– ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుదలకు తోడ్పడండి
– భారత్‌కు బిఎన్‌పి విజ్ఞప్తి
ఢాకా: బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాను తిరిగి వెనక్కి పంపించడం ద్వారా భారత్, బంగ్లా దేశ్ మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకాలని మితవాద బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) ప్రధాన కార్యదర్శి జనరల్ మీర్జా ఫక్రుల్ అలంగీర్ చెప్పారు. ఆదివారం నాడు పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షేర్-ఎ- బంగ్లా నగర్‌లోని జియావుల్ రహ్మాన్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో బలమైన సంబంధాలను తమ పార్టీ కోరుకుంటోందన్నారు. బంగ్లాదేశ్ గడ్డపై భారత్‌కు ముప్పు కలిగించే ఎలాంటి కార్యకలాపాలను బిఎన్‌పి ఎప్పటికీ అనుమతించడదని ఆయన చెప్పారు. బిఎన్‌పి అధికారంలోకి వస్తే అదానీతో హసీనా ప్రభుత్వం కదుర్చుకున్న విద్యుత ఒప్పందాన్ని పునస్సమీక్షిస్తామని చెప్పారు. ఈ ఒప్పందం బంగ్లా దేశ్ ప్రజలపై తీవ్ర విద్యుత్ భారాలను మోపుతోందని, బంగ్లా ప్రజల్లో కూడా దీనిపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. అదే సమయంలో స్వేచ్ఛామార్కెట్ ఆర్థిక సంస్కరణలను తాము విస్తృతంగా అమలు చేస్తామన్నారు. హసీనాకు ఆశ్రయం కల్పించడం ద్వారా భారత్ బంగ్లా దేశ్ ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని అలంగీర్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో మైనార్టీల భద్రత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇది తమ అంతర్గత విషయం అన్నారు. హిందువులపై దాడులకు సంబంధించిన వార్తలు కచ్చితమైనవి కావన్నారు. వీటిలో చాలా ఘటనలు మత పరంగా జరిగినవి కావు, కేవలం రాజకీయ ప్రేరేపితమైనవి మాత్రమేనని ఆయన సెలవిచ్చారు. హసీనాను బంగ్లాదేశ్‌కు తిరిగి అప్పగించకపోతే భారత్‌తో సంబంధాలు మరింత క్షీణిస్తాయని ఆయన హెచ్చరించారు. హసీనా , ఆమె పాలనలో చోటు చేసుకున్న నేరాలు, అవినీతికి బంగ్లాదేశ్ చట్టాల ప్రకారం ఆమె విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనిని ప్రారంభించాలంటే అమెను బంగ్లాదేశ్‌కు తిరిగి అప్పగించేందుకు భారత్ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అసాధారణమైన ప్రభుత్వ వ్యఈతిరేక నిరసనలు ఆగస్టు5న పతాక స్థాయికి చేరుకోవడంతో ప్రధాని హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడి భారత్‌కు పారిపోయారు.