వడగండ్ల వాన, గాలి బీభత్సం

వడగండ్ల వాన, గాలి బీభత్సం– తడిసిన మొక్కజొన్న, వరి : రైతులకు తీవ్ర నష్టం
నవతెలంగాణ-ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కొమరారం, పోలారం పంచా యతీల్లో శనివారం అకస్మాత్తుగా వడగండ్ల వాన కురిసింది. ఆరబోసిన వరి, మొక్కజొన్న పంటలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వడగండ్ల వాన, గాలుల బీభత్సంతో బొంబాయి తండా, పులి తండాలలో బానోతు బద్రు, లాల్‌ సింగ్‌, బోడపట్ల సొందుల రేకుల కప్పులు లేచిపోయాయి. పోలారం గ్రామ పంచాయతీ శీతల తండా గ్రామంలో గాలి వానకు అజ్మీరా హరి రేకుల ఇల్లు కూలింది. పులియా తండాలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. వారం పది రోజులుగా మొక్కజొన్న గింజలు, వరి ధాన్యాన్ని రోడ్లపై, కల్లాల్లో రైతులు ఆరబోసుకున్నారు. సుమారు 1000 క్వింటాళ్ల మొక్కజొన్న, ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. మామిడికాయలు నేలరాలాయి.
ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంపీటీసీ బిచ్చ
వర్షానికి తడిసిన మొక్కజొన్న, వరి పంట రైతులను ఆదుకోవాలని కొమరారం ఎంపీటీసీ అజ్మీర బిచ్చ, పోలారం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్‌ సరోజిని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు తక్షణం నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించి పరిహారం ఇప్పించాలని కోరారు. ఇండ్లు ధ్వంసమైన బాధితులకు తగు నష్టపరిహారం చెల్లించాలని తహసీల్దార్‌ను కోరారు.