శీతాకాలం ఉష్ణోగ్రతలు పడిపోవడం చలిగాలుల కారణంగా జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారడం, చిట్లిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ సీజన్‌లో హెయిర్ కేర్ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో జుట్టు పొడిబారకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చూద్దాం…
సరిపడా నీళ్లు తాగండి..
శీతాకాలంలో చాలామంది నీళ్లు సరిగా తాగరు. ఈ కాలంలో తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం. శరీరం హైడ్రేట్‌గా ఉండాటనికి, కణాలు, కణజాలాలలో ఆక్సిజన్ ప్రవాహాన్ని ప్రోత్సహించడానికి, జుట్టు హెల్తీగా ఉండాటానికి, హెయిర్ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి సరిపడా నీళ్లు తాగటం చాలా అవసరం. ఈ సీజన్‌లో జుట్టు పొడిబారకుండా రక్షించుకోవడానికి.. రోజుకు కనీసం రెండు నుంచి మూడు లీటర్ల నీళ్లు తాగాలి.
సీజనల్ ఫుడ్స్ తినండి..
సీజనల్‌గా దొరికే కూరగాయలు, పండ్లు మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఇవి జుట్టుకు కూడా పోషణ అందించి, ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ సీజన్‌లో దొరికే పండ్లు, కూరగాయలు కచ్చితంగా తీసుకోవాలి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి.
వేయించిన ఆహారానికి దూరంగా…
చలికాలం జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి.. వేయించిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. శీతాకాలం రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు. మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిది. ఏదైనా అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. చర్మం, జుట్టు కణాలకు రక్తం ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలుగుతుంది.
నూనె అప్లై చేయడం మర్చిపోవద్దు..
చలికాలంలో జుట్టుకు ఎంత తరచుగా నూనె పెడితే అంత మంచిది. ఇది జుట్టులోని తేమ శాతం ఎక్కువ సమయం నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. ఇది జుట్టు పొడిబారకుండా రక్షిస్తుంది.
స్నానం ఇలా వద్దు..
ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉండి, వేడినీటితో స్నానం, తలస్నానం చేస్తూ ఉంటారు. అయితే స్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించకూడదు. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి. ఎక్కువ వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాల్లోని సహజనూనెల శాతం తగ్గిపోయి పొడిగా, నిర్జీవంగా మారతాయి.