హైదరాబాద్ నగరంలో పాతబస్తీలోని కార్వాన్ ప్రాంతంలో 170 ఏండ్ల కిందట ఏర్పాటు చేయబడిన ఒక అపురూపమైన మాస్క్రిప్స్ గ్రంథాలయం, పరిశోధనా కేంద్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
1854లో (1270 హజరత్) వతాద్-ఇ – దక్కన్ హజరత్ సయ్యద్ అబ్దుల్లా షా ఖాద్రి. ఇతను సేకరించిన 100 పుస్తకాలతో హది-ఈ-దక్కన్ లైబ్రరీ అనే గ్రంథాలయాన్ని ప్రారంభించారు. వీరి పూర్వీకులు సయ్యద్ అబ్దుల్ లతీఫ్ సిరియా నుండి భారతదేశానికి వలస వచ్చారు. కర్నూల్‌లోని ఆదోని ప్రాంతంలో కొంతకాలం నివసించిన తర్వాత హైదరాబాద్‌కు వచ్చేశారు. వీరి తర్వాత సయ్యద్ అబ్దుల్ రజాక్ ఖాద్రి 700 పుస్తకాలు సేకరించి గ్రంథాలయాన్ని దినదినాభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు. వీరి తర్వాత డాక్టర్ సయ్యద్ మోహియుద్దీన్ ఖాద్రీ (పత్తరు వాలే సాహెబ్) గ్రంథాలయంలోని పుస్తకాలు, రాత ప్రతుల సంఖ్య 80 వేలకు పెరిగింది. 2006లో వీరి మరణం తర్వాత డాక్టర్ సయ్యద్ మొహిమిన్ ఖాద్రి ఈ గ్రంథాలయాన్ని పరిశోధన కేంద్రంగా ఉన్నతీకరించారు.
ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో పుస్తకాలన్నీ కలిసి సుమారు 1,76,000 వరకు ఉంటాయి. వాటిలో 6 వేల మాన్ స్క్రిప్స్, 50 వేల ముద్రణా పుస్తకాలు, దాదాపు 20వేల మ్యాగజైన్లు, 1000 వరకు ఇంగ్లీష్, ఉర్దూ, ఇంగ్లీష్ అరబిక్, ఇంగ్లీష్ పారశిక నిఘంటువులు, 1000 పరిశోధన సిద్ధాంత గ్రంథాలు (పీహెచ్డీ, ఎంఫిల్) ఉన్నాయి.
గ్రంథాలయ ప్రధాన ఉద్దేశం: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అరబిక్, పర్షియన్ భాషలలో ఉన్న విజ్ఞాన సంపదను (పుస్తకాలను) ఉర్దూ భాషలోకి తర్జుమా చేసి వాటిని ముద్రించి పరిశోధకులకు, పాఠకులకు అందుబాటులోకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. అరబిక్, పర్షియన్, ఉర్దూ, దక్కన్, ఒరిస్సా, చైనీస్, జపనీస్, కాశ్మీరీ, మలయాళం, తెలుగు, కన్నడ, మరాఠీ, పంజాబీ భాషలలో కూడా మాన్ స్క్రిప్ట్స్, ముద్రణ పుస్తకాలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా సంస్కృతంలోని మాన్ స్క్రిప్ట్స్ పేపర్, పామ్ లీవ్స్, పార్చ్మెంట్‌లోనూ కలవు.
ఈ గ్రంథాలయంలో చెప్పుకోదగ్గవి 700 ఏండ్ల కాలం నాటి అరబిక్ మాన్ స్క్రిప్ట్స్. వీటితో పాటు కులియత్ జామి, కులియత్ హఫీజ్, మిష్ కా తుల్ నభువా (600 సూఫీస్ చరిత్రలు ఈ పుస్తకంలో కలదు).
ఖానే యగ్ మా – ఫస్ట్ డిక్షనరీ పోయెట్రీ ఇన్ ఉర్దూ, 1752 కాలం నాటి వకీయత్ – యి – మఖమిలిన్(పర్షియన్), 1752 కాలం నాటి వకీయత్ – యి – మఖమిలిన్ పర్షియా భాష నుండి ఉర్దూలోకి తర్జుమా చేశారు. 1641 కాలం నాటి ఖ్వాన్- యి – యగ్ మీ మొట్టమొదటి ఉర్దూ భాషలో డిక్షనరీ. 1905 నాటి యా జిలాని మనకితే – ఈ – అజం ఉర్దూ భాషలోని పోయెట్రీ. 1905 కాలం నాటి గియా గాన్స్- ఈ – సమ్ దాని, 1659 కాలం నాటి కాన్జ్ – ఉన్- నఫీజ్ (పోయెట్రీ), 1641 కాలం నాటి అనేక పారశీక పుస్తకాలను ఉర్దూ భాషలోకి తర్జుమా చేశారు. 1941 నాటి రాV్‌ా ఈ జన్నత్, 1947 నాటి గుల్షన్ ఈ నాస్ పుస్తకాలే కాకుండా భగవద్గీతను సంస్కృతం నుండి పారశీలోకి, పారశీ నుండి ఉర్దూలోకి తర్జుమా చేశారు. అరబ్బీలో ఉన్న ఖురాన్‌ను ఉర్దూలోకి తర్జుమా చేశారు.
