ : తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా అమిత్ రెడ్డి నియామకం అయ్యారు. అమిత్ రెడ్డిని డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అమిత్ రెడ్డి ఈ పదవిలో రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారని శాంతి కుమారి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గుత్తా అమిత్ రెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు. గుత్తా సుఖేందర్ రెడ్డి చాలా కాలం పాటు మదర్ డైరీ చైర్మన్ గా పనిచేశారు. మదర్ డైరీ లో గుత్తా సుఖేందర్ రెడ్డి హవా చాలా కాలం పాటు కొనసాగింది. సుఖేందర్ రెడ్డి అనంతరం ఆయన సోదరుడు కూడా చాలా కాలం పాటు మదర్ డైరీ చైర్మన్ గా పనిచేశారు. శాసనసభ ఎన్నికలు ముగిసిన అనంతరం అమిత్ రెడ్డి బి ఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్లకు చెందిన అమిత్ రెడ్డికి రాజకీయంగా ఇదే తొలి పదవి. గుత్తా అమిత్ రెడ్డికి కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం పట్ల గుత్తా అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.