వడగండ్ల వర్షం

Hail rain– పొట్టదశలోనే వరికి తీవ్ర నష్టం
నవతెలంగాణ-విలేకరులు
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకోగా.. సాయంత్రం వేళ ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సిరికొండ, రామారెడ్డి, మద్నూర్‌ తదితర మండలాల్లో వడగండ్ల వాన హడలెత్తించింది. అరగంటపాటు భారీ వర్షం కురవడంతో జనజీవనం అతలాకుతలమైంది. వడగండ్ల వాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి పాలు పోసుకునే దశ, పొట్ట దశలో ఉండటంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. సిరికొండలో ఆరబెట్టిన ధాన్యం తడిచి కొట్టుకుపోయింది. వరి పైరు నేలవాలింది. గింజ రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.