వడగాల్పులు..వర్షాలు

వడగాల్పులు..వర్షాలు– సికింద్రాబాద్‌లో 4.5 సెంటీమీటర్ల వర్షం
– వడ్డేపల్లిలో 41.6 ఉష్ణోగ్రత నమోదు
– వచ్చే రెండ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో భిన్న వాతావరణం నెలకొంది. ఓ పక్క భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే మరో వైపు పలుచోట్ల వర్షం కూడా పడింది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం చల్లబడటంతో నిన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల మేర తగ్గాయి. సోమవారం సికింద్రాబాద్‌లో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కామారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్‌జిల్లాలో పలుచోట్ల వర్షం పడింది. నిజామాబాద్‌ గాంధారి మండలంలో భారీ వడగండ్ల వర్షం పడింది. సుమారు నలభై నిమిషాల సేపు ఆకాశం నుంచి వడగండ్లు పడ్డాయి. సాయంత్రం చల్లటి గాలులు వీచాయి. మంగళ, బుధ వారాల్లో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులతో తేలిక పాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. టీఎస్‌డీపీఎస్‌ నివేదిక ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, జోగులాంబ గద్వాల, జనగాం, యాద్రాద్రి భువనగిరి, సూర్యాపేట సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచాయని పేర్కొంది.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
వడ్డేపల్లి(జోగులాంబ గద్వాల) 41.6 డిగ్రీలు
జనంపేట(మహబూబ్‌నగర్‌) 41.4 డిగ్రీలు
దగడ(వనపర్తి) 41.4 డిగ్రీలు
గద్వాల 41.4 డిగ్రీలు