ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు

As Election Commissioners Gyanesh Kumar Sukhbir Singh Sandhu– మాజీ ఐఏఎస్‌లను ఎంపిక చేసిన ప్రధాని నేతృత్వంలోని ప్యానెల్‌
న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం నూతన ఎలక్షన్‌ కమిషనర్లుగా మాజీ ఐఏఎస్‌లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్‌బిర్‌ సింగ్‌ సంధులు ఎంపికయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ఉన్నతస్థాయి కమిటీ వీరిద్దరిని ఎంపిక చేసింది. ప్రధాని నేతృత్వంలోని ప్యానెల్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా, అధిర్‌ రంజన్‌ చౌదరీలు ఉన్నారు. ఎన్నికల కమిషన ర్‌గా ఎంపికైనా మాజీ బ్యూరోక్రాట్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ 1988 బ్యాచ్‌ కేరళ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి ఆయన కేంద్ర సహకార శాఖ కార్యదర్శిగా కూడా పని చేశారు.
ఎంపిక తీరును ప్రశ్నించిన అధిర్‌
కాగా, ఎంపిక ప్రక్రియను ప్యానెల్‌లో ప్రతిపక్ష సభ్యుడు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు అధిర్‌ రంజన్‌ చౌదరీ ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్లుగా షార్ట్‌ లిస్ట్‌ అయిన అధికారుల పేర్లు తనకు ముందుగానే అందించలేదని ఆయన ఆరోపించారు. ఉన్నతస్థాయి సమావేశం ముగిసిన వెంటనే అధిర్‌ రంజన్‌ చౌదరి తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఎంపిక కోసం ఆరుగురు పేర్లు ప్యానెల్‌ ముందుకు వచ్చాయనీ, సుఖ్‌బీర్‌సింగ్‌ సంధు, జ్ఞానేశ్‌ కుమార్‌ పేర్లను హైపవర్‌ ప్యానెల్‌లోని మెజారిటీ సభ్యులు ఖరారు చేశారని చెప్పారు. అయితే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సెలక్షన్‌ ప్యానెల్‌లో ఉండాల్సిందనీ, న్యాయశాఖ మంత్రి నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీ ముందు వచ్చినట్టు చెప్తున్న 200 మంది అభ్యర్థుల నుంచి ఆరుగురు పేర్లను ఎలా షార్ట్‌ లిస్ట్‌ చేశారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్రం తనకు అనుకూలమైన పేర్లను ఎంపిక చేసుకునేలా చట్టాన్నీ చేసిందనీ, సీజేఐ జోక్యాన్ని నివారించిందనీ, ఈ విధానంలో కొన్ని లోపాలున్నాయని అధిర్‌ రంజన్‌ చౌదరీ ఆరోపించారు.