– 72మంది ఖైదీల విడుదల ?
డేర్ అల్ బాలాహ్ (గాజా) : కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ కార్యకర్తలు మరో ముగ్గురు బందీలను శనివారం విడుదల చేసి రెడ్‌క్రాస్‌కు అప్పగించారు. వీరు ముగ్గురూ ఇజ్రాయిల్ పౌరులే. ఇందుకు ప్రతిగా 72మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయాల్సి వుంది. వీరిలో ఐదుగురు తూర్పు జెరూసలేంకు చెందిన వారు కాగా, 14మంది గాజా, 53మంది ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌కు చెందినవారు. ఏడుగురిని ఈజిప్ట్‌కు తరలించాల్సి వుంది. కాగా శనివారం విడుదలైన ఆ ముగ్గురు బందీలు బక్కపలుచగా, పాలిపోయినట్టు కనిపిస్తున్నారు. సాయుధులైన హమాస్ కార్యకర్తలు వారిని తెల్లని వ్యాన్‌లో వచ్చి, పట్టణంలో దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి తీసుకువచ్చారు. వందలాదిమంది ప్రజలు గుమిగూడి వుండగా, ఆ ముగ్గురి వద్దకు మైక్రో ఫోన్ తీసుకెళ్ళి వారిని బహిరంగంగా ఒక ప్రకటన చేయాల్సిందిగా హమాస్ కోరింది. ఆ తర్వాత వారిని రెడ్ క్రాస్ అధికారులకు అప్పగించారు. విడుదల సమయంలో ఇలా బహిరంగ ప్రకటనలు వారి చేత చేయిండం ఇదే తొలిసారి. జనవరి 19న ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బందీలను విడుదల చేయడం ఇది ఐదవసారి. శనివారం ముందు నాటికి 18 బందీలను విడుదల చేయగా, 550మంది పాలస్తీనా ఖైదీలను వదిలిపెట్టారు. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశలో మొత్తంగా 33 మంది బందీల విడుదల, దాదాపు 2వేల మంది ఖైదీలు విడుదల కావాల్సి వుంది. గాయపడిన పాలస్తీనియన్లు గాజా విడిచి ఈజిప్ట్‌కు వెళ్ళేందుకు తొలిసారిగా గత వారం అనుమతించారు.
కాగా, ఇటీవల ట్రంప్, నెతన్యాహుతో భేటీ సమయంలో గాజాపై చేసిన ప్రతిపాదన ప్రభావం ప్రస్తుత ఒప్పందం అమలుపై పడనట్టే కనిపిస్తోంది. అయితే రెండో దశపై జరగాల్సిన చర్చలను మరింత క్లిష్టతరం చేయనుంది. తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందం మార్చి ప్రారంభం వరకు అమల్లో వుంటుంది. రెండో దశలో శాశ్వతంగా కాల్పుల విరమణ జరిగితేనే, గాజా నుంచి పూర్తిగా ఇజ్రాయిల్ బలగాలు వైదొలగితేనే మరింతమంది బందీలను విడుదల చేస్తామని హమాస్ పట్టుబట్టనుంది.