ఖుదా, హుమా, మారిప్ వంటి పురాతనమైన ఎనిమిది వందల రకాల జర్నల్స్ బైండ్ చేసి పరిశోధకులకు అందుబాటులో ఉంచారు. 230 సంవత్సర కాలం నాటి పుత్ హల్ గయబ్ అనే అరబిక్ చేతి రాతప్రతులు సైతం అందుబాటులో ఉన్నాయి. వాటిని జిరాక్స్ చేసి సయ్యద్ అబ్దుల్ జిలాని ఖాద్రి తర్జుమా చేశారు. వీరి కాలంలో దాదాపు 450 పుస్తకాలు పారశీక, అరబిక్ భాషల నుండి ఉర్దూలోకి తర్జుమా చేసి ముద్రించారు.
1830 నాటి పర్షియన్, వహేష్ కాశిఫ్ అక్లక్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు ఇండియా ఎట్ గ్లాన్స్, రీడర్స్ డైజెస్ట్, ఇండియా డైజెస్ట్ 1911 నుంచి 1984 వరకు బ్యాక్ వాల్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి. హిస్టరీ ఆఫ్ పెయింటింగ్స్-1911, బయోగ్రఫీ ఆఫ్ ఇందిరాగాంధీ, బయోగ్రఫీ ఆఫ్ బెనజీర్ భుట్టోతో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయ నాయకుల జీవిత చరిత్రలు ఉర్దూ భాషలో అందుబాటులో ఉన్నాయి. ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా, ఎన్సైక్లోపీడియా ఆఫ్ అమెరికానా దాదాపు నాలుగు వందల వాల్యూమ్స్ వరకు అందుబాటులో ఉన్నాయి
నిజాం కాలంనాటి వర్మానాలు ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన వివిధ కట్టడాల ప్లానింగ్స్, పెయింటింగ్స్, వంతెన నిర్మాణాలకు సంబంధించిన ప్లానింగ్స్, అనేక డ్రాయింగ్స్ ఉర్దూ, ఇంగ్లీష్ భాషలో అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు కౌటిల్యుని అర్థశాస్త్రం, మాక్స్ ఏంజిల్ రాజనీతి శాస్త్ర పుస్తకాలు అరబిక్, ఉర్దూ భాషలో తర్జుమా చేశారు.
ఆధ్యాత్మిక పుస్తకాలు: బౌద్ధం, జైనం సంబంధించిన పుస్తకాలు, భగవద్గీత, రామాయణం, ఖురాన్, బైబిల్ చేతి రాతప్రతులు ఇందులో ఉన్నాయి. ఇవి అరబిక్, ఉర్దూ భాషలో అందుబాటులో ఉన్నాయి.
ప్రిజర్వేషన్ కన్జర్వేషన్: ఈ విభాగంలో దాదాపు ప్రతి చేతి రాతప్రతులను, తాటి ఆకు ప్రతులను ఫ్యుమిగేషన్, ఇమిగేషన్ ద్వారా; అదేవిధంగా వివిధ రకాల ఆయుర్వేద రసాయనాలను ఉపయోగించి క్రిమి కీటకాలు పాడు చేయకుండా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు అన్ని రకాల ఒరిజినల్ మాన్ స్క్రిప్ట్స్లను జిరాక్స్ తీసి పరిశోధకులకు అందుబాటులో ఉంచుతున్నారు.
యూరప్, అమెరికా, ఆసియా, అరబ్ దేశాల నుండి ఈ గ్రంథాలయానికి పరిశోధకులు విచ్చేస్తుంటారు. రోజుకు ఐదు నుంచి పదిమంది పరిశోధకులు ఈ గ్రంథాలయంలో తమ పరిశోధన కొరకు తల మునకలవుతుంటారు. సాయంత్రం మూడు గంటల నుండి 7 గంటల వరకు గ్రంథాలయం పాఠకులకు అందుబాటులో ఉంటుంది. విదేశీ వ్యవహారాల అధికారులు ముఖ్యంగా ఇరాన్, ఇరాక్, సిరియా, చైనీస్ దేశాల వారు సందర్శించారు. ఈ గ్రంథాలయంలోని పుస్తకాలను, చేతి రాతప్రతులను భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుండి సేకరించారు. ముఖ్యంగా ఢిల్లీలోని సండే పుస్తకాల మార్కెట్, హైదరాబాదులోని చార్మినార్ పక్కన ఉన్న ముర్ గి చౌక్‌తో పాటు వివిధ రాష్ట్రాల పుస్తకాల ఎగ్జిబిషన్లు, పాత పుస్తకాల షాపు నుండి కొనుగోలు చేశారు. ఈ గ్రంథాలయ స్థాపకులు హజరత్ సయ్యద్ అబ్దుల్ షా ఖాద్రి 450 పుస్తకాలను వివిధ భాషల్లో అచ్చు వేశారు.
ఈ గ్రంథాలయం నుండి రహే హుధా అనే చేతిరాత ప్రతి మ్యాగజైన్ 1958 నుండి ప్రతినెల ఉర్దూ, అరబిక్ భాషలలో పాఠకులకు అందుబాటులో ఉంటుంది. ఆర్కిటెక్చర్, పెయింటింగ్స్, పరిపాలన శాస్త్రం, విద్య, ఉర్దూ నవలలు, కథల పుస్తకాలు, పొయెట్రీ, ఆధ్యాత్మిక, పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రంథాలయంలోని గ్రంథ సంపదను డిజిటల్ రూపంలోకి అనుసంధానం చేసి పరిశోధకులకు ఉర్దూ, అరబిక్, పారశిక భాషా ప్రియులకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇలాంటి అపురూపమైన గ్రంథ సంపద కలిగిన గ్రంథాలయాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సహకారం అందించి వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి.
డా||రవికుమార్ చేగొని