ఖమ్మంలో ‘హస్తం’

– 4,67,847 ఓట్ల మెజార్టీతో
– ఆర్‌ఆర్‌ఆర్‌ భారీ విజయం
– అసెంబ్లీ ఎన్నికలకు మించి మెజార్టీ రావడంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌
– ఇది ప్రజా విజయం: మంత్రి పొంగులేటి, ఖమ్మం అభ్యర్థి రఘురాంరెడ్డి
– విజేతకు.. సీపీఐ(ఎం), సీపీఐ నేతల శుభాకాంక్షలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ఖమ్మం పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్‌ కనీవినీ ఎరుగని రీతిలో మెజార్టీ నమోదు చేస్తూ భారీ విజయాన్ని అందుకుంది. రెండు చోట్లా నియోజకవర్గ చరిత్రను తిరగరాస్తూ మెజార్టీ నమోదయింది. ఖమ్మంలో రామసహాయం రఘురాంరెడ్డి 4,67,847 ఓట్లతో తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామ నాగేశ్వరరావుపై విజయం సాధించారు. ప్రారంభం నుంచి కొన్ని రౌండ్ల వరకు ఇరువురు అభ్యర్థులు ఆధిపత్యం ప్రదర్శించారు. అసెంబ్లీ ఎన్నికలకు మించి మెజార్టీ రావడం కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ నింపింది. ఇది ప్రజా విజయమని, రఘురాంరెడ్డి ఆల్‌టైం రికార్డు నమోదు చేశారని ఖమ్మం పార్లమెంట్‌ ఎన్నికల ఇన్‌చార్జి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఖమ్మం నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆర్‌ఆర్‌ఆర్‌ ఆధిక్యత కనబరిచారు. సీపీఐ(ఎం), సీపీఐ మద్దతుతో ఇండియా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన రఘురాంరెడ్డికి 7,66,929 ఓట్లు లభించగా నామకు 2,99,082 ఓట్లు వచ్చాయి. 4,67,847 ఓట్ల మెజార్టీతో రామసహాయం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ పడగా 12,51,733 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 21 రౌండ్లలోనూ ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఆధిపత్యం సాధించలేదు. మొత్తమ్మీద గత ఎన్నికల్లో 24వేల ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 1.18 లక్షల ఓట్ల వరకు వెళ్లినా డిపాజిట్‌ దక్కించుకోలేకపోయింది.
ఇండియా కూటమి అభ్యర్థులకు వామపక్షాల శుభాకాంక్షలు
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో విజయం సాధించిన ఇండియా కూటమి అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి సీపీఐ(ఎం), సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, బాగం హేమంతరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ బంపర్‌ విజయాన్ని ప్రజా విజయంగా పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు.