హ్యాండ్‌బాల్‌ సంఘానికి క్రీడాశాఖ గుర్తింపు

– ఫలించిన జగన్‌మోహన్‌ రావు కృషి
– మంత్రి హారీశ్‌రావు సహా పలువురు అభినందన
న్యూఢిల్లీ : సీనియర్‌ స్పోర్ట్స్‌ అడ్మినిస్ట్రేటర్‌, తెలుగు వ్యక్తి అర్శనపల్లి జగన్‌మోహన్‌ రావు కృషి ఫలించింది. జాతీయ స్థాయిలో హ్యాండ్‌బాల్‌ పరిపాలనలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. రెండు వర్గాలను ఏకం చేసిన జగన్‌మోహన్‌ రావు..భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్‌) గుర్తింపు పొందేలా చేశారు. దిగ్విజరు సింగ్‌ చౌతాలా హెచ్‌ఏఐ అధ్యక్షుడిగా, తేజ్‌రాజ్‌ సింగ్‌ కోశాధికారిగా, జగన్‌మోహన్‌ రావు ప్రధాన కార్యదర్శిగా ఇటీవల జైపూర్‌లో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆఫీస్‌ బేరర్ల ఎన్నిక అనంతరం తొలి అడుగుగా భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి హెచ్‌ఏఐకి గుర్తింపు లభించింది. తాజాగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భారత హ్యాండ్‌బాల్‌ సంఘాన్ని హ్యాండ్‌బాల్‌ ఆటకు సంబంధించి జాతీయ క్రీడా సమాఖ్యగా గుర్తింపు అందించింది. దీంతో అంతర్జాతీయ, ఆసియా హ్యాండ్‌బాల్‌ సమాఖ్యలతో పాటు ఐఓఏ, క్రీడాశాఖ గుర్తింపు హెచ్‌ఏఐ దక్కించుకుంది. ఈ మేరకు క్రీడాశాఖ కార్యదర్శి సుధీర్‌ కుమార్‌ గుప్తా అధికారికంగా వెల్లడించారు. క్రీడాశాఖ గుర్తింపుతో ఇక నుంచి హెచ్‌ఏఐ కేంద్ర నిధులు అందుకోనుంది. జాతీయ క్రీడల్లో సైతం హ్యాండ్‌బాల్‌ను చేర్చనున్నారు. ఆసియా క్రీడలు, ఒలింపిక్స్‌ సహా అంతర్జాతీయ ఈవెంట్లకు హ్యాండ్‌బాల్‌ జట్లను ఎంపిక చేసే బాధ్యతలు భారత హ్యాండ్‌బాల్‌ సంఘం తీసుకుంటుంది. దేశంలో హ్యాండ్‌బాల్‌ కార్యక్రమాలు, పోటీలు, అభివృద్దిపై హెచ్‌ఏఐకి పూర్తి అధికారం లభించింది. ‘క్రీడాశాఖ గుర్తింపు లభించటం సంతోషం. కఠిన పరిస్థితుల్లో అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు. ఐఓఏ, క్రీడాశాఖ మద్దతుతో దేశంలో హ్యాండ్‌బాల్‌కు సరికొత్త రూపు తీసుకొస్తాం. రానున్న ఆసియా క్రీడల్లో పతకమే లక్ష్యంగా పని చేస్తామని’ జగన్‌మోహన్‌ రావు తెలిపారు.
భారత హ్యాండ్‌బాల్‌ సంఘం (హెచ్‌ఏఐ) క్రీడాశాఖ గుర్తింపు దక్కించుకోవటంలో కీలక భూమిక పోషించిన జగన్‌మోహన్‌ రావును మంత్రులు హరీశ్‌ రావు, వి. శ్రీనివాస్‌ గౌడ్‌, ఎమ్మెల్సీ కవిత, శాట్స్‌ చైర్మెన్‌ డాక్టర్‌ ఆంజనేయ గౌడ్‌, మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు సహా పలువురు సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు.