జిమ్నాస్టిక్స్‌ను నాశనం చేశారు!

Gymnastics is ruined!– సారు రూల్స్‌పై దీప కోచ్‌ నంది ఆగ్రహం
న్యూఢిల్లీ : భారత జిమ్నాస్టిక్స్‌ను నాశనం చేస్తున్నారు. జీవితంలో ఏ ఒక్క అథ్లెట్‌కు శిక్షణ ఇవ్వని వ్యక్తులు సైతం క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేకుండా నిబంధనలు రూపొందిస్తున్నారు. అర్థ రహిత రూల్స్‌ కారణంగా అత్యుత్తమ జిమ్నాస్టిలు ఆసియా క్రీడల్లో పోటీపడలేని దుస్థితి వచ్చిందని స్టార్‌ జిమ్నాస్ట్‌ దీప కర్మాకర్‌ కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం మూడు గంటల పాటు కఠోర సాధన చేసిన అనంతరం కన్నీంటి పర్యంతమైన దీప కర్మాకర్‌.. ఆసియా క్రీడల జట్టులో చోటు దక్కకపోయినా.. సాధన కొనసాగిస్తానని కోచ్‌తో తెలిపింది.
దీపపై వేటు : రియో ఒలింపిక్స్‌లో పతకానికి అత్యంత చేరువగా ఆగిపోయిన దీప కర్మాకర్‌.. డోపింగ్‌ నిషేధం కారణంగా గత రెండేండ్లు పోటీలకు దూరమైంది. తాజాగా నిషేధం ఎత్తివేయటంతో భువనేశ్వర్‌లో జరిగిన జాతీయ సెలక్షన్‌ ట్రయల్స్‌కు హాజరైంది. ట్రయల్స్‌లో దీప కర్మాకర్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఆసియా క్రీడల భారత జట్టులో చోటు దక్కించుకుంది. కానీ భారత జిమ్నాస్టిక్స్‌ సమాఖ్య పంపించిన జాబితా నుంచి దీప కర్మాకర్‌ పేరును భారత క్రీడా ప్రాధికార సంస్థ (సారు) అధికారులు తొలగించారు. నూతన నిబంధనల ప్రకారం 2018 జకర్తా ఆసియా క్రీడల్లో ఎనిమిదో స్థానంలో నిలిచిన జిమ్నాస్ట్‌తో సమానమైన ప్రదర్శన చేయాలి. గత ఏడాది కాలంలో చేసిన ప్రదర్శనను ఇందుకు ప్రామాణికంగా తీసుకుంటారు. సెలక్షన్‌ ట్రయల్స్‌లో దీప కర్మాకర్‌ సాధించిన స్కోరు పరిగణనలోకి తీసుకుంటే.. అంతకంటే మెరుగ్గానే ఉంది. కానీ సారు అధికారులు దీప కర్మాకర్‌ గత ఏడాది కాలంలో ఎటువంటి పోటీల్లో పాల్గొనలేదనే కారణంగా ఆమెను జట్టు నుంచి తప్పించారు.
దీప కర్మాకర్‌ను ఆసియా క్రీడల జట్టు నుంచి తప్పించటంపై భారత జిమ్నాస్టిక్‌ సమాఖ్య బాధ్యత నుంచి తప్పుకుంది. ‘జాతీయ ట్రయల్స్‌కు ముందు సారు రూల్స్‌ విస్పష్టంగా లేవు. వాటిని ఏ విధంగానైనా అన్వయించుకోవచ్చు. దీప కర్మాకర్‌ ఆసియా క్రీడలకు అర్హత సాధించిందనే అనుకున్నాం. కానీ, క్రీడాశాఖ తీసుకున్న నిర్ణయాన్ని మేము సవాల్‌ చేయలేమని’ జిఎఫ్‌ఐ అధ్యక్షుడు సధీర్‌ మిట్టల్‌ తెలిపారు. ఆసియా క్రీడల్లో దీప కర్మాకర్‌ పతకం సాధించగల అథ్లెట్‌. పోటీల్లో ఆమె అత్యుత్తమ ప్రదర్శన చేయగలదని దీప ప్రాక్టీస్‌ చూసిన వాళ్లు ఎవరైనా చెప్తారు. దీప కర్మాకర్‌ను ఎంపిక చేసేందుకు ఇంకా సమయం ఉంది. క్రీడాశాఖ మంత్రి ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని బిశ్వేశ్వర్‌ నంది పేర్కొన్నారు.